AI వాడితే.. దోపిడీలు, దొంగతనాలు, చైన్ స్నాచర్లు తగ్గాయా.. ఇది ఎలా సాధ్యం..?

 AI వాడితే.. దోపిడీలు, దొంగతనాలు, చైన్ స్నాచర్లు తగ్గాయా.. ఇది ఎలా సాధ్యం..?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వచ్చాక ప్రజల జీవితాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు  AI వాడకం వల్ల  పనులు ఈజీ అవుతుంటే..మరోవైపు  నేరాలు కూడా అంటే క్రైమ్ రేట్ కూడా పడిపోయింది.  టెక్నాలజీ పెరిగేకొద్దీ నేరగాళ్లు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. కానీ  పోలీసులు అంతకంటే వేగంగా ఆలోచిస్తూ.. నేరాలను అరికట్టడానికి 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) అనే ఆయుధాన్ని వాడుతున్నారు. దింతో గత మూడేళ్లలో నగరంలో నేరాలు తగ్గాయి. 

సిటీ పోలీసింగ్ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం వల్ల నేరాలు గణనీయంగా తగ్గాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ముఖ్యంగా దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, మహిళలపై జరిగే నేరాలు తగ్గడంలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. 2023 నుండి 2025 మధ్య  గణాంకాలు చూస్తే నేరాలు భారీగా  తగ్గాయి. గత రెండేళ్లతో పోలిస్తే ముఖ్యంగా నేరాలు చైన్ స్నాచింగ్  53% తగ్గాయి. దోపిడీలు 47% తగ్గాయి, అత్యాచార కేసులు 30% తగ్గాయి, రాత్రిపూట ఇళ్ల దొంగతనాలు 20% తగ్గాయి, మహిళలపై వేధింపులు 20% తగ్గాయి, వాహనాల దొంగతనం 19% తగ్గింది.

AI ఎలా పనిచేస్తోందంటే : 
గతంలో పోలీస్ కంట్రోల్ రూమ్  112కు  ఫోన్ వస్తే, పోలీసులు మాన్యువల్‌గా పని చేసేవారు. అంటే పోలీస్ అధికారి  కాల్ మాట్లాడి, అడ్రస్  తెలుసుకుని, ఆ తర్వాత దగ్గరలో ఉన్న పోలీస్ వాహనానికి ఫోన్ చేసి పంపించేవారు. దీనికి చాలా సమయం పట్టేది.

ఇప్పుడు AI వల్ల జరుగుతున్న మార్పుల్లో బాధితులు ఫోన్ చేయగానే AI ఆటోమేటిక్‌గా వారి లొకేషన్‌ను గుర్తు పడుతుంది. బాధితుడికి అత్యంత దగ్గరలో ఉన్న పోలీస్  వాహనానికి AI డైరెక్ట్  మెసేజ్ పంపిస్తుంది. దీనివల్ల కనీసం 2 నుండి 3 నిమిషాల సమయం ఆదా అవుతోంది. ప్రాణాపాయం లేదా గొడవలు జరుగుతున్నప్పుడు ఈ రెండు నిమిషాలు చాలా కీలకం. పోలీసులు త్వరగా ఘటనా స్థలానికి చేరుకోవడం వల్ల  గొడవలు పెద్ద అల్లర్లుగా మారకుండా అడ్డుకోగలుగుతున్నారు.

రాత్రిపూట పెట్రోలింగ్ :
గతంలో పోలీస్ వాహనాలు కాల్ వస్తేనే వెళ్ళేవి. కానీ ఇప్పుడు కాల్స్ లేని సమయంలో కూడా  రాత్రిపూట  పెట్రోలింగ్ చేస్తున్నాయి. నగరంలో ఉన్న  పోలీస్ వాహనాలు రోడ్లపై తిరుగుతుండటం వల్ల దొంగతనం చేయాలనుకునే వారికి భయం పెరుగుతోంది. నేరాలను అదుపు చేయడానికి పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా పెరిగింది.