ఇరాన్ నౌక మునక.. ఏఐ వీడియోలతో భారత్‎పై పాక్ దుష్ప్రచారం

ఇరాన్ నౌక మునక.. ఏఐ వీడియోలతో భారత్‎పై పాక్ దుష్ప్రచారం

న్యూఢిల్లీ: ఇరాన్ నేవీ నౌక ఐఆర్ఐఎస్ దేనా సమాచారాన్ని ఇజ్రాయెల్‌‌‌‌కు ఇండియానే ఇచ్చిందంటూ పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇదంతా భారత ప్రతిష్టను దెబ్బతీయడానికి పాక్ చేస్తున్న కుట్ర అని స్పష్టం చేసింది. ఈ నెల 4న ఇరాన్‌‌‌‌కు చెందిన దేనా యుద్ధనౌక శ్రీలంక సమీపంలోని హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. అమెరికాకు చెందిన ఒక సబ్‌‌‌‌మెరైన్ ఈ నౌకపై టోర్పెడోలతో దాడి చేయడంతో సుమారు 87 మంది చనిపోయారు. 

అయితే, దేనా నౌక మునిగిన తర్వాత దానిపై జరిగిన దాడికి ఇండియానే కారణమంటూ పాకిస్తాన్‌‌‌‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఇరాన్ నౌక లొకేషన్‎ను భారతే ఇజ్రాయెల్‌‌‌‌కు ఇచ్చిందని ఆరోపించాయి. దీన్ని నమ్మించడానికి ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతున్నట్లుగా ఏఐ జనరేటెడ్ డీప్‌‌‌‌ఫేక్ వీడియోను వైరల్ చేశాయి. 

పాక్ ఆరోపణలను భారత ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తీవ్రంగా ఖండించింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడినట్లుగా ఉన్న వీడియో డీప్‌‌‌‌ఫేక్ అని తేల్చి చెప్పింది. నౌకపై జరిగిన దాడి విషయంలో భారత్‎పై వస్తున్న నిందలు బేస్‌‌‌‌లెస్ అని కొట్టిపారేసింది. ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేస్తే ఆ నెపం భారత్‌‌‌‌పైకి నెట్టేందుకు పాకిస్తాన్ ఏఐ టెక్నాలజీని వాడుకుని తప్పుడు ప్రచారం చేస్తోందని పేర్కొంది.