పాట్నా: బిహార్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. జేడీయూ, ఎల్జేపీ (ఆర్వీ)తో కలిసి మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటేసింది. అయితే, సీఎం ఎవరనేదానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. మళ్లీ నీతీశే బిహార్ ముఖ్యమంత్రి అంటూ శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో జేడీయూ ఓ పోస్ట్ పెట్టింది. కొద్దిసేపటికే దానిని తొలగించింది. దీంతో తదుపరి సీఎం ఎవరన్న దానిపై ప్రచారం మొదలైంది. నితీశ్ భవితవ్యంపై చర్చ స్టార్ట్ అయ్యింది.
ఫలితాల ప్రకటన మొదలై.. ఎన్డీయే కూటమి లీడ్‌లోకి రాగానే.. జేడీయూ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్‌ల వర్షం కురిపించింది. ‘‘రాష్ట్రంలో మరోసారి నితీశ్ సర్కారే వస్తున్నది. అందుకు బిహార్ సిద్ధంగా ఉంది’’ అంటూ వరుస పోస్ట్‌లు పెట్టింది. ‘‘నితీశ్ కుమార్ సీఎంగా పనిచేశారు.. పనిచేస్తున్నారు.. భవిష్యత్తులోనూ కొనసాగుతారు’’ అంటూ పోస్ట్ పెట్టింది. అయితే, కొన్ని నిమిషాల తర్వాత.. జేడీయూ తన పోస్ట్‌నుంచి ఈ లైన్‌ను తొలగించడం చర్చనీయాంశమైంది. అసలు బిహార్ సీఎం ఎవరనే చర్చ ఊపందుకున్నది.
క్యాండిడేట్‌ను ప్రకటించని ఎన్డీయే
ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో ఏర్పడిన మహాగఠ్ బంధన్ కూటమి.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించింది. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లింది. కానీ.. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ (ఆర్వీ)తో కూడిన ఎన్డీయే కూటమి మాత్రం సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. నితీశ్ నాయకత్వంలోనే ముందుకెళ్తామని మాత్రం స్పష్టం చేసింది.
