- వాతావరణంలో మార్పులతో వెంటాడుతున్న ఫ్లూ భయం
- కోళ్లకు సోకుతున్న కొక్కెర తెగులు
- 30 శాతానికి పైగా చనిపోతున్న కోళ్లు
- నష్టాలు వస్తుండడంతో చిక్స్ సప్లై తగ్గించిన కంపెనీలు
మహబూబ్‌నగర్/వనపర్తి, వెలుగు: చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే కిలోపై రూ.50 నుంచి రూ. వంద వరకు పెరిగాయి. రానున్న వారం రోజుల్లో ఈ ధర రూ.400 వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో లైవ్ బర్డ్(ఒకటి) రూ.178 నుంచి రూ.180 వరకు పలుకుతోంది.
స్కిన్‌తో కేజీ చికెన్ రూ.290 వరకు ఉండగా, స్కిన్ లెన్ చికెన్ రూ.310 పలుకుతోంది. రిటైల్ మార్కెట్లో ఈ ధరలకు రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా పెంచి అమ్ముతున్నారు. డిమాండ్‌కు తగినట్లు సప్లై లేకపోవడమే ధరల పెరుగుదలకు ప్రధానం కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
తగ్గిన చిక్స్ సప్లై..
రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులకు ఆయా కంపెనీలు చిక్స్‌ను సప్లై చేస్తున్నాయి. ప్రతి 45 రోజులకోసారి కొత్త బ్యాచ్‌ను షెడ్లకు తరలిస్తాయి. అయితే నిరుడు పెద్ద మొత్తంలో చిక్స్‌ను తరలించగా, ఇదే సీజన్లో బర్డ్ ఫ్లూ సోకడంతో కోళ్లు చనిపోయాయి. దాణా ఖర్చులు కూడా చేతికిరాక కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ ఏడాది ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ సోకడంతో పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోతున్నాయి.
వాతావరణంలో వస్తున్న మార్పులతో రాష్ట్రంలోనూ బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉండడంతో చికెన్ కంపెనీలు ముందస్తు జాగ్రతలు తీసుకుంటున్నాయి. చిక్స్ సప్లైని పూర్తిగా తగ్గించాయి. వనపర్తి జిల్లా కొత్తకోట ప్రాంతంలో జనవరి నెలలో 5.80 లక్షల చిక్స్‌ను ఆయా కంపెనీలు ఫారంలకు సప్లై చేశాయి. అవి ఎదిగిన 45 రోజుల తర్వాత వైరస్ సోకి మూడు లక్షల కోళ్లు చనిపోయాయి.
ఇలా భారీగా నష్టాలు వస్తుండడంతో కంపెనీలు చిక్స్ సప్లైని పూర్తిగా తగ్గిస్తున్నాయి. ఒక షెడ్‌కు 20 వేల చిక్స్ అవసరమైతే, 10 వేల చిక్స్‌ను కూడా పంపడం లేదని చెబుతున్నారు. దీనికితోడు రాష్ట్రంలోని కోళ్లను రాయలసీమ ప్రాంతానికి తరలిస్తున్నట్లు తెలిసింది.
సీజన్ కావడంతో డిమాండ్..
ప్రస్తుతం రంజాన్‌తో పాటు పెండ్లిళ్ల సీజన్ మొదలైంది. పెద్ద మొత్తంలో చికెన్ వంటకాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటితో పాటు ఇతర ఫంక్షన్లకు నాన్ వెజ్ డిష్‌లో చికెన్ ముఖ్యమైంది కావడంతో, వినియోగదారులు పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నారు. రానున్న ఏప్రిల్, మే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో వ్యాపారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వనపర్తి జిల్లాలో కోళ్ల మృత్యువాత
వనపర్తి జిల్లాలో కొక్కెర వ్యాధితో కోళ్లు చనిపోతుండడంతో ఫారం నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. వనపర్తి మండలం పెద్దగూడెంలోని ఒక పౌల్ట్రీ రైతు షెడ్లో 3 వేల కోళ్లు చనిపోయాయి. నిర్వాహకుడు వాటిని పెబ్బేరు రోడ్డులోని అటవీ ప్రాంతంలో లోయలో పారబోశాడు. విషయం తెలుసుకున్న పశు సంవర్ధకశాఖ అధికారులు వాటిని పరిశీలించిన కొక్కెర తెగులుతో చనిపోయినట్లు నిర్ధారించారు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల కింద పగటి ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉండగా, ప్రస్తుతం 36 డిగ్రీలకు చేరింది. దీంతో కొక్కెర తెగులు సోకుతుందని భావిస్తున్నారు.
బ్రాయిలర్ కోళ్లలోనే ఆర్డీ తెగులు..
బ్రాయిలర్ కోళ్లలోనే ఎక్కువగా కొక్కెర తెగులు(ఆర్డీ) సోకే అవకాశం ఉంటుందని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. బ్రాయిలర్ కోడి గరిష్ఠంగా 45 రోజులకే చికెన్‌కు ఉపయోగపడుతుంది. గుడ్లు పెట్టే కోళ్లు షెడ్లో ఏడాదిన్నర వరకు ఉంచవచ్చు. సాధారణంగా వేసవిలో చికెన్, గుడ్ల వినియోగం తక్కువగా ఉంటుందని, ఈక్రమంలో కోళ్లు చనిపోతే నష్టపోవాల్సి వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. వేసవిలో కోళ్లను కాపాడుకునేందుకు షెడ్లలో చల్లటి వాతావరణం కల్పిస్తారు. కోడి పిల్లలు ఎండలకు దాణా కూడా సరిగా తినవు. దీంతో కోళ్లబరువు తగ్గడం, గుడ్లు తక్కువగా పెట్టడం జరుగుతుందని రైతులు చెప్తున్నారు.
రెస్పాన్స్ టీమ్‌లను పౌల్ట్రీలకు పంపుతున్నాం..
వేసవిలో కోళ్లకు కొక్కెర తెగులు సోకుతోంది. ఈ తెగులు సోకి కోళ్లు చనిపోయిన ఫారాన్ని సందర్శించాం. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితిని తెలుసుకునేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను పంపుతున్నాం. వ్యాధి సోకిన కోళ్ల షాంపుళ్లను ల్యాబ్‌కు పంపి కారణాలను తెలుసుకుంటాం. – వెంకటేశ్వరరెడ్డి, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి, వనపర్తి
కోళ్లు చనిపోతున్నయ్..
పొద్దంతా ఎండలు కొడ్తుంటే, రాత్రి చలిగా ఉంటోంది. వాతావరణ మార్పులతో కోళ్లు చనిపోతున్నాయి. ఎన్ని మందులు వాడుతున్నా బతకడం లేదు. చివరకు దాణా ఖర్చులు కూడా చేతికి రావడం లేదు. -చంద్రారెడ్డి, పౌల్ట్రీ రైతు, మద్దెలబీడు, నారాయణపేట జిల్లా
