- టెహ్రాన్‌లో రాత్రంతా బాంబు పేలుళ్లు..
- ఇరాన్ కొత్త రక్షణ మంత్రి కూడా మృతి!
- ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాల్లోని యూఎస్ బేస్‌లపై ఇరాన్ అటాక్
- సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' భవనమూ ధ్వంసం
- ఎటు చూసినా పేలుళ్లతో దద్దరిల్లుతోన్న పశ్చిమాసియా
- రియాద్‌లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడి
- ఖతార్‌లోని బిలియన్ డాలర్ల యూఎస్ రాడార్ ధ్వంసం
- హార్మూజ్ జలసంధిలోకి నౌకలు వస్తే పేల్చేస్తామని ఇరాన్ వార్నింగ్
- ఇరాన్ సైన్యం, నాయకత్వం ఖతం.. : ట్రంప్
- ఇరాన్‌లో 787కు చేరిన మరణాలు
టెహ్రాన్/జెరూసలెం/వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం భయానక స్థాయికి చేరింది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. మరోవైపు ఇరాన్, హెజ్బొల్లా ప్రతీకార దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్‌తోపాటు లెబనాన్, ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు ఉన్న ప్రాంతాలు మంటల్లో తగలబడుతున్నాయి. వరుసగా నాలుగో రోజు మంగళవారం కూడా ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించాయి. ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైకి ఇరాన్ కూడా మిసైల్, డ్రోన్ దాడులు కొనసాగించింది.
దీంతో పశ్చిమాసియా అంతటా ఎటు చూసినా పేలుళ్లతో దద్దరిల్లింది. అమెరికా తన బీ-2 స్టీల్త్ బాంబర్లు, ఎఫ్-35 యుద్ధ విమానాలు, యుద్ధనౌకల నుంచి క్షిపణులతో ఇరాన్‌లోని వ్యూహాత్మక కేంద్రాలు లక్ష్యంగా భీకర దాడులు చేసింది. టెహ్రాన్‌లో రాత్రంతా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే హతమైన కేవలం రెండు రోజుల వ్యవధిలోనే, ఆయన వారసుడిగా బాధ్యతలు చేపట్టిన కొత్త రక్షణ మంత్రి సయ్యద్ మాజిద్ ఎబ్ అల్-రెజా కూడా మృతిచెందినట్టు వార్తలు వచ్చాయి. దక్షిణ ఇరాన్‌లోని బుషెహర్ ఎయిర్‌పోర్ట్‌పై జరిగిన దాడిలో అక్కడ పార్క్ చేసి ఉన్న ప్యాసింజర్ విమానం బూడిదైంది.
టెహ్రాన్‌లోని కీలకమైన మెహ్రాబాద్ విమానాశ్రయంపైనా అమెరికా, -ఇజ్రాయెల్ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. పవిత్ర నగరం 'ఖోమ్'లోని 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' భవనాన్ని కూడా ధ్వంసం చేశాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే కీలక కేంద్రం ఇది. తూర్పు టెహ్రాన్‌లోని హకీమియా నివాస ప్రాంతంపైనా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ నౌకాదళ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడుల్లో సుమారు 11 యుద్ధనౌకలు ధ్వంసమైనట్లు అమెరికా ప్రకటించింది.
ప్రతీకార దాడులతో విరుచుకుపడ్డ ఇరాన్
ఇరాన్ తన క్షిపణులు 'షాహెద్' డ్రోన్లతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ప్రతీకార దాడులు చేసింది. మంగళవారం ఉదయం రియాద్‌లోని యూఎస్ ఎంబసీపై జరిగిన డ్రోన్ దాడిలో స్వల్ప అగ్నిప్రమాదం జరగగా, కువైట్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని నిరవధికంగా మూసివేశారు. కువైట్, బహ్రెయిన్, ఇరాక్, ఖతార్, యూఏఈలలోని తమ దౌత్య సిబ్బంది కుటుంబాలను అమెరికా వెనక్కి పిలిపించింది.
బహ్రెయిన్, ఇరాక్, కువైట్, యూఏఈలోని 6 అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు పడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటైన 'రాస్ తనూరా'పై కూడా ఇరాన్ దాడికి ప్రయత్నించగా, సౌదీ రక్షణ దళాలు అడ్డుకున్నాయి. ఇరాన్ దాడులతో దుబాయ్‌లోని ఒక హోటల్ తగలబడింది. మంగళవారం ఉదయం యూఏఈలోని ఫుజైరా చమురు కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది.
చర్చలకు సమయం మించిపోయింది: ట్రంప్
ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం పూర్తిగా ధ్వంసమయ్యాయని, అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీతో సహా ఆ దేశ నాయకత్వ వ్యవస్థ తుడిచిపెట్టుకుపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సాయంత్రం ప్రకటించారు. ట్రంప్ ప్రకటనకు ఒకరోజు ముందే ఇరాన్ జాతీయ భద్రతా మండలి అధిపతి అలీ లారిజానీ మాట్లాడుతూ.. తాము అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తమ వద్ద అపరిమితమైన మందుగుండు సాగ్రి ఉందని, ఈ యుద్ధాన్ని ఎంతకాలమైనా కొనసాగించగలమని ట్రంప్ పేర్కొన్నారు. రియాద్‌లోని అమెరికా ఎంబసీపై జరిగిన దాడికి, అలాగే ఆరుగురు అమెరికా సైనికుల మృతికి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. అయితే "నేరుగా సైన్యాన్ని పంపాల్సిన అవసరం ఉండకపోవచ్చు" అని పేర్కొన్నారు.
ఖమేనీ భార్య మృతి
ఖమేనీ భార్య మన్సూరే ఖోజస్తే బాఘేర్జాదే (79) కన్నుమూశారు. శనివారం అమెరికా, -ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆమె తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స పొందుతూ మరణించారని ఇరాన్ మీడియా మంగళవారం వెల్లడించింది.
ట్రంప్ హామీ ఇచ్చిన ‘విముక్తి’ ఇదేనా?: అరాఘ్చీ
అమెరికా దాడుల్లో చనిపోయిన అమాయక బాలికల డెడ్ బాడీలను పూడ్చిపెట్టడానికి తవ్వుతున్న సామూహిక సమాధుల వైమానిక చిత్రం అంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ ఓ ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఇది ట్రంప్ చేసిన 'కోల్డ్ బ్లడెడ్' మర్డర్ అని అన్నారు. "అమెరికా -ఇజ్రాయెల్ బాంబు దాడిలో ఒక ప్రాథమిక పాఠశాలలో మరణించిన 160 మందికి పైగా అమాయక చిన్నారుల కోసం ఈ సమాధులు తవ్వుతున్నారు. వారి శరీరాలు ముక్కలు ముక్కలయ్యాయి. ట్రంప్ వాగ్దానం చేసిన 'విముక్తి' నిజానికి ఇలా ఉంటుంది. గాజా నుంచి మీనాబ్ వరకు, అమాయకులు క్రూరంగా హత్యకు గురవుతున్నారు" అని అరాఘ్చీ అన్నారు.
ఇరాన్లో 787కు పెరిగిన మృతులు..
ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మంగళవారం వరకూ అమెరికా,- ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ లో 787 మంది మరణించారు. ఇజ్రాయెల్‌పై హిజ్బొల్లా, ఇరాన్ చేసిన దాడుల్లో 11 మంది మరణించారు. హిజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో లెబనాన్‌లో 52 మంది మరణించారు.
