- రెండో అభ్యర్థి పేరుపై ఇంకా రాని క్లారిటీ
- రేసులో వేంనరేందర్ రెడ్డి, వినయ్ కుమార్ సహా 16 మంది
- ఇయ్యాల మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- సాయంత్రానికి రెండో అభ్యర్థి ఖరారు.. గురువారం నామినేషన్ల దాఖలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థిని ఖరారు చేసింది. సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి తిరిగి రెన్యువల్ చేసింది. రెండో అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నది. ఈ అంశంపై చర్చించేందుకు పార్టీ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను ఢిల్లీకి రావాలని పిలిచింది. దీంతో బుధవారం (ఇయ్యాల) మధ్యాహ్నం 12 గంటలకు వారు ఢిల్లీ వెళ్తున్నారు. రెండో సీటు కోసం సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పి.శివశంకర్ కుమారుడు డా.వినయ్ కుమార్ సహా 16 మంది పోటీపడుతున్నారు. వినయ్ కోసం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పట్టుపడుతుండగా.. వేంనరేందర్ రెడ్డి కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. రాహుల్ గాంధీకి సిఫార్సు చేస్తున్నారు. దీంతో రెండో స్థానంపై ఆసక్తికర పోటీ సాగుతుంది.
ఈరోజు హైదరాబాద్కు సింఘ్వీ
రెండో సీటు విషయంలో హైకమాండ్ బుధవారం సాయంత్రం తుది నిర్ణయం తీసుకోనుంది. గురువారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అదే రోజున అభిషేక్ మను సింఘ్వీ, కాంగ్రెస్ ప్రకటించనున్న మరో అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఒక సీటులో అభిషేక్ మను సింఘ్వీకి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ రెండో అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాతనే.. వారి ఇద్దరు పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే సింఘ్వీ బుధవారమే హైదరాబాద్ కు వస్తున్నారు. రాత్రి ఇక్కడే బస చేసి గురువారం నామినేషన్ వేసిన అనంతరం ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
