మ్యూచువల్ ఫండ్స్‌లో SIP రూపంలో పెట్టుబడి పెట్టడం అనేది సంపద సృష్టికి ఒక సులభమైన మార్గంగా కనిపిస్తుంది. కానీ ఆచరణలో ఇన్వెస్టర్ల అనుభవం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అసలు SIP ఎప్పటి నుంచి లాభాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది? కాలపరిమితి పెరిగే కొద్దీ రిస్క్ ఎలా తగ్గుతుంది? అనే అంశాలపై ఫిబ్రవరి 2026 నాటి 'ఫండ్స్ ఇండియా' రిపోర్టులోని ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తున్న వారి కంటే కొత్తగా వస్తున్న పెట్టుబడిదారులకు మార్గదర్శకంలా నిలుస్తుంది.
ప్రారంభంలో ఒడిదొడుకులు (1-3 ఏళ్లు):
SIP ప్రారంభించిన మొదటి 3 ఏళ్లలో రిటర్న్స్ చాలా అస్థిరంగా ఉంటాయి. నిఫ్టీ 50 లెక్కలు పరిశీలిస్తే.. కేవలం ఏడాది కాలంలో SIP స్టార్ట్ చేసి కొనసాగించిన వారికి కొన్ని సందర్భాల్లో ఏకంగా -65 శాతం వరకు నెగటివ్ రిటర్న్స్(నష్టాలు) వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అలాగే రెండు, మూడేళ్ల కాలపరిమితిలో కూడా -40 శాతం నుంచి -22 శాతం వరకు నష్టాలు కనిపించాయి. దీనికి కారణం మార్కెట్ సైకిల్స్. స్వల్ప కాలంలో మార్కెట్ పతనాలను తట్టుకుని కోలుకోవడానికి పెట్టుబడికి తగినంత సమయం దొరకదు. అందుకే తక్కువ కాలం కోసం SIP చేసే వారికి మార్కెట్ గందరగోళంగా, నష్టదాయకంగా అనిపిస్తుందని తేలింది.
స్థిరత్వం వైపు అడుగులు (5-7 ఏళ్లు):
పెట్టుబడి కాలపరిమితి 5 నుండి 7 ఏళ్లకు చేరుకోగానే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఐదేళ్ల కాలపరిమితిలో ఇన్వెస్టర్లకు నష్టాల తీవ్రత భారీగా తగ్గుతుంది. మార్కెట్ ఒడిదొడుకులకు లోనైనప్పటికీ.. రికవరీ ద్వారా సింగిల్ లేదా డబుల్ డిజిట్ వార్షిక రాబడులు వచ్చే అవకాశం ఈ దశలో పెరుగుతుంది. ఇక ఏడేళ్ల మార్క్ దాటిన తర్వాత.. దాదాపు అన్ని రోలింగ్ SIP పీరియడ్లు పాజిటివ్ రిటర్న్స్ అంటే లాభాలను అందించాయి. మార్కెట్ కరెక్షన్స్.. రికవరీలు ఈ కాలంలో బ్యాలెన్స్ అయ్యి.. లాభాలను అందించే కాంపౌండింగ్ ఎఫెక్ట్ నెమ్మదిగా స్టార్ట్ అవుతుందని తేలింది.
దీర్ఘకాలిక ప్రయోజనం (7 ఏళ్లు పైబడితే):
నిజమైన సంపద సృష్టి 7 ఏళ్ల తర్వాతే స్పష్టంగా కనిపిస్తుంది. ఏడేళ్లు దాటిన తర్వాత SIPల్లో నష్టపోయే అవకాశాలు దాదాపు జీరో అని డేటా చెబుతోంది. మార్కెట్ హెచ్చుతగ్గులు కొనసాగినప్పటికీ.. ఇన్వెస్టర్ పొందే రాబడులు ఒక స్థిరమైన పరిధిలోకి చేరుకుంటాయి. చాలా సందర్భాల్లో డబుల్ డిజిట్ రిటర్న్స్ వార్షికంగా నమోదయ్యాయి. ఇక్కడ మార్కెట్ స్వభావం మారదు. కానీ.. పెట్టుబడికి ఇచ్చిన సమయం వల్ల మార్కెట్ పతనాలను తట్టుకుని నిలబడే శక్తి ఇన్వెస్ట్‌మెంట్‌కు లభిస్తుంది.
ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
చాలామంది ఇన్వెస్టర్లు SIPలను మధ్యలోనే ఆపేయడానికి ప్రధాన కారణం.. వారి అంచనాలు, పెట్టుబడి కాలపరిమితి సరిపోలకపోవడమే. 2-3 ఏళ్ల మనస్తత్వంతో మార్కెట్లోకి వస్తే వోలటాలిటీ భయపెడుతుంది. కానీ SIP అనేది పరుగు పందెం కాదు.. అది ఒక మారథాన్ అని ఇన్వెస్టర్లు ముందుగా గమనించాలి. ఇందులో పెట్టుబడి కాలం పెరిగే కొద్దీ టైమింగ్ రిస్క్ తగ్గి, లాభాల వచ్చే అవకాశం పెరుగుతుందని తాజా విశ్లేషణ నిరూపించింది. సో హడావిడిగా లాభాల కోసం SIP స్టార్ట్ చేయటం, వాటిని కొన్ని నెలలకే రిటర్న్స్ రాలేదని బ్లేమ్ చేయటం సరికాదని ముందుగా ఇన్వెస్టర్లు తెలుసుకోవటం వారి విజయానికి చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
