బీహార్ రిజల్ట్స్: కూటమిలో ఓడినా పార్టీగా గెలిచింది.. బీజేపీ, జేడీయూ కంటే ఎక్కువ ఓట్ షేర్ సాధించిన ఆర్జేడీ

బీహార్ రిజల్ట్స్: కూటమిలో ఓడినా పార్టీగా గెలిచింది.. బీజేపీ, జేడీయూ కంటే ఎక్కువ ఓట్ షేర్ సాధించిన ఆర్జేడీ

బీహార్ ఎన్నికల ఫలితాల సందర్భంగా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారంపై ఎన్నో ఆశలు పెంచుకున్న కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి అయిన మహాగట్బంధన్ ఘోరపరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మించి అధికార ఎన్డీఏ కూటమి గెలుపును నమోదు చేయబోతోంది. 

అయితే బీహార్ ఎన్నికల సందర్భంగా అందరి చూపు ఆర్జేడీ, ఆ పార్టీ సీఎం క్యాండెట్ తేజస్వీయాదవ్ పైనే ఉంటూ వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత, తేజస్వీ వినూత్న ప్రచారం, యువతలో ఉన్న ఆకర్షణకు.. కాంగ్రెస్ తోడు కావటంతో గెలుపు ఖాయం అని భావించారు ఆ కూటమి సభ్యులు. కానీ ఫలితాలు అందుకు అనుకూలంగా రాలేదు. కూటమి పరంగా ఓడినప్పటికీ.. పార్టీ పరంగా ఆర్జేడీ గెలిచినట్లే చెబుతున్నారు విశ్లేషకులు.

ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా.. పార్టీ పరంగా బీజేపీ, జేడీయూ కంటే ఎక్కువ ఓట్ షేర్ సాధించి ఆశ్చర్యానికి గురిచేసింది ఆర్జేడీ. 2010 నుంచి ఎదురవుతున్న వరుస పరాజయాల పరంపర కొనసాగుతున్నా.. ఈసారి అధికార పార్టీలను మించి ఓట్ షేర్ సాధించడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అంటున్నారు.

►ALSO READ | గెలిస్తే డిప్యూటీ సీఎం.. కానీ ఒక్క చోట కూడా ఖాతా తెరవలే.. బీహార్లో ఆ పార్టీ పరిస్థితి దారుణం..!

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నితీస్ కుమార్ - జేడీయూ 18.87 శాతం ఓట్లు సాధించింది. అదే సమయంలో బీజేపీ 20.98 శాతం ఓట్లు రాబట్టింది. కానీ ఆర్జేడీ ఈ రెండు పార్టీల కంటే ఎక్కువ శాతం ఓట్లు రాబట్టి ఆశ్చర్యానికి గురిచేసింది. 22.84 శాతం ఓట్లతో.. ఓట్ల శాతం పరంగా ఫస్ట్ ప్లేస్ సాధించింది. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 143 స్థానాల్లో పోటీ చేసి అంత ఓటింగ్ సాధించడం టర్నరౌండ్ స్టోరీగా చెబుతున్నారు. ఇంకా పూర్తి స్థాయి రిజల్ట్స్ రావాల్సి ఉంది. 

ఇక బీహార్ ఎన్నికల్లో ఫస్ట్ ఫేస్ పోలింగ్ 2025  నవంబర్ 6న, సెకండ్ ఫేస్ నవంబర్ 11 న జరిగింది. ఈ ఎన్నికల్లో 1951 తర్వాత అత్యధికంగా 66 శాతానికిపైగా ఓటింగ్ నమోదుకావడం గమనార్హం.