జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా.. ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ

 జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా.. ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ
  • 24,729 ఓట్ల మెజార్టీ.. జూబ్లీహిల్స్​ చరిత్రలోనే అత్యధికం
  • పల్టీలు కొట్టిన కారు.. బీఆర్ఎస్​ అభ్యర్థి మాగంటి సునీత పరాజయం
  • డిపాజిట్​ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్​రెడ్డి
  • 51 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్​
  • ప్రతి రౌండ్​లో స్పష్టమైన ఆధిక్యం 
  • మొత్తం పోలైన ఓట్లు 1,94,631.. 
  • నవీన్​ యాదవ్​కు వచ్చినవి 98,988 
  • సునీతకు 74,259.. దీపక్​రెడ్డికి 17,061 ఓట్లు
  • ఫలించిన సీఎం రేవంత్​రెడ్డి పక్కా వ్యూహం
  • అధికారంలోకి వచ్చాక ఇది రెండో బైపోల్​ విజయం
  • 2024 జూన్​లో కంటోన్మెంట్.. ఇప్పుడు జూబ్లీహిల్స్..

హైదరాబాద్​, వెలుగు: జూబ్లీహిల్స్​ గడ్డ మీద కాంగ్రెస్​ జయకేతనం ఎగురవేసింది. సరికొత్త చరిత్ర సృష్టించింది! తనకు తాను ఎదురేలేదనుకున్న కారు.. పల్టీలు కొట్టింది. మరో సిట్టింగ్​ సీటును కోల్పోయింది! కలిసి వస్తుందని కలలుగన్న కమలం.. వాడిపోయింది. డిపాజిట్​ను కూడా దక్కించుకోలేకపోయింది! జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో ఓటర్లు కాంగ్రెస్​కు పట్టం కట్టారు. నవీన్ యాదవ్​కు తిరుగులేని మెజార్టీ ఇచ్చి.. ఎమ్మెల్యేను చేశారు. బైపోల్​ ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ప్రతి రౌండ్​లోనూ కాంగ్రెస్​ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చారు. మొత్తం 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగగా.. నవీన్​ యాదవ్​ తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్​ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. 

మొత్తం పోలైన ఓట్లలో 51శాతం ఓట్లను కాంగ్రెస్​ క్యాండిడేట్​ నవీన్​ యాదవ్​ సాధించి.. నయా హిస్టరీ నెలకొల్పారు. జూబ్లీహిల్స్  నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ. ఈ ఉప ఎన్నికలో  58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్​, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మధ్యే నడిచింది. మొత్తం 1,94,631 ఓట్లు పోలవగా.. కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ ఏకంగా 98,988 ఓట్లు సాధించారు. బీఆర్​ఎస్​ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు.. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్​రెడ్డికి 17,061 ఓట్లు వచ్చాయి. 

పోస్టల్​ బ్యాలెట్​ నుంచీ..!

యూసుఫ్​గూడలోని కోట్ల విజయభాస్కర్​రెడ్డి ఇండోర్​ స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్​ ఓట్లను లెక్కించారు. పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా 101 ఓట్లు పోల్​ అవ్వగా.. ఇందులో 96 ఓట్లు చెల్లుబాటయ్యాయి. వీటిలో  కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​కు 43, బీఆర్​ఎస్​ అభ్యర్థి మాగంటి సునీతకు 25, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్​రెడ్డికి 20 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్‌‌‌‌లో వచ్చిన ఆధిక్యం, అటు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపుతో భారీగా పుంజుకుంది. రౌండ్​ రౌండ్​లో నవీన్​ యాదవ్​ మెజార్టీ పెరుగుతూ వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప పోరులో పోలైన ఓట్లలో నోటా నాలుగో స్థానంలో నిలిచింది. 

రికార్డు మెజార్టీ 

ప్రతి రౌండ్‌‌‌‌లోనూ ఆధిక్యాన్ని కనబరిచిన కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్ యాదవ్.. చివరికి 24 వేల ఓట్లకు పైచిలుకు మెజార్టీ సాధించారు. ఆయన సాధించిన 24,729 ఓట్ల మెజార్టీ జూబ్లీహిల్స్​ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీగా రికార్డు సృష్టించింది. ఇక్కడ గతంలో ఏ అభ్యర్థి కూడా ఈ స్థాయి విజయాన్ని నమోదు చేయలేదు. 2014లో మాగంటి గోపీనాథ్​కు 9,242 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆ తర్వాత 2018లో 16,004 ఓట్ల మెజార్టీ, 2023లో 16,337 ఓట్ల మెజార్టీని గోపీనాథ్​ దక్కించుకున్నారు. ఈసారి ఆ మార్క్​ను నవీన్​ యాదవ్​ దాటేశారు. భారీ మెజార్టీ దక్కడంతో కాంగ్రెస్​ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది. 

ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌‌‌‌ రెడ్డి కేవలం 17,061 ఓట్లు సాధించడంతో ఆయన డిపాజిట్​గల్లంతైంది. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్​ నియోజకవర్గం కావడం, అందులోనూ గ్రేటర్​హైదరాబాద్​లో పట్టున్న పార్టీ అయినప్పటికీ జూబ్లీహిల్స్​లో బీజేపీ ఈస్థాయికి దిగజారడంతో కమలం శ్రేణులు నిరాశలో కూరుకుపోయాయి. గతంలో బీఆర్‌‌‌‌ఎస్​కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి సునీత ..  కాంగ్రెస్​ జోరు ముందు నిలవలేకపోయారు.  ఏ రౌండ్​లోనూ బీఆర్​ఎస్​కు ఆధిక్యం దక్కలేదు. 

సీఎం పక్కా వ్యూహంతో విజయతీరాలకు..!  

హైదరాబాద్ ​కేంద్రంగా మూసీ రివర్​ ఫ్రంట్​, మెట్రో విస్తరణ, ఫోర్త్​ సిటీ లాంటి ప్రాజెక్టులను సీఎం రేవంత్​రెడ్డి ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజా ఆస్తుల పరిరక్షణకు హైడ్రాను.. డ్రగ్స్​, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఈగల్​లాంటి టీమ్​లను ఏర్పాటుచేశారు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని సీఎం పదేపదే చెప్తూ వస్తున్నారు. జూబ్లీహిల్స్​బైపోల్​ ప్రచా రంలోనూ ఆయన ఇవే అంశాలను ప్రజలకు వివరించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్​ఓటర్లు కాంగ్రెస్​కు భారీ విజయం కట్టబెట్టడంతో హైదరాబాద్​కేంద్రంగా సీఎం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజామోదం లభించినట్లయింది. ఈ జోష్​తో ఆయా ప్రాజెక్టులను సీఎం రేవంత్​మరింత వేగంగా ముందుకుతీసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

జూబ్లీహిల్స్​లో కాంగ్రెస్​ఘన విజయం వెనుక సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి వ్యూహాత్మక ప్రణాళిక ఎంతగానో పనిచేసిందని కాంగ్రెస్​ శ్రేణులు చెప్తున్నాయి. మంత్రి వివేక్​వెంకటస్వామికి జూబ్లీహిల్స్​ప్రచార బాధ్యతలను జూన్​చివర్లోనే సీఎం రేవంత్​ అప్పగించారు. ఆయన నమ్మకాన్ని నిలబెడ్తూ.. నియోజకవర్గంలో గల్లీగల్లీ తిరుగుతూ ప్రజల సమస్యలు గుర్తించి, పరిష్కరించడం ద్వారా ప్రభుత్వం మీ వెంట ఉందనే భరోసాను వివేక్​ వెంకటస్వామి కల్పించారు. మంత్రి వివేక్​కు తోడుగా ఆగస్టులో మరో ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్​, తుమ్మల నాగేశ్వర్​రావుకు సీఎం రేవంత్​రెడ్డి ఇన్​చార్జ్​ బాధ్యతలు అప్పగించడంతో ముగ్గురూ కలిసి వివిధ వర్గాలతో వరుస భేటీలు జరుపుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్​ గ్రాఫ్​పెంచారు. 

ఇక చివరి నెలలో మూడో వ్యూహంగా డివిజన్ల వారీగా మంత్రులకు ప్రచార బాధ్యతలను అప్పగించిన సీఎం.. స్వయంగా పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుచేస్తూ శ్రేణుల్లో జోష్‌‌‌‌ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేలా చర్యలు చేపట్టారు. కార్నర్‌‌‌‌ మీటింగ్స్‌‌‌‌ ఏర్పాటు చేసి రెండేండ్ల పాలనతో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు చెప్తూ.. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని  తిప్పికొట్టారు. పార్టీ అభ్యర్థిగా యువకుడు, స్థానికంగా మంచిపేరున్న నవీన్‌‌‌‌ యాదవ్‌‌‌‌ను ప్రకటించేలా హైకమాండ్​ను ఒప్పించడంలోనూ సీఎం కీలక పాత్ర పోషించారు. ఇదే విజయానికి టర్నింగ్ ​పాయింట్​అయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 

వరుసగా రెండు బైపోల్స్​లో విజయ దుందుభి

జూబ్లీహిల్స్​ విజయం అధికార పార్టీ కాంగ్రెస్​కు​ నూతనోత్తేజాన్ని ఇచ్చింది. కాంగ్రెస్​ రెండేండ్ల పాలనకు, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి, ప్రజామోదం లభించినట్లయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.  రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరింత  వేగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని వారు భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్​ విజయం సాధించింది. 2024 జూన్​లో జరిగిన కంటోన్మెంట్​ ఉప ఎన్నికలో గెలిచింది. ఇప్పుడు జూబ్లీహిల్స్​ రెండో విజయం. ఈ రెండూ బీఆర్​ఎస్​ సిట్టింగ్​ స్థానాలే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్​లో ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్​.. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు స్థానాలను సొంతం చేసుకున్నది.