ఒకప్పుడంటే పిల్లలకు శ్నాక్స్ గా పోపు వేసిన గుడాలు, పల్లీ పట్టీలు ఇస్తే తినేవాళ్లు. కానీ ఇప్పటి పిల్లలకు వెరైటీ ఫుడ్ కావాలి. అందుకే ఇలా పిజ్జా, శాండ్ విచ్ ను ఇంట్లోనే చేసిపెడితే టేస్ట్ అండ్ హెల్దీ గా ఉంటారు. మరి ఇప్పుడు అలాంగి శ్నాక్స్ ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.. !
కార్న్ ఫ్రిట్టర్స్ తయారీకి కావాల్సినవి:
- స్వీట్ కార్న్ గింజలు - ఒక కప్పు
- ఉల్లిగడ్డ తరుగు - అర కప్పు
- వెల్లుల్లి తరుగు- అరటీ స్పూన్
- పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్
- బేకింగ్ పౌడర్- ఒక టీ స్పూన్
- శెనగపిండి- ఒక టేబుల్ స్పూన్
- మైదాపిండి- ఒక టేబుల్ స్పూన్
- జీలకర్ర పొడి- అర టీ స్పూన్
- కార్న్ ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూన్
- కొత్తిమీర తరుగు-ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు- తగినంత
- కారం- ఒక టీ స్పూన్
- నూనె - సరిపడా
కార్న్ ఫ్రిట్టర్స్ తయారీ విధానం
పాన్ లో నూనె వేడి చేసి అర కప్పు స్వీట్ కార్న్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు వేసి రెండు నిమిషాలు వేగించాలి. వీటిని మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి.
మరో గిన్నెలో మైదాపిండి, శెనగపిండి, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్, ఉప్పు, కారం, సరిపడా నీళ్లు పోసి కలపాలి. అందులో గ్రైండ్ చేసిన మిశ్రమం, కొత్తిమీర తరుగు, మిగిలిన స్వీట్ కార్న్ గింజలు వేసి కలపాలి.
ముద్దలోనుంచి కొద్దికొద్దిగా పిండి తీసుకుని అప్పల్లాగా వత్తాలి. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదా పెనంపై కాల్చుకోవచ్చు
శాండ్ విచ్ తయారీకి కావాల్సినవి
- బ్రెడ్ స్లైసెస్- ఎనిమిది
- స్వీట్ కార్న్ గింజలు- మూడు కప్పులు
- కొత్తిమీర తరుగు - ఒక టేబుల్ స్పూన్
- నూనె- ఒక టీ స్పూన్
- అల్లం పేస్ట్- పావు టీ స్పూన్
- టొమాటో తరుగు- ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు- తగినంత
- చీజ్- ఒక టేబుల్ స్పూన్
శాండ్ విచ్ తయారీ విధానం
నూనె వేడి చేసి స్వీట్ కార్న్ గింజలు, అల్లం పేస్ట్ వేసి వేగించాలి. ఐదు నిమిషాల తర్వాత టొమాటో, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. రెండు నిమిషాలు వేగించాక దింపేయాలి.
బ్రెడ్ స్లైస్‌ను రెండు ముక్కలుగా కట్ చేయాలి. ఒక ముక్కకు చీజ్ రాసి, స్వీట్ కార్న్ మిశ్రమం వేయాలి. వాటి మీద చీజ్ రాసిన మరో ముక్క పెట్టాలి.
ఇలా అన్నింటినీ చేశాక, ఒక్కోటిగా శాండ్ విచ్ టోస్టర్ లేదా గ్రిల్ లో వేగించాలి. వీటిని టొమాటో సాస్ తో తింటే టేస్టీగా ఉంటాయి.
తవా కార్న్ పిజ్జా తయారీకి కావాల్సినవి
- గోధుమపిండి- రెండున్నర కప్పులు
- మైదాపిండి- అర కప్పు
- బేకింగ్ పౌదర్ -అర టీ స్పూన్
- బేకింగ్ సోడా- అర టీ స్పూన్
- చక్కెర - ఒక టేబుల్ స్పూన్
- పెరుగు- పావు కప్పు
- ఉప్పు- తగినంత
- క్యాప్సికమ్ తరుగు- పావు కప్పు
- స్వీట్ కార్న్ గింజలు- ముప్పావు కప్పు
- పిజ్జా సాస్-మూడు టేబుల్ స్పూన్లు
- ఉల్లిగడ్డ తరుగు - పావు కప్పు
- చిల్లీ ఫ్లేక్స్- కొద్దిగా
- నూనె- సరిపడా
తవా కార్న్ పిజ్జా తయారీ విధానం
ఒక గిన్నెలో గోధుమపిండి, మైదాపిండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, చక్కెర, రెండు టేబుల్ స్పూన్ల నూనె, పెరుగు, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి మెత్తగా కలపాలి.
పిండిపై పొడిబట్ట కప్పి మూడు గంటలు పక్కనపెట్టాలి. మరోవైపు నూనెలో స్వీట్ కార్న్ గింజలు, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ తరుగు, చిల్లీఫ్లేక్స్ వేగించాలి. తర్వాత పిండిని ఒక ప్లేట్లో మందంగా వత్తి పెనంపై నూనె వేసి రెండువైపులా కాల్చాలి.
దాన్ని పెనంపైనే పెట్టి, మీద నుంచి పిజ్జా సాస్ రాసి స్వీట్ కార్న్ మిశ్రమం. చీజ్ చేసి మూత పెట్టాలి. రెండు నిమిషాలు ఉడికిస్తే చీజ్ కరుగుతుంది. దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని తింటే యమ్మీగా ఉంటుంది.
