ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి..ఫేక్ ప్రచారం.. బూమరాంగ్

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి..ఫేక్ ప్రచారం.. బూమరాంగ్
  • కాంగ్రెస్​కు 40 నుంచి 48% మధ్యే ఓట్​ షేర్​ ఉంటుందన్న పలు సంస్థలు
  • వాస్తవానికి దగ్గరగా 50 నుంచి 55% మధ్య అంచనా వేసిన ‘వీ6 వెలుగు’
  • బీఆర్ఎస్​కు బెడిసికొట్టిన ఫేక్​ ప్రచారం..
  • తుస్సుమన్న పెయిడ్​ సర్వేలు 
  • వీ6 – వెలుగు పేరిట ఫేక్  వీడియోలు,
  • నకిలీ క్లిప్పింగ్​లు వైరల్​ చేసిన గులాబీ టీమ్​
  • గూబ గుయ్యిమనిపించిన జూబ్లీహిల్స్​ ఓటర్లు

హైదరాబాద్​, వెలుగు: జూబ్లీహిల్స్  ఉప ఎన్నిక ఫలితం ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను మించి నమోదైంది. బీఆర్​ఎస్​ చేసిన ఫేక్​ ప్రచారం బెడిసికొట్టింది. పెయిడ్ సర్వేలు తుస్సుమన్నాయి. పలు సంస్థలు ఎగ్జిట్​ పోల్స్​లో ఇచ్చిన ఓట్​ షేర్, మెజార్టీ లెక్కలు తుది ఫలితంలో తలకిందులయ్యాయి. ఈ నియోజకవర్గంలో చాలా సర్వే సంస్థలు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంటుందని, మెజార్టీ తేడా కేవలం 10 వేలలోపే ఉంటుందని, కాంగ్రెస్​కు 40 నుంచి 48 శాతం మధ్యనే ఓట్​ షేర్​ దక్కుతుందని అంచనా వేశాయి. 

అయితే.. కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ 24,729 ఓట్లతో రికార్డు మెజార్టీని, 51 శాతం ఓట్లను సాధించి ఆ అంచనాలన్నింటినీ పటాపంచలు చేశారు. కొన్ని సర్వే సంస్థలు పోలింగ్ సరళిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని రిజల్ట్స్​ స్పష్టం చేస్తున్నాయి. అయితే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ‘వీ6 వెలుగు’ నిర్వహించిన సర్వే తుది ఫలితాల సరళికి అత్యంత దగ్గరగా నిలిచింది.

పక్కాగా లెక్కగట్టిన ‘వీ6 వెలుగు’ సర్వే 

ఇతర సర్వేలు కాంగ్రెస్​ అభ్యర్థికి 10 వేలలోపు మెజార్టీ ఉంటుందని పేర్కొనడమే కాకుండా 48 శాతం లోపే ఓట్లు వస్తాయని ప్రకటించాయి. అయితే  వీ6 వెలుగు సర్వే మాత్రం ఫలితానికి దగ్గరగా అంచనా వేసింది. 50 నుంచి 55 శాతం ఓట్లను అధికార పార్టీ అభ్యర్థి సాధిస్తారని లెక్క గట్టింది. తుది ఫలితంలో ఆ మార్క్​ స్పష్టంగా కనిపించింది. 

వీ6 వెలుగు సర్వేలో.. క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి సేకరించిన సమాచారం, శాంపిల్ పరిమాణం, విశ్లేషణ పద్ధతులు ఎంత కచ్చితంగా ఉన్నాయో ఫైనల్​ రిజల్ట్స్​​తో  రుజువైంది.  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి వచ్చే ఓట్ల శాతం సింగిల్ డిజిట్‌‌‌‌కే పరిమితమవుతుందని అన్ని సర్వే సంస్థలు ముక్త కంఠంతో చెప్పగా అదే జరిగింది. గత ఎన్నికల్లో 14.11% (25,866) ఓట్లు సాధించిన బీజేపీ.. ఈసారి కేవలం 6% నుంచి 9.31% మధ్యే ఓట్లు పొందనుందని అంచనా వేశాయి. అదే స్థాయిలో 8.76 శాతం ఓట్లు వచ్చాయి. 

