హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్న కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై పరోక్షంగా స్పందించారు. Karma Hits Back !!! అని కవిత తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన కవిత తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు కేసీఆర్ ఫొటోను తన బ్యానర్లో వాడుకున్న కవిత .. ఈ మధ్య తన తండ్రి ఫొటో కూడా వాడుకోకుండా జనంలోకి వెళ్తున్నారు.
కవిత ఇప్పుడు ‘కొత్త పార్టీ’ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న తరుణంలో.. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఓటమి ఆమె రాజకీయ వ్యూహాలకు మరింత కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి సునీత కోసం కేటీఆర్ కాళ్లకు బలపం కట్టుకుని ప్రచారం చేశారు. అయినప్పటికీ మాగంటి సునీత ఓటమి తప్పలేదు. కేటీఆర్ తీరుపై బాహాటంగానే విమర్శలు గుప్పించిన కవితకు ఈ అంశం కూడా అస్త్రంలా మారనుంది.
జూబ్లీహిల్స్లో ఒక ఆడబిడ్డను పోటీకి నిలిపి గెలిపించుకోలేకపోయారనే విమర్శల దాడికి కవిత సిద్ధమైనట్లు తెలిసింది. ఇటీవల ఆమె చేపట్టిన ‘జనం బాట’ కార్యక్రమంలో కూడా.. ‘ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎలా ఉంటదో చూపిస్తా’.. ‘రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొన్నది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె పొలిటికల్ స్టాండ్ ఏంటో చెప్పకనే చెబుతున్నాయి. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ‘జనం బాట’ పేరుతో వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న కవిత, తన కట్టూ, బొట్టూ, మాటతీరులో స్పష్టమైన మార్పును ప్రదర్శించడం ద్వారా తన రాజకీయ ఉద్దేశాన్ని పరోక్షంగా చాటి చెబుతున్నారు.
ముఖ్యంగా, ‘సామాజిక తెలంగాణ’ నినాదాన్ని బలంగా వినిపిస్తూ, బీసీలు, ఉద్యమకారుల పక్షాన గళం విప్పడం ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రణాళికలో భాగమేనని చర్చ జరుగుతున్నది. ‘‘నాకు బీఆర్ఎస్‌లో ఎవరితోనూ పంచాయితీ లేదు. కుటుంబం నుంచే నన్ను బయటపడేశారు’’ అని చెప్పడం ద్వారా, తన తండ్రితో రాజకీయంగా వేరుపడిన విషయాన్ని నిర్మొహమాటంగా ప్రకటించారు. ‘‘తండ్రిగా కేసీఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి తప్పకుండా వెళ్తాను. కానీ రాజకీయంగా వెళ్లే పరిస్థితి లేదు’’ అని ఆమె తేల్చి చెప్పారు.
Karma hits back !!! 🙏🙏🙏🙏
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 14, 2025
