పార్టీ ఫిరాయింపుల పై మరో 3 వారాల గడువు : సుప్రీం కోర్టు

పార్టీ ఫిరాయింపుల పై మరో 3 వారాల గడువు : సుప్రీం కోర్టు
  •     అప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కార చర్యలపై ఆలోచిస్తాం
  •     స్పీకర్​కు సుప్రీం హెచ్చరిక

న్యూఢిల్లీ, వెలుగు: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు మరో మూడు వారాల గడువు ఇచ్చింది. అప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కార చర్యల గురించి ఆలోచిస్తామని హెచ్చరించింది. బీఆర్ఎస్ బీ ఫారంతో కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ సుప్రీంకోర్టులో గతేడాది జనవరి15న స్పెషల్ లీవ్ పిటిషన్(సివిల్) దాఖలు చేశారు. 

అదేరోజు ఎమ్మెల్యేలు పరిగె శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, టీ ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ సుప్రీంలో రిట్ పిటిషన్(సివిల్) కూడా వేశారు. 

ఇదే అంశంపై మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా స్పెషల్ లీవ్ పిటిషన్(సివిల్) దాఖలు చేశారు. ఈ అన్ని పిటిషన్లపై గతంలో సీజేఐ ధర్మాసనం విచారణ జరిపి గత జులై 31 వరకు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించారు. అయితే, స్పీకర్ కార్యాలయం ఈ మూడు నెలల కాలం ముగిసే సమయానికి మరింత గడువు కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై శుక్రవారం జస్టిస్‌‌ సంజయ్‌‌ కరోల్‌‌, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసీహ్ బెంచ్ మరోసారి విచారణ జరిపింది.  

మరింత టైం ఇవ్వండి: స్పీకర్ తరపు అడ్వకేట్ 

తొలుత స్పీకర్‌‌ తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ.. మొత్తం10 అనర్హత పిటిషన్లలో ఎనిమిదింటిని స్పీకర్‌‌ పరిష్కరించారని కోర్టుకు నివేదించారు. గత విచారణ తరువాత జరిగిన పురోగతిని బెంచ్ కు నివేదించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నందున ఎమ్మెల్యేలు కొంత సమయం అడిగారని తెలిపారు. అందువల్ల మిగిలిన రెండు పిటిషన్ల పరిష్కారానికి మరో మూడు వారాల టైం కోవాలని కోరారు. మార్చి నెల మధ్యలోగా మిగిలిన వాటిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని కోర్టుకు వివరించారు.  

అప్పుడు ఆలోచిస్తాం: బెంచ్ 

పిటిషనర్ల తరపు అడ్వకేట్ మోహిత్ రావు వాదిస్తూ.. మరింత గడువు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. దాదాపు16 నెలలుగా ఈ కేసు నడుస్తోందని, ఉద్దేశపూర్వకంగానే విచారణలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకునేలా చూడాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. గత ఆదేశాల ప్రకారం కేసులో పురోగతిని స్పీకర్ కార్యాలయం తెలిపిందని చెప్పింది. 

మరో మూడు వారాలు టైం ఇస్తున్నట్లు వెల్లడించింది. అప్పటికీ స్పీకర్ ఆఫీసు నిర్ణయం తీసుకోకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలపై ఆలోచిస్తామని పేర్కొంది. కాగా, కోర్టులో జరిగిన వాదనలను సోషల్ మీడియాలో పలువురు అడ్వకేట్లు, ఇతరులు వైరల్ చేస్తున్న అంశంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటివి చేయవద్దని హెచ్చరించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.