పాట్నా: బిహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ జన్ సూరాజ్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. పోటీ చేసిన ఏ ఒక్క స్థానంలోనూ ఈ పార్టీ విజయం సాధించలేకపోయింది. కనీసం.. రెండో స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీలను అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయిన ప్రశాంత్ కిషోర్.. సొంత పార్టీకి జనంతో జై కొట్టించుకోలేక పొలిటికల్గా జీరోగా మిగిలిపోయారు. ఆయన తన సొంత పార్టీ JSP విషయంలో అట్టర్ ప్లాప్ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు JSP పార్టీ విషయంలో తప్పు ఎక్కడ జరిగింది..? ఈ పేరు మోసిన స్ట్రాటజిస్ట్ వ్యూహాలు తన సొంత రాష్ట్రమైన బిహార్లో ఎందుకు వర్కౌట్ కాలేదు..? ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఫెయిల్ అయ్యారు..?
ప్రశాంత్ కిషోర్ తన పార్టీ విషయంలో చేసిన మొట్టమొదటి పెద్ద తప్పు ఏంటంటే.. బీజేపీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్ను JSP జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించడం. ఉదయ్ సింగ్ అంత పాపులర్ ఏం కాదు. బిహార్ దాటిపోతే ఆయన ఎవరో కూడా ఏ ఒక్కరికీ తెలియదు. బిహార్లో కూడా చాలామందికి ఆయన గురించి అంత తెలియదు. పెద్దగా జనాదరణ లేని ఆయనను తీసుకొచ్చి జన్ సూరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించి.. JSP పార్టీని ఒక రిమోట్ కంట్రోల్ పార్టీగా ప్రశాంత్ కిషోర్ మార్చేశారు.
ప్రశాంత్ కిషోర్ చేసిన మరో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే.. తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకోకపోవడం. ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం అధికారం. అలాంటిది.. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని ఆ పార్టీ స్థాపించిన వ్యక్తే బలంగా చెప్పుకోలేకపోవడం అంటే.. స్వయంకృతాపరాధమే. ఎందరో విద్యావంతులను, డాక్టర్లను, ఇంజనీర్లను, ప్రొఫెసర్లను అభ్యర్థులుగా బరిలో నిలిపిన ప్రశాంత్ కిషోర్ తాను సీఎం అభ్యర్థిని అని ప్రొజెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. పీకేను జనం నమ్మకపోవడానికి మరో ప్రధాన కారణం.. మాట మీద నిలకడలేకపోవడం.
ఇందుకు ఉదాహరణగా.. ఒక పరిణామాన్ని ప్రస్తావించుకుంటే.. తేజస్వి యాదవ్ పోటీ చేసిన రాఘోపూర్లో ప్రశాంత్ కిషోర్ ఒక మీటింగ్ పెట్టారు. ఈ బహిరంగ సభలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. తాను రాఘోపూర్ నుంచి పోటీ చేస్తే.. 2019లో రాహుల్ గాంధీ ఎలా ఓడిపోయారో.. తేజస్వి రాఘోపూర్లో అలా ఓడిపోక తప్పదని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రశాంత్ కిషోర్ పార్టీ మద్దతుదారుల్లో మంచి జోష్ తీసుకొచ్చాయి. కానీ.. ఆ మరుసటి రోజే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రశాంత్ కిషోర్ ప్రకటించడంతో ఆయన మద్దతుదారులే తీవ్ర నిరుత్సాహానికి లోనయిన పరిస్థితి.
ఈ పరిణామంతో తటస్థ ఓటరు సంగతి అటుంచితే ఆయన మద్దతుదారుల్లో కూడా ప్రశాంత్ కిషోర్పై అపనమ్మకం ఏర్పడింది. తాను కూడా మరో బాల్ థాక్రే అని ప్రశాంత్ కిషోర్ భావించడమే బిహార్ ఎన్నికల్లో JSP పార్టీకి ఈ గతి పట్టించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు తాను ఎన్నికల్లో పోటీ చేయకూడదని ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయంతోనే.. ఆయన పతనం మొదలైందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
