- గతేడాది 17,162 మెగావాట్లే అధికం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ మంగళవారం అన్ని రికార్డులను తిరగరాసింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఒకే రోజు 18,139 మెగావాట్ల పవర్ డిమాండ్ నమోదు అయింది. గతేడాది 17,162 మెగావాట్లే అధికం కాగా.. ఈ సారి మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగింది.
మార్చి మొదటి వారంలోనే ఇలా ఉంటే ఎండలు పెరిగే ఏప్రిల్, మే నెలల్లో రోజుకు 19 వేల మెగావాట్లు దాటవచ్చని విద్యుత్ శాఖ ఇంజనీర్లు చెబు తున్నారు. గరిష్ట విద్యుత్ వినియోగం రికార్డులను తిరగరాయడంతో విద్యుత్ శాఖ సిబ్బందికి, డిస్కమ్ సంస్థలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మరోసారి తన ప్రగతిని చాటుకుందని పేర్కొన్నారు.
పారిశ్రామిక రాష్ట్రాల కన్నా ఎక్కువ..
రోజుకు 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాం డ్‌తో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాల సరసన నిలిచింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 19,900 మెగావాట్లు, రాజస్తాన్ రాష్ట్రంలో 19,600–20,600 మెగావాట్ల మధ్య గరిష్ట డిమాండ్ నమోదవుతుంది. రాష్ట్రాల భూభాగం, జనాభా పరంగా పరిశీ లిస్తే పై రెండు రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం చాలా చిన్నది. కానీ, విద్యుత్ రంగంలో తెలంగాణ తన సామర్థ్యాన్ని చాటి చెప్పింది.
పంజాబ్, హర్యానా, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్ వంటి పారిశ్రామిక రాష్ట్రాల కంటే ఎక్కువ గరిష్ట డిమాండ్‌ను తెలంగాణ నమోదు చేసినట్టుగా విద్యుత్ శాఖ ప్రకటించింది. భౌగోళికంగా చిన్నదైనా, అధిక విద్యుత్ వినియోగ సాంద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. ఐటీ, ఔషధ తయారీ రంగం, సాగునీటి విస్తరణ వంటి రంగాల్లో వేగవంతమైన వృద్ధి దీనికి ప్రధాన కారణం. దీనివల్ల విద్యుత్ వినియోగంలో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2023-–24 లో గరిష్ట డిమాండ్15,623 మెగావాట్లు కాగా.. 2024–25 లో ఇది 17,162 మెగావాట్లకు చేరింది. ఈ సారి ఏకంగా 18,139 మెగావాట్లకు చేరుకున్నది.
భవిష్యత్ అవసరాలకు సిద్ధం
రాష్ట్ర విద్యుత్ శాఖ సమకాలీన అవసరాలను తీర్చడం మాత్రమే కాదు, రాబోయే వేసవి గరిష్ట విద్యుత్ డిమాండ్లను అందుకునేలా ముందస్తు ప్రణాళికలతో పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉందని విద్యుత్ఇంజినీర్లు చెప్తున్నారు. బలమైన గ్రిడ్ వ్యవస్థ, ముందు చూపు, పటిష్టమైన ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయంతో వ్యవస్థ చాలా బలోపేతమైందని చెప్తున్నారు. కంట్రోల్ రూమ్‌ల నుంచి ఫీల్డ్ స్టాఫ్ వరకు ప్రతి ఒక్కరి కృషి వల్లే డిమాండ్లను అందుకోగలుగుతున్నామని స్పష్టంచేస్తున్నారు.
రాష్ట్రానికి ఎంతో గర్వకారణం..
రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ మేరకు సరఫరా చేయడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా విద్యుత్ సరఫరాను నిర్వహించాయి. ఈ మైలురాయి తెలంగాణ ఆర్థికవృద్ధి, కార్యనిర్వహణ సామర్థ్యం, అద్భుత సమన్వయానికి నిదర్శనం. భౌగోళికంగా చిన్న రాష్ట్రం అయినప్పటికీ, పెద్ద రాష్ట్రాల గరిష్ట లోడ్లను సమానంగా లేదా అధిగమించే స్థాయికి చేరుకున్నాం. ఈ ప్రగతి పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభివృద్ధిలో మన వేగాన్ని స్పష్టం చేస్తోంది. - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
