సుప్రీం తీర్పుపై కేంద్రం జోక్యం చేసుకోవాలి : ఏఐ జాక్టో

సుప్రీం తీర్పుపై కేంద్రం జోక్యం చేసుకోవాలి : ఏఐ జాక్టో
  •     కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ఏఐ జాక్టో విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వెంటనే జోక్యం చేసుకోవాలని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఏఐ జాక్టో) ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్ లో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ భేటీలో ఏఐ జాక్టో స్టీరింగ్ కమిటీ సభ్యులు సీఎన్ భార్తి, చావ రవి, కత్తి నరసింహారెడ్డి, బసవరాజ్ గురికార్, కమలాకాంత త్రిపాఠి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా 30 లక్షల మంది ఉపాధ్యాయులు ప్రభావితం అవుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. టెట్ సిలబస్, అర్హత మార్కుల విషయంలో సడలింపు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే, తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ.. సుప్రీంకోర్టు రెండు, మూడు సందర్భాల్లో ఉపాధ్యాయులు అందరూ టెట్ పాస్ కావాలని తీర్పు ఇచ్చిందని, దానిని ఎలా అధిగమించాలో న్యాయ నిపుణులతో ఆలోచన చేస్తున్నామని చెప్పినట్లు ఉపాధ్యాయ నేతలు మీడియాకు తెలిపారు. 

ఈ అంశంపై నిర్దిష్టమైన హామీని ఇవ్వలేదన్నారు. సీపీఎస్ రద్దు, ప్రాథమిక ఉపాధ్యాయులకు ఓటు హక్కు, కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు, జాతీయ విద్యా విధానంలో నష్టం కలిగించే అంశాల రద్దు తదితర సమస్యలపైనా కేంద్ర మంత్రి దాటవేసే ధోరణితో వ్యవహరించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరాగా..సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.