ఇంతలా బీజేపీకి ఓట్లు తగ్గడానికి ప్రధాన కారణం ఆ పార్టీ  ఈ ఎన్నికను సీరియస్‌‌‌‌గా తీసుకోకపోవడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు. ముఖ్యంగా.. బీజేపీకి చెందిన సంప్రదాయ ఓటర్లు చాలా వరకు అధికార పార్టీకి అనుకూలంగా మొగ్గు చూపినట్లుగా సర్వేలు సూచిస్తున్నాయి. బీఆర్​ఎస్​కు అన్ని సంస్థలు ఎగ్జిట్​ పోల్స్​లో 42 శాతానికి పైగా ఓట్లు వస్తాయని ప్రకటించాయి. అయితే దాన్ని తలకిందులు చేస్తూ 38 శాతానికే ఆ పార్టీ పరిమితమైంది.

ఫేక్​ ప్రచారం.. బూమరాంగ్​

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌‌‌‌ఎస్ పార్టీ నమ్ముకున్న ఫేక్ ప్రచారం బూమరాంగ్​ అయింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని.. ఆ పార్టీ సర్క్యులేట్​ చేసిన ఫేక్​ వీడియోలు, నకిలీ క్లిప్పింగ్​లను జనం తిప్పికొట్టారు. గూబ గుయ్యుమనిపించారు. తమ అభ్యర్థే గెలుస్తారని, తమకు పోటీ లేదనే విధంగా గులాబీ టీమ్​ చూపించిన చిత్ర విచిత్రాలు  ఆ పార్టీకే ఎదురుతిరిగాయి. కేవలం భావోద్వేగాలను, అబద్ధపు ప్రచారాన్ని నమ్ముకున్నందునే బీఆర్​ఎస్  ఓడిపోయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

ఫేక్ ప్రచారంతో ప్రజల ఆలోచనలు మార్చాలని చూసినా.. జనం మాత్రం కాంగ్రెస్​కే ఓటేశారని చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వీ6 టీవీ​, వెలుగు దినపత్రిక లోగోలతో నకిలీ వీడియో క్లిప్పింగ్‌‌‌‌లు, తప్పుడు వార్తలను బీఆర్​ఎస్​ సోషల్​ మీడియా టీమ్​ సృష్టించి..  వైరల్ చేసింది. తమ అభ్యర్థికి అనుకూలంగా, ప్రత్యర్థికి వ్యతిరేకంగా అవాస్తవాలను సోషల్​ మీడియాలో తిప్పింది. దీనిపై వీ6 వెలుగు యాజమాన్యం  తక్షణమే స్పందించి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ లోగోతో వస్తున్న ఫేక్​ వీడియోలను, తప్పుడు వార్తలను నమ్మొద్దని ఓటర్లను అప్రమత్తం చేసింది.

పెయిడ్​ సర్వేలు.. తుస్సు తుస్సు

బై పోల్​కు ముందు వచ్చిన కొన్ని ‘పెయిడ్​ సర్వేలు’ తుది ఫలితంలో తుస్సుమన్నాయి. ఈ సర్వేల ద్వారా తమ అభ్యర్థికే విజయం దక్కుతుందని, గట్టి పోటీ ఇస్తున్నామని బీఆర్‌‌‌‌ఎస్ వర్గాలు పదేపదే ప్రచారం చేసుకున్నాయి. 

అయితే.. ఈ ‘పెయిడ్​ సర్వేలు’ క్షేత్రస్థాయిలోని వాస్తవాలకు దూరంగా, కేవలం కొందరిలో మానసిక ఉత్సాహాన్ని కలిగించే ఉద్దేశంతోనే రూపొందించినట్లు ఓట్ల లెక్కింపులో బట్టబయలైంది. డబ్బులిచ్చి తమకు అనుకూలంగా ఫలితాలను రాబట్టుకోవడానికి చేసిన ఇలాంటి ప్రయత్నాలు ఓటర్లను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి.