మిస్సైళ్లతో మండుతున్న మిడిల్ ఈస్ట్.. ఇరాన్ పార్లమెంట్పై అమెరికా దాడి .. యూఎస్ ఎంబసీని పేల్చేసిన ఇరాన్..

మిస్సైళ్లతో మండుతున్న మిడిల్ ఈస్ట్.. ఇరాన్ పార్లమెంట్పై అమెరికా దాడి .. యూఎస్ ఎంబసీని పేల్చేసిన ఇరాన్..

మిడిల్ ఇస్ట్ మిస్సైళ్లు, డ్రోన్లతో మార్మోగుతోంది. యుద్ధం తీవ్ర రూపం దాల్చటంతో దాడులు, ప్రతిదాడులతో బాంబుల వర్షం కురుస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దళాలు ఇరాన్ పై టార్గెట్ చేస్తుండగా.. ఇరాన్ యూఎస్ ఎంబసీలే లక్ష్యంగా యుద్ధం చేస్తోంది. ఐదు వారాల పాటు యుద్ధం ఉంటుందని.. ఇప్పుడే అసలైన యుద్ధం మొదలైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్  వార్నింగ్ ఇచ్చిన క్రమంలో.. అంతే తీవ్రతతో ఇరాన్ ప్రతిస్పందిస్తోంది. 

లేటెస్టుగా మంగళవారం (మార్చి 03) టెహ్రాన్ లోని ఇరాన్ పార్లమెంట్ పై వైమానిక దాడి జరిగింది. పార్లమెంట్ భవనం లక్ష్యంగా జరిగిన వైమానిక దాడితో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. పార్లమెంటు భవనం కొంత మేరకు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. దీనిపై ఇరాన్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

మరోవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు  కొనసాగుతున్నాయి. రియాద్ లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. అంతే కాకుండా ఇరాక్‌లోని ఎర్బిల్‌లో యూఎస్ స్థావరాలపై దాడులు చేసింది. ఎర్బిల్‌లోని యూఎస్‌ ఎయిర్‌బేస్‌పై డ్రోన్ దాడి జరిగినట్లు ఇరాన్ ప్రకటించింది. ఖాన్జాద్‌ హోటల్‌పై  కూడా డ్రోన్‌ అటాక్ చేసినట్లు వెల్లడించింది. హోటల్ లో అమెరికన్ సైనికులు ఉన్నారన్న సమాచారంతో దాడికి దిగింది.

ట్రంప్ సీరియస్:

రియాద్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడిపై ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ కు గట్టిగా బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.  ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, తయారీ కేంద్రాలను నాశనం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ నావికదళాన్ని ఇప్పటికే నాశనం చేశామన్న డొనాల్డ్ ట్రంప్.. మరింత తీవ్రంగా ఇరాన్ కు బుద్ధి చెబుతామని అన్నారు. 

వలస బాట పట్టిన జనం:

మరోవైపు ఇరాన్‌ యుద్ధ పరిణామాలతో గల్ఫ్ దేశాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.  యుద్ధ భయంతో దక్షిణ లెబనాన్‌ నుంచి భయంతో స్థానికులు వలసపోతున్నారు. బీరుట్‌, సైడాన్‌, మౌంట్‌ లెబనాన్‌, ట్రిపోలి వంటి ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. జనం ఒక్కసారిగా రావడంతో రోడ్లు కిక్కిరిసి పోతున్నాయి. 

వేలసంఖ్యలో వాహనాల్లో జనాలు వెళ్లిపోతుండటం కలచివేసే దృశ్యంగా కనిపిస్తోంది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వలస వెళ్లే క్రమంలో.. వాహనాలు లేక చాలామంది దక్షిణ లెబనాన్‌ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిరాశ్రయుల కోసం ఇప్పటికే 171కి పైగా షెల్టర్లు ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం.