- ‘నకిలీ’ క్లిప్పులను పాతరేసిన పబ్లిక్
- ఫలించని సోషల్ మీడియా మంత్రాంగం
- వీ6 ఫేక్ వీడియోలతో హల్ చల్ చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం
- తప్పుడు వార్తలతో తయారు చేసిన వెలుగు క్లిప్పింగులూ వర్కవుట్ కాలె
హైదరాబాద్: ఫేక్ క్లిప్పులతో జనాన్ని తప్పుదోవ పట్టించే ఎత్తులు జూబ్లీహిల్స్ లో పనిచేయలేదు.. పెయిడ్ సర్వేలతో మైండ్ గేమ్ ఆడాలని చూసిన బీఆర్ఎస్ కు ఓటరు తగిన గుణపాఠం చెప్పాడు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రికార్డు మెజార్టీ సాధించారు. 16 ఏండ్ల తర్వాత జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. వీ6 ఫేక్ వీడియో క్లిప్పింగులతో, వెలుగు పత్రిక నకిలీ క్లిప్పింగులను తయారు చేసి సోషల్ మీడియాలో తప్పినా ఫలితం దక్కలేదు. దీంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా డీలా పడిపోయింది. ఆఖరుకు ఎన్నికల రోజు కూడా వీ6 వీడియో క్లిప్పులను బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లు తిప్పారు.
కాంగ్రెస్ చేతులెత్తేతసిందని పేర్కొంటూ వీడియోలు క్రియేట్ చేసినా ఆ పార్టీకి ఓటరు కర్రు కాల్చి వాత పెట్టాడు. వెలుగు దినపత్రిక పేరుతో పుంఖాను పుంఖాలుగా పత్రికా క్లిప్పులను తయారు చేశారు. వార్త వెలుగు అని మరోటని పేర్కొంటూ మంత్రుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. చివరి అస్త్రంగా మంత్రి తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయాలని చెప్పినట్టు ఓ క్లిప్పింగ్ తయారు చేసి పోస్ట్ చేశారు. ఈ ఎత్తులన్నింటినీ జనం చిత్తు చేశారు. అభివృద్ధికి పట్టం కట్టారు. అధికార పార్టీకి విజయం చేకూర్చారు.
ఫేక్ సర్వేలతో మైండ్ గేమ్
ప్రీపోల్ సర్వేల పేరుతో పకడ్బందీగా ఆడిన మైండ్ గేమ్ కూడా గులాబీ పార్టీని గట్టెక్కించలేదు పోయింది. జనం తమ వైపే ఉన్నట్టు ప్రచారం చేశారు. కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోలను భారీ గా ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రచారాన్ని రక్తి కట్టిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కేకే సర్వే వర్కవుట్ అవుతుందని భావించినా అదీ గట్టెక్కించలేదు.
►ALSO READ | జూబ్లీహిల్స్ గెలుపు మా బాధ్యతను మరింత పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి
ఐఐటీ కాన్పూర్ తో సర్వే చేయించినట్టు మరో ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారు. భారీ మెజార్టీ పక్కా అంటూ సామాజిక మాధ్యమాల్లో తిప్పారు. ఇంత చేసినా బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవి చూసింది.
రెండోసారీ సింపథీ పని చేయలే
దుబ్బాక, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ లలో బీఆర్ఎస్ కు సింపథీ పనిచేయలేదు. కేవలం నాగార్జున సాగర్ లో మాత్రమే నోముల నర్సింహయ్య మరణం తర్వాత ఆ పార్టీ నుంచి బరిలోకి దిగిన నర్సింహయ్య కుమారుడు భగత్ విజయం సాధించారు. అది కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉండటం వల్లే సాధ్యమైంది.
