అంబర్పేట, వెలుగు: విద్యానగర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (ఐహెచ్ఎం)లో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్లోబల్ హోటల్, ఎయిర్లైన్స్, కార్పొరేట్ రంగాల్లో రాణించాలనుకునే విద్యార్థుల కోసం బీఎస్సీతో పాటు పలు వృత్తి విద్యా కోర్సులను సంస్థ అందిస్తోంది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షల్లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, ఎటువంటి వయోపరిమితి లేదని నిర్వాహకులు తెలిపారు.
ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ప్రవేశం పొందవచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే పదో తరగతి పూర్తి చేసిన వారి కోసం ప్రత్యేక కోర్సులు అందుబాటులో ఉన్నాయని, మరిన్ని వివరాలకు విద్యానగర్లోని ఐహెచ్ఎం కార్యాలయాన్ని లేదా 9140 27427569, 8374787988 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
