హైదరాబాద్, వెలుగు: వన్యప్రాణులతోనే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందని, అడవి బాగుంటేనే మనిషి బాగుంటాడని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) వైల్డ్‌లైఫ్ వినయ్ కుమార్ అన్నారు. జీవవైవిధ్యం దెబ్బతింటే భవిష్యత్ తరాలకు ముప్పు తప్పదని తెలిపారు.
మంగళవారం హైదరాబాద్‌లోని మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కులో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినయ్ కుమార్ చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. అడవులను, జంతువులను కాపాడుకోవడం కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు దీనిని ఒక బాధ్యతగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
విద్యార్థులంతా ‘ప్రకృతి మిత్రులు’గా మారి, పర్యావరణ పరిరక్షణపై సమాజంలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
వన్యప్రాణుల ప్రాధాన్యతను చాటిచెప్పేలా విద్యార్థులు వేసిన చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు అధికారులు బహుమతులు అందజేశారు. అనంతరం పార్కులోని జింకలు, ఇతర వన్యప్రాణుల సంరక్షణ గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీసీఎఫ్ క్షితిజ, వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ శంకరన్, రంగారెడ్డి డీఎఫ్‌వో రోహిత్, వైల్డ్‌లైఫ్ డీసీఎఫ్ ఆంజనేయులు, సాయి ప్రకాశ్, పలు ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు.
