మక్తల్ లో నాలుగు రోజుల పాటు జరిగిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఫైనల్లో పురుషుల విభాగంలో రంగారెడ్డి జిల్లా జట్టుపై వనపర్తి జిల్లా 20 పాయింట్ల తేడాతో గెలుపొందగా, మహిళల విభాగంలో రంగారెడ్డి జిల్లా జట్టు పై జోగులాంబ గద్వాల జిల్లా జట్టు 5 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఇరు జట్ల మధ్య ఆడుతున్న తీరును మంత్రి శ్రీహరి స్వయంగా వీక్షించారు. విజేతలకు శుభాకాంక్షలు తెలియజే శారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి .. నాలుగు రోజుల పాటు మక్తల్ లో అంగరంగ వైభవంగా కబడ్డీ పోటీలు జరిగాయన్నారు. 33 జిల్లాల నుంచి సుమారు 1200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు.మక్తల్ ప్రాంతానికి కబడ్డీకి అవినాభావ సంబంధం ఉందని తెలియజేశారు. మైదానం మాత్రమే క్రీడలో ఓడినా కూడా మళ్ళీ గెలిచే కసి వచ్చేలా చేస్తుందన్నారు.విద్యార్థులు చిన్న చిన్న సమస్యలకు మానసికంగా కుంగి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడలు మాత్రమే వీటన్నిటికీ పరిష్కారం చూపగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటమి గెలుపునకు తొలి మెట్టు అని క్రీడాకారులకు సూచించారు
క్రీడలపై ఆశ,శ్వాస ఉంటేనే ఉత్తమ క్రీడాకారులుగా రానిస్తారని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచాన్ని వదిలి క్రీడలపై ధ్యాస పెడితే ప్రపంచం మొత్తం మీ వైపు చూస్తుందన్నారు. మక్తల్ లో రూ. 25 కోట్లతో స్టేడియం త్వరలో నిర్మించబోతున్నట్లు మంత్రి తెలియజేశారు.రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించి మక్తల్ కు పేరు తీసుకురావాలని విద్యార్థులను ఉద్దేశించి వారికి హితబోధ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసేందుకు స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఆటలు ఆడే సమయంలో క్రీడాకారులకు ఏదైనా గాయం అయితే వారికోసం గచ్చిబౌలి లో హాస్పిటల్ నిర్మించనున్నట్లు తెలిపారు. మక్తల్ లోనిర్వహించిన కబడ్డీ పోటీలతో రాష్ట్రంలోనే గొప్ప పేరు వచ్చిందని మంత్రి వెల్లడించారు.
