కర్మ హిట్స్ బ్యాక్..బీఆర్ఎస్ ఓటమిపై కవిత ఆసక్తికర పోస్ట్

కర్మ హిట్స్ బ్యాక్..బీఆర్ఎస్ ఓటమిపై కవిత ఆసక్తికర పోస్ట్
  • బీఆర్ఎస్ ఓటమిపై కవిత ఆసక్తికర పోస్ట్ 
  • పొలిటికల్​ సర్కిల్స్​లో వైరల్​

హైదరాబాద్, వెలుగు:జూబ్లీహిల్స్​ ఫలితాల అనంతరం జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్​ హాట్​ టాపిక్​గా మారింది. బీఆర్ఎస్​ఓటమిపై ఆమె పరోక్షంగా స్పందిస్తూ ‘కర్మ హిట్స్​బ్యాక్’ అంటూ  ‘ఎక్స్‌‌’లో పోస్టు పెట్టారు. దీనిపై పొలిటికల్ సర్కిల్స్​లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. మరోవైపు కవిత పోస్టుపై సోషల్ మీడియాలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎక్కువ మంది బీఆర్ఎస్‌‌‌‌కు తగిన శాస్తి జరిగిందంటూ కవితకు మద్దతుగా కామెంట్స్​చేయగా.. కొందరు మాత్రం బీఆర్ఎస్‌‌‌‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. 

అప్పట్నుంచి దుమారం..

కవిత బీఆర్ఎస్​ నుంచి దూరమై ఇప్పుడు సొంతంగా జాగృతి తరఫునే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఏడాది మేలో ‘కేసీఆర్​దేవుడు.. కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’ అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ‘‘కేటీఆర్, హరీశ్​రావు వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది. నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు, ఓడించేందుకు వెనుక నుంచి కుట్రలు పన్నారు” అని ఆరోపణలు చేశారు. 

దీంతో కవితను పక్కనపెట్టి, టీబీజీకేఎస్​ గౌరవాధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్‌‌‌‌‌‌‌‌కు చాన్స్​ ఇచ్చారు. అది రాజకీయ కుట్రంటూ మరోసారి కవిత ఆరోపణలు చేశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో పార్టీ అధినేత కేసీఆర్​.. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్​ చేశారు. అదే రోజు తన ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. ఆ వెంటనే హరీశ్​పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్రబుల్​షూటర్​కాదు.. ట్రబుల్​మేకర్ ​అంటూ వ్యాఖ్యానించారు. 

కేసీఆర్​ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో అవలంబిస్తున్న విధానాల వల్లే బీఆర్ఎస్‌‌‌‌కు ఓటములు ఎదురవుతున్నాయని అన్నారు. పద్ధతి మార్చుకోకుంటే పార్టీకి పెనునష్టం తప్పదని హెచ్చరించారు. పదేండ్ల పాలనలోని బీఆర్ఎస్​ వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్న కవిత.. ఇప్పుడు జూబ్లీహిల్స్‌‌‌‌లో బీఆర్ఎస్​ ఓటమిపై స్పందిస్తూ కర్మ ఎవరినీ వదలదంటూ పోస్ట్​పెట్టి మరో చర్చకు తెరలేపారు. 

వాళ్ల పేర్లు బయటపెట్టినందుకే  పార్టీ నుంచి బయటకు పంపారు

మెదక్/నర్సాపూర్/కౌడిపల్లి/పాపన్నపేట, వెలుగు: ట్రిపుల్ ఆర్​ భూనిర్వాసితులకు న్యాయమైన పరిహారం కోసం అవసరమైతే హైదరాబాద్‌‌‌‌లో పోరాటం చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా ఆమె శుక్రవారం మెదక్ జిల్లాలో పర్యటించారు. నర్సాపూర్‌‌‌‌‌‌‌‌లోని స్కూల్‌‌‌‌లో చిల్ట్రన్స్​డే వేడుకల్లో పాల్గొని, అనంతరం రెడ్డిపల్లిలో కాళేశ్వరం ప్యాకేజీ-18 పనులను పరిశీలించారు.

 అక్కడ ట్రిపుల్ ఆర్‌‌‌‌‌‌‌‌లో భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడారు. పెద్దల భూములు కాపాడేందుకే రెడ్డిపల్లి దగ్గర ట్రిపుల్ ఆర్​అలైన్మెంట్​మార్చారని కవిత ఆరోపించారు. మల్లన్నసాగర్​భూనిర్వాసితులు ఈ ప్రాంతంలో భూములు కొనుక్కున్నారని, మళ్లీ వాళ్ల భూములు పోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డిపల్లి వద్ద ట్రిపుల్ ఆర్​అలైన్‌‌‌‌మెంట్​మార్పుపై స్పందిస్తూ.. ‘‘ఏ సర్వే నెంబర్లలో ఎవరి భూములు ఉన్నాయి. 

ఏం జరిగిందనేది వెరిఫై చేసి శనివారం ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో చెబుతాను. నేను ఎవరి పేరైనా గట్టిగా, బాహాటంగా చెప్తాను. అలా చెప్పినందుకే నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు” అని వ్యాఖ్యానించారు.