మహిళా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల కొత్త వ్యూహం.. ఆ ఫండ్స్‌లోనే పెట్టుబడి

మహిళా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల కొత్త వ్యూహం.. ఆ ఫండ్స్‌లోనే పెట్టుబడి

భారతీయ ఆర్థిక వ్యవస్థలో మహిళలు ఇప్పుడు జస్ట్ సేవింగ్స్ చేసేవారిగా మాత్రమే కాకుండా.. వ్యూహాత్మక ఇన్వెస్టర్లుగా కూడా ఎదుగుతున్నారు. ఒకప్పుడు బంగారానికో, పోస్టాఫీసు పొదుపు పథకాలకో పరిమితమైన మహిళలు.. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుంటూ మ్యూచువల్ ఫండ్స్‌ వైపు అడుగులు వేస్తున్నారు. 

దేశంలోని మొత్తం 5.34 కోట్ల మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలో మహిళల వాటా సుమారు 1.38 కోట్లకు చేరిందని ది వెల్త్ కంపెనీ డేటా ప్రకారం వెల్లడైంది. అంటే దాదాపు 26 శాతం మంది మహిళలు ఆర్థిక నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా టైర్-2 సిటీలతో పాటు అభివృద్ధి చెందుతున్న నగరాల్లోని మహిళలు కూడా ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ బాట పడుతున్నారు.

మహిళా ఇన్వెస్టర్ల పెట్టుబడి శైలిని గమనిస్తే.. వారు క్రమశిక్షణకు పెద్దపీట వేస్తున్నారు. సుమారు 56 శాతం మంది మహిళలు తమ పోర్ట్‌ఫోలియోలో మ్యూచువల్ ఫండ్స్‌ను అగ్రస్థానంలో ఉంచారు. వీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) మార్గంలోనే తమ పెట్టుబడులు పెడుతున్నారు ఎక్కువగా. నెలకు కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడుల కోసం కేటాయించడం ద్వారా దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవచ్చనే నమ్మకం వారిలో పెరిగింది. అయితే పెట్టుబడి ప్రారంభించని వారిలో అధిక శాతం మంది తమ ఆదాయంలో 10 శాతం కంటే తక్కువ మాత్రమే పొదుపు చేస్తున్నారట. సరైన అవగాహన కల్పిస్తే ఈ వర్గం కూడా పెద్ద ఎత్తున మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

ఏఏ వయస్సు మహిళలు ఎలాంటి ఫండ్స్ ఎంచుకుంటున్నారనే వివరాలను పరిశీలిస్తే.. ముందుగా 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉన్న యువతులు 'గ్రోత్ ఓరియెంటెడ్' ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని తేలింది. వీరు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడటం లేదట. ఇక 35 నుండి 50 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు తమ పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంత ఇంటి కలల కోసం బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంచుకుంటున్నారని డేటా చెబుతోంది. 50 ఏళ్లు పైబడిన వారు మాత్రం పెట్టుబడి అసలుకు సేఫ్టీ ఉండేలా డెట్ ఫండ్స్ లేదా తక్కువ రిస్క్ ఉండే లార్జ్ క్యాప్ ఫండ్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే 57 శాతం మంది మహిళలు తమకు ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి మరింత స్పష్టమైన సలహాలు కావాలని కోరుకుంటున్నారట.

ప్రస్తుతం భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ రూ.81లక్షల 90వేల కోట్ల మార్కును అందుకుంది. ఈ వృద్ధిలో మహిళల భాగస్వామ్యం కీలకమైనది. అయినప్పటికీ 46 శాతం మంది నాన్-ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్ల గురించి మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. కాంప్లెక్స్ విశ్లేషణల కంటే.. సులభంగా అర్థమయ్యే ఇన్వెస్ట్‌మెంట్ బాస్కెట్స్, ట్రాన్స్‌పరెంట్ అడ్వైజరీ సేవలు ఉంటే తాము కూడా ఇన్వెస్ట్ చేస్తామని వారు చెబుతున్నారు. భవిష్యత్తులో మహిళలు కేవలం గృహ అవసరాలకే కాకుండా.. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక భాగస్వాములుగా మారడానికి మ్యూచువల్ ఫండ్స్ ఒక శక్తివంతమైన సాధనంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు.