కరీంనగర్ జిల్లా కోర్టుకు.. నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు

కరీంనగర్ జిల్లా కోర్టుకు.. నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు

కరీంనగర్/ హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. 12RDX బాంబులు అమర్చామని 12 గంటల ఐదు నిమిషాలలోగా పేలుతాయని మెయిల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయి డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. జిల్లా కోర్టుకు సంబంధించిన మెయిల్ ఐడీకి మెయిల్ రావటంతో తనిఖీలు చేయడం గమనార్హం.

జిల్లా కోర్టు ఆవరణలో కూడా డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ సిటీలోని నాంపల్లి క్రిమినల్ కోర్టుకు కూడా మరోసారి బాంబ్ కాల్ కలకలం రేపింది. ఇక్కడ కూడా బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేసింది.

నాంపల్లి సిటీ క్రిమినల్ కోర్టు, కుషాయిగూడలోని మల్కాజిగిరి కోర్టుల్లో బాంబులు ఉన్నట్లు 2025, డిసెంబర్ నెలలో కూడా ఆగంతకుడి నుంచి మెయిల్స్​రావడం కలకలం సృష్టించింది. తాను పాక్ ప్రేరేపిత ఐఎస్ఐ ఉగ్రవాదినని సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు బాంబులు పేలుతాయని అందులో పేర్కొన్నాడు. దీంతో జడ్జిలు, న్యాయవాదులు, సిబ్బంది, జనం భయంతో బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఉదయం 11.30 గంటలకు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో వచ్చి కోర్టుల్లో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత బాంబులు లేవని, అవి ఫేక్​మెయిల్స్​అని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో కొన్ని గంటలపాటు కోర్టుల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి.