- ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక
- ఆ పార్టీకి వరుస ఓటములే: మంత్రి వివేక్
- కేటీఆర్ నాయకత్వం కింద పనిచేయడంపై
- హరీశ్ ఆలోచించుకోవాలి
- జూబ్లీహిల్స్‌లో సోషల్ మీడియా హైప్‌తో గెలవాలనుకున్నరు.. కానీ విఫలమయ్యారు
- బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయినా..
- విజయం సాధించామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ ఫెల్యూర్ లీడర్ అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఆ పార్టీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్నదని తెలిపారు. ఆయన నాయకత్వం కింద పనిచేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్‌రావు ఆలోచించుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ఉప ఎన్నికలో కాంగ్రెస్అభ్యర్థి నవీన్‌యాదవ్ విజయం తర్వాత వివేక్‌వెంకటస్వామి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
2019లో సారు, కారు, పదహారు నినాదంతో ఎంపీ ఎన్నికలకు వెళ్లీ బీఆర్ఎస్ 7 సిట్టింగ్ సీట్లు కోల్పోయిందని తెలిపారు. తన సొంత చెల్లి కవితను సైతం కేటీఆర్ గెలిపించుకోలేక పోయారని విమర్శించారు. కేసీఆర్ తర్వాత తానే సీఎం అవుతానని ఆయన భావించారన్నారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని విమర్శించారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైందని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లలో ఆ పార్టీ కనీసం అభ్యర్థిని నిలపలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పార్టీ గెలవ లేదని.. కేటీఆర్ లీడర్ షిప్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ వీక్ స్టేజీ నుంచి చాలా స్ట్రాంగ్ అయ్యిందన్నారు. జూబ్లీహిల్స్‌లో 22 శాతం ప్లస్ ఓట్లతో బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ కంటే 14 శాతం తక్కువకు పడిపోయిందని తెలిపారు. జూబ్లీహిల్స్ఉప ఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసిపోయాయన్నారు. అయినా ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ ను ఏమీ చేయలేకపోయాయని చెప్పారు.
కేటీఆర్ నాయకత్వం అవసరమా? ఆలోచించుకోవాలి..
ఈ వరుస ఓటముల నేపథ్యంలో కేటీఆర్ లీడర్ షిప్ పార్టీకి అవసరం ఉందా..? అని బీఆర్ఎస్ ఆలోచించుకోవాలని వివేక్ వెంకటస్వామి సూచించారు. కుటుంబలో ఆస్తుల పంచాయితీ నడుస్తున్నదని.. అన్నా, చెల్లి మధ్య గొడవలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ‘‘వీక్ లీడర్ షిప్‌తో కేటీఆర్, ఆయన బావ హరీశ్ మధ్య గొడవలు వచ్చే చాన్స్ ఉంది.
ఇద్దరిలో ఎవరు బెటర్ అనేది నిర్ణయించుకోవాలి. కేటీఆర్ పార్టీని నడిపించడంలో ఫెయిల్ అవుతున్నారు. ఆయన వల్ల పార్టీకి లాభమా.. నష్టమా.. అనేది హరీశ్ ఆలోచించుకోవాలి. కేటీఆర్ కింద పనిచేయాలా? అని హరీశ్ ఆలోచించుకునే టైమ్ వచ్చింది. సోషల్ మీడియాలో హైప్‌తో గెలుస్తామనుకున్నరు. కానీ అది కూడా ఫెయిల్అయ్యింది. ప్రజలు సోషల్ మీడియాను ఫాలో అవుతారు. కానీ కేటీఆర్ లీడర్ షిప్లో కంటెంట్ లేకుంటే ఎంత ఫాలో చేసినా.. లాభం లేదు’’ అని వివేక్ అన్నారు.
