న్యూఢిల్లీ, వెలుగు: జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల ప్రాంతానికి జాతీయ ప్రాముఖ్యత కలిగిన గుర్తింపు లేదని, దీని నిర్వహణలో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)లో పాల్గొనలేదని కేంద్రం వెల్లడించింది. అందువల్ల ఈ సైట్‌కు ఏఎస్‌ఐకి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తేల్చి చెప్పారు. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మౌఖికంగా సమాధానం ఇచ్చారు.
ఈ సైట్ తెలంగాణ హెరిటేజ్ విభాగం పరిరక్షణలో ఉందన్నారు. 1979–1983 మధ్య కోటిలింగాలలో జరిగిన తవ్వకాల్లో చైత్య గృహాలు, విహార సముదాయం, ఇటుక నిర్మాణాలు, పురాతన వస్తువులు వంటి నిర్మాణాలు బయటపడ్డాయని గుర్తుచేశారు. వీటిని తెలంగాణ హెరిటేజ్ విభాగం పరిరక్షిస్తుందని తెలిపారు. అయితే.. శాతవాహన కాలానికి చెందిన ఈ ఆర్టిక్రాఫ్ట్స్‌ను పరిరక్షించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలేంటని ఎంపీ ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర మంత్రి బదులిస్తూ.. ఈ సైట్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నిదని, దీని నిర్వహణ తెలంగాణ హెరిటేజ్ విభాగం చూస్తుందని సమాధానం ఇచ్చారు.
