మార్కెట్లో దూసుకుపోతున్న సిగరెట్ స్టాక్స్.. బ్రోకరేజ్ BUY రేటింగ్ ఇచ్చిన కంపెనీ ఇదే

మార్కెట్లో దూసుకుపోతున్న సిగరెట్ స్టాక్స్.. బ్రోకరేజ్ BUY రేటింగ్ ఇచ్చిన కంపెనీ ఇదే

సిగరెట్ తయారీ కంపెనీల షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్‌లో దూసుకుడు కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ITC, గాడ్‌ఫ్రే ఫిలిప్స్, వీఎస్‌టీ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు దాదాపు 12 శాతం వరకు ఇంట్రాడేలో పెరగడం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఫిబ్రవరి 1, 2026 నుండి ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ సుంకాల ప్రభావాన్ని తట్టుకునేలా కంపెనీలు ధరలను భారీగా పెంచడం దీనికి కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై పన్నుల నిర్మాణాన్ని మార్చింది. పాత 28% జీఎస్టీ స్థానంలో ఇప్పుడు 40% జీఎస్టీతో పాటు.. సిగరెట్ పొడవును బట్టి ఒక్కో స్టిక్‌పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. ఈ భారాన్ని వినియోగదారులపైకి మళ్లించేందుకు కంపెనీలు 15 నుండి 20 శాతం వరకు సిగరెట్ల రేట్లను పెంచాల్సి వచ్చింది. దీంతో ప్రీమియం బ్రాండ్ల విషయంలో ప్యాకెట్ ధర ఏకంగా రూ.55 వరకు పెరగనున్నాయి. ధరలు పెరిగినప్పటికీ.. దీనివల్ల కంపెనీల లాభదాయకత పెరుగుతుందన్న అంచనాలు షేర్ల పెరుగుదలకు కారణమయ్యాయి.

ALSO READ : రోజురోజుకూ పడిపోతున్న వెండి.. 

కంపెనీల వారీగా ప్రభావం..

గాడ్‌ఫ్రే ఫిలిప్స్: మార్ల్‌బోరో కాంపాక్ట్ ధరను ఒక్కో స్టిక్‌పై రూ.9.5 నుండి రూ.11.5 కు పెంచడంతో ఈ కంపెనీ షేరు అత్యధికంగా 12 శాతం జంప్ చేసింది.

ITC: తన ప్రీమియం బ్రాండ్లైన గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ ధరలను దాదాపు 41 శాతం వరకు పెంచింది కంపెనీ. దీంతో కంపెనీ షేర్లు స్వల్పంగా 1.69 శాతం పెరిగాయి.

వీఎస్‌టీ ఇండస్ట్రీస్: ఈ కంపెనీ షేర్లు కూడా ఇంట్రాడేలో 3.32 శాతం మేర పుంజుకున్నాయి.

యూబీఎస్ కామెంట్స్: 

ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్, ఐటీసీ షేరుపై సానుకూల ధోరణిని వ్యక్తం చేసింది. ధరల పెంపు విషయంలో ఐటీసీ అనుసరించిన వ్యూహం బాగుందని యూబీఎస్ పేర్కొంది. ధరల పెంపును ప్రీమియం సిగరెట్లపై (84mm) పూర్తిగా అమలు చేసి, సామాన్యులు కొనే తక్కువ పొడవున్న సిగరెట్లపై (64mm, 69mm) తక్కువగా ఉంచింది. దీనివల్ల అమ్మకాలు పెద్దగా తగ్గకుండా లాభాలు పొందే అవకాశం ఉండేలా కంపెనీ ప్లాన్ చేసింది. దీంతో బ్రోకరేజ్ ఐటీసీ షేర్లకు 'Buy' కాల్ ఇస్తూ టార్గెట్ ధరను రూ.395గా నిర్ణయించింది.

ALSO READ : SIP ఎన్ని ఏళ్ల నుంచి లాభాలను ఇస్తుంది..?

పన్నుల మార్పు వల్ల ప్రారంభంలో సిగరెట్ స్టాక్స్ భారీ ఒడిదొడుకులకు లోనయ్యాయి. అయితే ఇప్పుడు ధరల పెంపు ద్వారా ఆ నష్టాన్ని కంపెనీలు పూడ్చుకుంటున్నాయి. ఐటీసీ మొత్తం ఆదాయంలో 40 శాతం సిగరెట్ వ్యాపారం నుంచే వస్తుంది కాబట్టి.. పెంచిన పన్నులకు అనుగుణంగా ధరల సర్దుబాటు ఆ కంపెనీకి పెద్ద ఊరటనిస్తుంది. వాల్యుయేషన్ పరంగా కూడా ఇవి ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.