జనగామ అర్బన్, వెలుగు : 50 శాతం రాయితీతో రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు జిల్లాలో అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఎస్ఎంఏఎం పథకంలో భాగంగా జనగామ జిల్లాకు 2025--26 నికి గాను రూ.2.73 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఈ పథకంలో బ్యాటరీ పంపులు, తైవాన్ పంపులు, రోటవేటర్లు, విత్తనాలు నాటే మిషన్లు, కేజీ వీల్స్, కలుపు తీసే యంత్రాలు, గడ్డికట్టె యంత్రాలు, డ్రోన్లు, ట్రాక్టర్లు, నాగలి, పవర్ టిల్లర్ పరికరాలు మంజూరయ్యాయన్నారు.
రైతులకు నచ్చిన పరికరాన్ని ఎన్నుకొని సంబంధిత కంపెనీలకు రాయితీ పోను మిగతా డబ్బులు డీడీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ అధికారులకు దరఖాస్తులు ఇస్తే రూ.లక్ష లోపు ధర ఉన్న పరికరాలను మండల కమిటీ, అంతకన్నా ఎక్కువ విలువైన పరికరాలను జిల్లా కమిటీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. కాగా, ప్రతిరైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ప్రత్యేక ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీని పొందాలని కలెక్టర్ సూచించారు
