అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ తర్వాత క్రూడ్ ఆయిల్ ధరలు 6 శాతం తగ్గి బ్యారెల్ 92 డాలర్లకు చేరుకుంది. అయితే మరోపక్క ఇరాన్ రివల్యూషినరీ గార్డ్స్ మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు గట్టి హెచ్చరికలు పంపుతున్నారు. తమతో పెట్టుకుంటే ఒక్క చుక్క కూడా క్రూడ్ ఆయిల్ ఎగుమతి కాకుండా అడ్డుకుంటామని, దీంతో రానున్న కొద్ది రోజుల్లో క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్ 200 డాలర్లకు చేరుకుని ప్రపంచం అతలాకుతలం అవుతుందని హెచ్చరిస్తున్నారు. అసలు ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి.. దాని ప్రభావం ఇండియాపై ఎంతనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికా, ఇజ్రాయెల్ వైఖరిపై ఇరాన్ మరోసారి నిప్పులు చెరిగింది. ఒకవేళ ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగితే.. ఆ ప్రాంతం నుండి క్రూడ్ ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సంచలన హెచ్చరిక చేసింది. శత్రు దేశాలకు, వారి భాగస్వాములకు ఒక్క లీటరు క్రూడ్ ఆయిల్ కూడా వెళ్లకుండా అడ్డుకుంటామని ఐఆర్‌జీసీ ప్రతినిధి జనరల్ అలీ-మొహమ్మద్ నయీని స్పష్టం చేశారు. ఈ ఘర్షణ ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 200 డాలర్లకు చేరుకుంటాయని ఇరాన్ హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ప్రకటించారు. ఇజ్రాయెల్‌తో కలిసి చేపట్టిన సైనిక చర్యలు ఇప్పటికే ప్రధాన లక్ష్యాలను చేరుకున్నాయని.. ఇరాన్ నావికాదళం, కమ్యూనికేషన్ వ్యవస్థలు, క్షిపణి సామర్థ్యాలు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఇకపై ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే ఆ దేశానికి అదే అంతం అవుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ధీటుగా బదులిచ్చింది. యుద్ధం ఎప్పుడు ముగియాలో తామే నిర్ణయిస్తామని.. ప్రాంతీయ సమీకరణాలు ఇప్పుడు తమ సాయుధ దళాల చేతుల్లోనే ఉన్నాయని రివల్యూషనరీ గార్డ్స్ అమెరికాకు ఝలక్ ఇచ్చింది.
భారత్‌పై ప్రభావం..
కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ తన క్రూడ్ అవసరాల్లో దాదాపు 80% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇరాన్ హెచ్చరించినట్లుగా ఆయిల్ సరఫరా నిలిచిపోయి.. ధరలు ఆకాశాన్ని తాకితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు. అంతేకాకుండా పశ్చిమ ఆసియాలో అస్థిరత ఏర్పడితే అక్కడ నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భద్రత, వారి నుంచి వచ్చే విదేశీ మారక ద్రవ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
