- 2016 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో 7 బైపోల్స్
- ఎమ్మెల్యేల అకాల మరణంతో వచ్చినవి ఐదు
- ఇందులో 4 సార్లు సిట్టింగ్ స్థానాలను నిలుపుకోలేకపోయిన పార్టీలు
- అందులో మూడు బీఆర్‌ఎస్‌వే..
- సానుభూతి కన్నా అభ్యర్థిని చూసే జనాలు ఓటేస్తున్నరంటున్న విశ్లేషకులు
హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి దురదృష్టవశాత్తూ చనిపోతే.. ఆ అభ్యర్థి ప్లేస్‌లో నిల్చుండే కుటుంబ సభ్యుడు లేదా క్యాండిడేట్‌కు సానుభూతి కలసివచ్చేది. కానీ, గత కొన్నేండ్లలో ఈ పరిస్థితి మారిపోయింది. ప్రజలు సెంటిమెంట్‌ను పట్టించుకోవడం లేదు. తమకు ఏ అభ్యర్థి మంచి చేస్తారో ఆలోచించుకొని ఓటేస్తున్నారు.
సిట్టింగ్ స్థానమైనా సరే లేదంటే మరో పార్టీ అభ్యర్థి అయినా.. వారిలో ఎవరు బెటర్ అని సరిపోల్చుకుంటున్నారు. ఇటీవలి కాలంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతున్నది. రాష్ట్రంలో 2016 నుంచి 7 ఉప ఎన్నికలు జరగ్గా.. అందులో 5 బైపోల్స్ ఎమ్మెల్యేల అకాల మరణంతో వచ్చినవే. ఈ ఐదింట్లో 4 సార్లు సిట్టింగ్ స్థానాలను పార్టీలు నిలుపుకోలేకపోయాయి.
ఐదు ఉప ఎన్నికల్లో.. నాలుగు అంతే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఐదు ఉప ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్యేల అకాల మరణాలతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆ ఐదు ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను ఆయా పార్టీలు నిలబెట్టుకోలేకపోయాయి. ఇందులో 3 సిట్టింగ్ స్థానాలను బీఆర్ఎస్సే కోల్పోవడం గమనార్హం. మరో ఉప ఎన్నికలో కాంగ్రెస్ సీటును బీఆర్ఎస్ దక్కించుకున్నది. ఈ నాలుగు సందర్భాల్లోనూ జనం సెంటిమెంట్‌ను పట్టించుకోలేదు. సానుభూతితో ఓట్లేయలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2016లో మొదటి ఉప ఎన్నిక వచ్చింది.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రాంరెడ్డి వెంకట్‌రెడ్డి.. సీపీఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రంపై విజయం సాధించారు. 2016లో ఊపిరితిత్తుల సమస్యతో ఆపరేషన్ చేయించుకున్న ఆయన.. ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే మరణించారు. దీంతో అక్కడ ఉప ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ తరఫున వెంకట్‌రెడ్డి భార్య సుచరితను బరిలోకి దింపారు.
అప్పటి బీఆర్ఎస్ పార్టీ నుంచి తుమ్మల నాగేశ్వర్ రావు పోటీ చేసి గెలుపొందారు. 2020 ఉప ఎన్నికలూ ఇదే కోవలోకి వస్తాయి. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాక నుంచి విజయం సాధించారు. ఆయన 2020లో గుండెపోటుతో మరణించారు. దీంతో అదే ఏడాది ఉప ఎన్నికలు నిర్వహించగా.. బీఆర్ఎస్ పార్టీ రామలింగారెడ్డి భార్య సుజాతను బరిలోకి దించింది.
ఆమెపై బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. సాధారణ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన రఘునందన్‌రావు.. ఉప ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 కంటోన్మెంట్ ఉప ఎన్నికలు, 2025 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తన రెండు సిట్టింగ్సీట్లను కోల్పోయింది.
నాగార్జునసాగర్ ఒక్కటి మినహాయింపు..
సానుభూతి విషయంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలొక్కటి మినహాయింపుగా చెప్పుకోవచ్చు. ఆ బైపోల్‌లో బీఆర్ఎస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ తరఫున నోముల నర్సింహయ్య విజయం సాధించారు. కానీ, 2020లో కరోనాతో బాధపడుతూ డిసెంబర్‌లో చనిపోయారు. దీంతో 2021లో ఆ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించగా..బీఆర్ఎస్ పార్టీ నోముల నర్సింహయ్య కొడుకు నోముల భగత్‌కు టికెట్ ఇచ్చింది.
ఆయన కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై విజయం సాధించారు. ఇక్కడ మాత్రం కొంత సానుభూతి పనిచేసింది. అయితే, అన్ని సార్లూ సానుభూతి పనిచేయదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలు పార్టీలు నిలబెడుతున్న అభ్యర్థులనూ చూస్తున్నారని అంటున్నారు. ‘ఎవరైతే తమకు మంచి చేస్తారు.. సమస్యలను పరిష్కరిస్తారు’ అని భావిస్తారో వారికే ప్రజలు ఓట్లేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
