హుస్నాబాద్, వెలుగు: తెలంగాణను తిట్టిన పవన్ కల్యాణ్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోవడాన్ని ఉద్యమకారులు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో శుక్రవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. డప్పు కొట్టి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బడ్జెట్‌లో రాష్ట్రానికి సరైన నిధులు ఇవ్వని బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులను ప్రజలు ఎప్పటికీ క్షమించబోరన్నారు. హుస్నాబాద్‌లో ప్రధాన రహదారిపై ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పట్టణ గౌరవం పెరగాలంటే పాలకవర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీదే కావాలని ఓటర్లను కోరారు. గత పదేళ్లలో జరగని అభివృద్ధిని తమ ప్రభుత్వం రెండేళ్లలోనే చేసి చూపిందన్నారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ, 250 పడకల దవాఖాన, ఇండస్ట్రియల్ పార్క్, గౌరవెల్లి ప్రాజెక్టులను వేగవంతం చేశామని తెలిపారు.
అనంతరం టెన్త్, ఇంటర్ పరీక్షలపై బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్, గురుకులాల సెక్రటరీ సైదులుతో కలిసి జూమ్ సమావేశం నిర్వహించారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు.
