- జిల్లా అక్రెడిటేషన్ కమిటీల్లో డెస్క్ జర్నలిస్టుకు స్థానంపై పరిశీలిస్తమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: జర్నలిజంలో డెస్క్, ఫీల్డ్ అనే తేడాల్లేవని, అందరూ వర్కింగ్ జర్నలిస్టులేనని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డెస్క్ జర్నలిస్టులకు కార్డుల సంఖ్య పెంచడం సహా రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ మొదటి మీటింగ్‌లో చర్చకు వచ్చిన పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అర్హులైన ఏ ఒక్కడెస్క్ జర్నలిస్టుకు అన్యాయం జరగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.
మీడియా అకాడమీ చైర్మన్‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సోమవారం డెస్క్ జర్నలిస్టుల సంఘం(డీజేఎస్) ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు. అనంతరం డీజేఎస్ అధ్యక్షుడు బాదిని ఉపేందర్, డీజేఎస్ ప్రతినిధులు డెస్క్ జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలపై వినతపత్రం అందజేశారు. సెంట్రల్ డెస్క్‌లు, జిల్లాల డెస్కుల్లో పనిచేసే జర్నలిస్టులకు జారీ చేసే కార్డుల సంఖ్య పెంచాలని, జిల్లా అక్రిడిటేషన్ కమిటీల్లో డెస్క్ ప్రతినిధులు అవకాశం ఇవ్వాలని, డెస్క్తోపాటు ఫీల్డ్ లో కూడా మహిళలకు 33శాతం అదనంగా కార్డులు ఇవ్వాలని.
ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా హెల్త్‌కార్డులు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. డెస్క్ జర్నలిస్టులకు కార్డుల పెంపు సహా స్టేట్ అక్రెడిటేషన్ కమిటీ ఫస్ట్ మీటింగ్ లో చర్చకు వచ్చిన పలు అంశాలను సర్కారు దృష్టికి తీసుకుపోయామని చెప్పారు. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జిల్లా అక్రెడిటేషన్ కమిటీల్లో డెస్క్ జర్నలిస్టులకు స్థానం కల్పించే అంశంపై ఐ అండ్ పీఆర్ అధికారులతో మాట్లాడుతానని హామీ నిచ్చారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు ప్రస్తుతం జారీ చేయనున్న అక్రెడిటేషన్ కార్డుల సంఖ్యకు అదనంగా 33 శాతం మహిళలకు కేటాయించాలనుకుంటున్నట్టు తెలిపారు. ఆయా సంస్థల్లో మహిళలు లేకపోతే వాటిని ఖాళీగానే ఉంచాల్సి ఉంటుందన్నారు. హెల్త్ కార్డుల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. చైర్మన్‌ను కలిసిన వారిలో డీజేఎస్ ప్రతినిధులు రాజారామ్, వెంకటరమణ, సీహెచ్.సైదిరెడ్డి, ఎస్.వెంకటేశ్, నరేందర్ ఉన్నారు
