- కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా 23 మందికి జారీ
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దాఖలు చేసిన పిటిషన్పై ప్రతివాదులు కవిత, కేజ్రీవాల్, సిసోడియా సహా 23 మంది ప్రతివాదులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, ఈ కేసును దర్యాప్తు చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐఓ)పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలపై స్టే విధించింది.
తదుపరి విచారణను ఈ నెల 16 కు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా 23 మందికి రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ క్లీన్ చిట్ ఇస్తూ గత నెల 27 న తీర్పు నిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల 1న సీబీఐ 974 పేజీలతో ఢిల్లీ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై సోమవారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ చేపట్టారు.
అతి పెద్ద కుంభకోణాల్లో ఒకటి..
ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ రాజధాని చరిత్రలో అతి పెద్ద స్కాంలలో ఒకటని, ఇది జాతీయతకు అవమానం అని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కొంతమందికి మేలు చేసేలా లిక్కర్ పాలసీని ఎలా తారుమారు చేశారు? మనీలాండరింగ్ ఎలా జరిగిందో సీబీఐ దర్యాప్తులో తేల్చిందన్నారు. రికార్డుల్లోని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా నిందితులకు ట్రయల్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని వాదించారు.
‘అవినీతి, లంచం ఇవ్వడం, తీసుకోవడం, ఎన్నికల్లో వినియోగించడం, సమావేశాలు జరగడంపై ఫోరెన్సిక్ ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. గాలిలో ఆరోపణలు చేయడం లేదు. కానీ, ట్రయల్ కోర్టును ఒప్పించలేకపోయాం. నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చారు. కేసు మూసివేశారు. దీంతో ఏజెన్సీ సేకరించిన ఆధారాలు, సాక్ష్యుల వాంగ్మూలాలు నిరుపయోగంగా మారాయి’ అని మెహతా వాదించారు. ఈ తీర్పుపై స్టే ఇవ్వడం కేసు ట్రయల్స్ పై ఎలాంటి ప్రభావం చూపదన్నారు.
ఈడీ కేసు విచారణను వాయిదా వేయండి..
దర్యాప్తు సంస్థ, ఐఓకు వ్యతిరేకంగా ట్రయల్ కోర్టు చేసిన పరిశీలనలపై స్టే జారీ చేస్తామని ధర్మాసనం పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను కోర్టు నిర్ణయించే వరకు ఈ కేసుకు సంబంధించిన ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసు విచారణను వాయిదా వేయాలని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ట్రయల్ కోర్టును ఆదేశించారు. ‘అలాగే, 23 మంది నిందితులకు నోటీసులు జారీ చేశారు
