చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌ గా వినయ్ కుమార్ : రాష్ట్ర ప్రభుత్వం

చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌ గా వినయ్ కుమార్ : రాష్ట్ర ప్రభుత్వం

హైద‌రాబాద్, వెలుగు: చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌గా ఐఎఫ్‌ఎస్ అధికారి వినయ్‌ కుమార్ (పీసీసీఎఫ్)‌ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్‌కు చెందిన వినయ్‌ కుమార్‌‌కు 3 దశాబ్దాలకుపైగా అటవీ పరిపాలన అనుభవం ఉన్నది. గతంలో అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదలశాఖల్లో వివిధ కీలక హోదాల్లో సేవలందించారు.  

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్‌గా పనిచేశారు.  వరల్డ్ బ్యాంక్, జైకా సహకారంతో అమలైన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. నీటి వనరుల సుస్థిర నిర్వహణలో చేసిన కృషికి 2014లో ఐక్యరాజ్యసమితి ‘వాటర్ ఫర్ లైఫ్’ అవార్డులో ఫస్ట్ రన్నరప్​గా గౌరవం పొందారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తానని వినయ్  చెప్పారు.