రాజమండ్రి కల్తీ పాల ఘటన.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు..

రాజమండ్రి కల్తీ పాల ఘటన.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు..

రాజమండ్రిలో కల్తీ పాల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. కల్తీ పాల కారణంగా రెండురోజుల్లో నలుగురు మృతి చెందగా..పలు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాలు సరఫరా చేసిన గణేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అక్రమంగా నిర్వహిస్తున్న డైరీని సీజ్ చేసినట్లు తెలిపారు.

గణేష్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని 106 ఇళ్లకు పాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు.ఈ ఘటనకు సంబంధించి  ఇప్పటివరకు 73 శాంపిల్స్ సేకరించామని.. ఇవాళ ( ఫిబ్రవరి 23 ) సాయంత్రానికి ఫలితాలు వస్తాయని తెలిపారు అధికారులు. ఇంటింటి సర్వే కొనసాగుతోందని.. 42 మంది రైతుల నుంచి పాల సేకరణ జరుగుతోందని అన్నారు. పాల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. పాలు, పెరుగు శాంపిళ్లను ఫుడ్ సేఫ్టీ విభాగం సేకరించిందని.. ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించి సమీక్షలు చేస్తున్నామని తెలిపారు అధికారులు. 

విజయవాడ నుంచి వచ్చిన నిపుణులు శాంపిల్స్ సేకరిస్తున్నారని.. వాటి ఫలితాలు వచ్చాక మరిన్ని వివరాలు వస్తాయని తెలిపారు. కల్తీ పాల కారణంగా ఇప్పటివరకు నలుగురు మరణించారని... మరో 8 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. - ఇంటింటికి వెళ్లి రక్త నమూనాల సేకరణ కొనసాగుతోందని... ఏ లక్షణాలున్నా కంట్రోల్ రూమ్‌కు ఫోన్  ( నంబర్ : 94940 60060 ) చేయాలని సూచించారు అధికారులు.