వడ్డీ రేట్లు మారలే.. 5.25 శాతం వద్దే రెపో రేటు

వడ్డీ రేట్లు మారలే.. 5.25 శాతం వద్దే  రెపో రేటు
  •     వృద్ధి అంచనా 7.4 శాతానికి పెంపు
  •     దృవ్యోల్బణం అంచనా 2.1 శాతానికి పెంపు

న్యూఢిల్లీ:ఆర్​బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కీలకమైన రెపో రేటును మార్చలేదు.  5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తామని  ప్రకటించింది. ఈ నెల 4–6 తేదీల మధ్య జరిగిన కమిటీ సమావేశం వివరాలను ఆర్​బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు.  పాలసీ వైఖరిని న్యూట్రల్‌‌గానే ఉంచుతున్నట్లు ప్రకటించారు. 

గత ఫిబ్రవరి నుంచి మూడు సార్లు, మొత్తం 100 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును ఆర్​బీ తగ్గించింది.  2026 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను  7.3 శాతం నుంచి 7.4 శాతానికి పెంచింది.  2027 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో వృద్ధి 6.9 శాతం, రెండో క్వార్టర్ లో 7 శాతం ఉండవచ్చని పేర్కొంది. అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ ప్రైవేట్ వినియోగం, స్థిర పెట్టుబడులు దేశీయ వృద్ధికి తోడ్పడుతున్నాయని సంజయ్​ తెలిపారు. సేవా రంగంతో పాటు తయారీ రంగం పుంజుకోవడంతో 2026 ఆర్థిక సంవత్సరంలో రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్‌‌ (జీవీఏ) వృద్ధి 7.3 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. ద్రవ్యోల్బణం అంచనాలను సైతం 2 శాతం నుంచి 2.1 శాతానికి పెంచారు. బంగారం మినహాయించి ప్రధాన ద్రవ్యోల్బణం డిసెంబర్‌‌‌‌ 2025లో 2.6 శాతం వద్ద స్థిరంగా ఉందని గవర్నర్ తెలిపారు. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ ద్రవ్యోల్బణం 3.2 శాతం ఉండవచ్చని అన్నారు. 

మోసపోతే రూ.25 వేల పరిహారం 

  •     మోసాల నుంచి కస్టమర్లను రక్షించేందుకు ఆర్​బీఐ చర్యలను ప్రకటించింది.  తప్పుదారి పట్టించే అమ్మకాలు, లోన్​ రికవరీ ఏజెంట్ల నియంత్రణకు కొత్త మార్గదర్శకాలు తీసుకువచ్చింది. అనధికారిక ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో కస్టమర్ల బాధ్యతను పరిమితం చేసింది. చిన్నపాటి ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు రూ.25 వేలు వరకు నష్టపరిహారం ఇవ్వాలని 
  • ప్రతిపాదించింది.
  •     అందరికీ ఆర్థిక సేవలను అందించడంలో భాగంగా కిసాన్ క్రెడిట్ కార్డ్, లీడ్ బ్యాంక్ స్కీమ్ నిబంధనలను సమీక్షించాలని నిర్ణయించింది. ఎంఎస్ఎంఈ రంగానికి ఇచ్చే  తనఖా లేని లోన్ల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు పెంచింది. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా బ్యాంకులు రీట్స్‌‌లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించింది.
  •     సహకార బ్యాంకులను బలోపేతం చేసేందుకు మిషన్ సాక్షం పేరుతో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించి, 1.40 లక్షల మందికి శిక్షణ ఇస్తామని ప్రకటించింది.  పట్టణ సహకార బ్యాంకుల హోంలోన్​ నిబంధనలను సడలించి ఆర్థిక పరిమితులను పెంచింది.
  •     నాన్​ బ్యాంకింగ్ ​ఫైనాన్స్ ​కంపెనీల వ్యాపార నిర్వహణ సులభతరం చేస్తామని హామీ ఇచ్చింది. రూ.వెయ్యి కోట్ల లోపు ఆస్తులు ఉండి, ప్రజల నిధులతో సంబంధం లేని సంస్థలకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.  వెయ్యి కంటే ఎక్కువ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌లు తెరవడానికి ముందస్తు అనుమతి అవసరం లేదని ప్రతిపాదించింది.
  •     ద్రవ్య మార్కెట్ సంస్కరణల్లో భాగంగా వాలంటరీ రిటెన్షన్ ​రూట్​ (వీఆర్ఆర్) కింద ఉన్న రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడి పరిమితిని తొలగించింది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహించి కేవైసీపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.