ఏఐ రోజురోజుకూ తన అభివృద్ధితో ఏకంగా మానవ మేధస్సును మించిపోతోందా? రాబోయే రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, రైటర్లనే కాకుండా ప్రాణాలు పోసే డాక్టర్లను కూడా ఏఐ రీప్లేస్ చేయబోతోందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. డాక్టర్ మనీష్ తనేజా షేర్ చేసిన ఒక క్లిప్‌లో గూగుల్ జెమిని ఏఐ ఏజెంట్ ఒక క్లిష్టమైన మెడికల్ కేస్‌ను డీల్ చేసిన తీరు చూసి వైద్య ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో కాస్తా డాక్టర్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.
ఆ వీడియోలో ఒక డాక్టర్ జెమిని ఏఐ వాయిస్ ఏజెంట్‌తో సంభాషిస్తూ ఒక రోడ్డు ప్రమాద బాధితుడి పరిస్థితిని వివరించారు. 42 ఏళ్ల వ్యక్తి తలకు తీవ్రమైన గాయమైంది, గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ మీద ఉన్నాడు. అతనికి జ్వరం వస్తోంది, ఆక్సిజన్ అవసరం పెరిగింది, చెస్ట్ ఎక్స్‌రేలో కొత్తగా కొన్ని షాడోస్ కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది? అని సదరు డాక్టర్ ఏఐని ప్రశ్నించారు. ఆశ్చర్యకరంగా.. ఆ ఏఐ ఏజెంట్ ఏమాత్రం తడబడకుండా ప్రశాంతంగా స్పందించింది. ఆ లక్షణాలన్నీ 'వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియా' వైపు మొగ్గు చూపుతున్నాయని, ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకిందని నిర్ధారించింది. జ్వరం, ఎక్స్‌రే మార్పులు, పెరిగిన ఇన్‌ఫెక్షన్ మార్కర్లను విశ్లేషించి కారణాలను వివరించింది.
అంతటితో ఆగకుండా బాధితుడి శ్వాసనాళ శాంపిల్స్‌లో మందులకు లొంగని బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు రిపోర్టులు చూపిస్తూ, అంతర్జాతీయ గైడ్‌లైన్స్ ప్రకారం ఏ మందులు వాడాలో చెప్పమని డాక్టర్ అడిగారు. కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆ ఏఐ ఏజెంట్ ఖచ్చితమైన మందుల పేర్లను, ప్రత్యామ్నాయ ఔషధాలను, వాటి డోసేజ్ వివరాలను కూడా పూసగుచ్చినట్లు ఇచ్చేసింది. ఒక అనుభవజ్ఞుడైన సీనియర్ డాక్టర్ ఇచ్చే సలహా కంటే వేగంగా.. అత్యంత నిర్మాణాత్మకంగా ఏఐ స్పందించిన తీరు నెటిజన్లను స్టన్ చేసింది.
ఈ వీడియో చూసిన వైద్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల విషయంలో యంత్రాలపై ఆధారపడటం ప్రమాదకరమని కొందరు హెచ్చరిస్తుంటే.. మరికొందరు దీనిని ఒక అద్భుతమైన సాయంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే 5 ఏళ్ల తర్వాత ఏఐ ఇంకెంత శక్తివంతంగా మారుతుందో ఊహించండి అంటూ ఒక యూజర్ కామెంట్ చేయగా, ఏఐ డాక్టర్లను రీప్లేస్ చేయదు కానీ, ఏఐని ఉపయోగించుకోవడం తెలిసిన డాక్టర్లు.. అది తెలియని డాక్టర్లను రీప్లేస్ చేస్తారని మరొకరు చాలా క్లారిటీగా వివరించారు. ఈ పరిణామాలు చూస్తుంటే.. భవిష్యత్తులో వైద్య నిర్ణయాల్లో ఏఐ పాత్ర కీలకమవ్వడమే కాకుండా, మానవ మేధస్సుకు గట్టి సవాలు విసరడం ఖాయమనిపిస్తోంది.
