కరెంట్‌‌ షాక్‌‌తో నలుగురు మృతి

కరెంట్‌‌ షాక్‌‌తో నలుగురు మృతి

 

  • మంచిర్యాల జిల్లాలో ఇనుపస్టాండ్‌‌ తరలిస్తుండగా 
  • విద్యుత్‌‌ తీగలు తగిలి ఇద్దరు..
  •     వికారాబాద్‌‌ జిల్లా యాలాలలో మహిళ, పరిగిలో కౌలు రైతు..

దండేపల్లి, వెలుగు : ఇనుప స్టాండ్‌‌ తరలిస్తుండగా విద్యుత్‌‌ తీగలకు తగిలి షాక్‌‌ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటలో సోమవారం ఉదయం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మేదరిపేటలోని హరిహర ట్రేడర్స్‌‌లో వెల్గనూరు గ్రామానికి చెందిన చందనగిరి నాగరాజు (35) డ్రైవర్‌‌గా, మాదపూర్‌‌ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ (45) హమాలీగా పనిచేస్తున్నారు. ట్రేడర్స్‌‌ ఎదురుగా ఉన్న పెట్రోల్‌‌ బంక్‌‌ యజమాని మామ చీటి జనార్దన్‌‌రావు సోమవారం ఉదయం నాగరాజు, లక్ష్మీనారాయణను పిలిచి బంక్‌‌ వద్ద ఉన్న ఇనుప స్టాండ్‌‌ను ఇంటికి తరలించాలని సూచించాడు. వారు స్టాండ్‌‌ను తరలిస్తున్న క్రమంలో బంక్‌‌ ముందున్న 11కేవీ విద్యుత్ తీగలను తగలడంతో విద్యుత్‌‌ షాక్‌‌కు గురై ఇద్దరి శరీరాలు పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే చనిపోయారు. మరో వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న దండేపల్లి ఎస్సై తహసీనొద్దీన్‌‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కాగా, ప్రమాదానికి కారణమైన జనార్దన్‌‌రావుపై చర్యలు తీసుకోవడంతో పాటు మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌‌ చేస్తూ బంక్‌‌ యజమానికి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. పరిహారం చెల్లించే వరకు డెడ్‌‌బాడీలను తీసుకెళ్లబోమని పట్టుబట్టడంతో పోలీసులు, స్థానికులు పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు. 

ఇందిరమ్మ ఇంటికి క్యూరింగ్‌‌ చేస్తూ..

తాండూర్, వెలుగు : ఇందిరమ్మ ఇంటికి నీటిని పడుతుండగా విద్యుత్‌‌షాక్‌‌కు గురై ఓ మహిళ చనిపోయింది. ఈ ఘటన వికారాబాద్‌‌ జిల్లా యాలాల మండలంలోని రాస్నం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. యాలాల ఎస్సై విఠల్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మక్త శశికళ ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంటికి నీరు పడుతుండగా విద్యుత్‌‌ షాక్‌‌ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. 

నార్సింగిలో ఏడు గేదెలు...

గండిపేట, వెలుగు : హైదరాబాద్‌‌ శివారులోని నార్సింగి ప్రాంతానికి చెందిన రవీందర్‌‌ పాల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన వద్ద ఉన్న ఏడు గేదెలను సోమవారం నార్సింగి ముష్కి చెరువు వద్ద మేతకు తీసుకెళ్లాడు. అప్పటికే విద్యుత్‌‌ వైరు తెగి నీటిలో పడడంతో అటు వైపు వెళ్లిన గేదెలు విద్యుత్‌‌షాక్‌‌కు గురై చనిపోయాయి. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.