పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన మహా ఘట్ బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి ప్రసాద్ యాదవ్ ఉత్కంఠ పోరులో ఎట్టకేలకు విజయం సాధించారు. రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తేజస్వి యాదవ్ 14 వేల 532 ఓట్ల మెజారిటీతో తన సమీప బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్పై గెలిచారు. రాష్ట్రీయ జనతా దళ్ అభ్యర్థిగా పోటీ చేసిన తేజస్వి యాదవ్కు బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ గట్టి పోటీ ఇచ్చారు. తేజస్వి యాదవ్కు మొత్తం లక్షా 18 వేల 597 ఓట్లు పోలవగా, బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్కు లక్షా 4 వేల 65 ఓట్లు పోలవడం గమనార్హం. మొత్తం 32 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయింది.
ఒకానొక దశలో తేజస్వి యాదవ్ వెనుకంజలో ఉన్నప్పటికీ చివరి రౌండ్లలో ఆధిక్యం కనబర్చారు. ప్రశాంత్ కిషోర్ పార్టీ అభ్యర్థి చంచల్ కుమార్కు కేవలం 2 వేల 399 ఓట్లు మాత్రమే పడ్డాయంటే జన్ సూరాజ్ పార్టీ ఎంత ఘోర ఓటమిని చవిచూసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్జేడీకి సేఫెస్ట్ సీటుగా చెప్పుకునే రాఘోపూర్ స్థానం నుంచి గెలవడానికి తేజస్వి యాదవ్ ఇంత కష్టపడాల్సి రావడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
రాఘోపూర్ ఎంత సేఫెస్ట్ సీటంటే.. RJD వ్యవస్థాపకుడు.. తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి తల్లి రబ్రీ దేవి కూడా ఈ స్థానం నుంచే పోటీ చేశారు. 2015 నుంచి తేజస్వి యాదవ్ కూడా ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాఘోపూర్ స్థానం నుంచి తేజస్వి యాదవ్ 39 వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. అలాంటి స్థానం నుంచి పోటీ చేసిన తేజస్వి యాదవ్ ఎమ్మెల్యేగా నెగ్గడానికి ఈసారి చాలానే కష్టపడాల్సి వచ్చింది.
2020లో తేజస్వికి దక్కిన మెజారిటీతో పోల్చుకుంటే.. 2025 బిహార్ ఎన్నికల్లో తేజస్వి మెజారిటీ సగానికి సగం పడిపోయింది. మహా ఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచిన తేజస్వి యాదవ్ పార్టీ RJD కూడా చెప్పుకోతగిన స్థానాలను కైవసం చేసుకోలేకపోయింది. ఎన్నికల సంఘం అధికారిక డేటా ప్రకారం.. శుక్రవారం.. నవంబర్ 14న రాత్రి 8.30 గంటల సమయానికి.. 20 స్థానాల్లో గెలిచి 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం మీద పాతిక స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
