హైదరాబాద్: అత్తాపూర్‌లో హల్దీరాం స్వీట్ హౌస్పై కేసు నమోదైంది. కల్తీ, ఫంగస్ వచ్చిన సీట్లను అమ్మిన, హల్దీ రామ్ స్వీట్ హౌస్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితుల ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పాడై పోయిన స్వీట్స్ను హల్దీరాం స్వీట్ హౌస్ సిబ్బంది కస్టమర్స్కు అమ్ముతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పాడైపోయిన స్వీట్ గురించి కస్టమర్స్ ప్రశ్నిస్తే.. హల్దీరాం స్వీట్ హౌస్ ఓనర్స్.. నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఫిర్యాదుదారులు వాపోయారు. దీంతో.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హల్దీరాం స్వీట్ హౌస్పై BNS యాక్ట్ 79, 274, 275,115 (2)131,352 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. హల్దీరాం స్వీట్ హౌస్ స్వీట్స్ను పోలీసులు FSLకు పంపించారు.
హైదరాబాద్ సిటీలో తనిఖీలు చేసిన ప్రతీసారి ఇలా కొన్ని స్వీటు షాపుల నిర్వాకం బయటపడుతూనే ఉంది. పెస్ట్ కంట్రోల్ లేకపోవడం, తయారీకి ఉపయోగించే నీటి పరీక్ష లేకపోవడం, కార్మికుల వైద్య రికార్డులు లేకపోవడం, డిస్ప్లే ఏరియాలో ఈగల బెడద, ఓవెన్ ప్రాంతాల్లో మురుగు, హెయిర్ క్యాప్లు, గ్లౌజ్‌లు ధరించకపోవడం, డస్ట్ బిన్‌ల మూతలు తెరిచి ఉండటం వంటి లోపాలు చాలా సందర్భాల్లో వెలుగుచూశాయి.
