నిర్మల్ జిల్లాలో మిల్లర్ల నిర్వాకం.. రూ.300 కోట్ల వడ్లు పక్కదారి

నిర్మల్ జిల్లాలో మిల్లర్ల నిర్వాకం..  రూ.300 కోట్ల వడ్లు పక్కదారి
  • నిర్మల్​ జిల్లాలో సీఎంఆర్​ ఇవ్వకుండా మిల్లర్ల నిర్వాకం
  • ఇప్పటికే 28 రైస్​మిల్లులపై కేసులు
  • తాజాగా మరో మిల్లులో ఎన్​ఫోర్స్​మెంట్​ దాడులు

నిర్మల్, వెలుగు: జిల్లాలో పలు రైస్ మిల్లులు 2022–23 యాసంగి సీజన్ నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.3‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌00 కోట్ల విలువైన సీఎంఆర్ వడ్లను పక్కదారి పట్టించినట్లు తేలింది. ఇప్పటికే 28 రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ ఆఫీసర్లు కేసులు నమోదు చేసి, మిల్లులను సీజ్ చేశారు. తాజాగా రెండు రోజుల క్రితం కడెం మండల కేంద్రంలోని కట్ట బాలాజీ రైస్ మిల్లులో దాడులు జరిపారు. ఈ సందర్భంగా 2024–-25 యాసంగికి సంబంధించి దాదాపు 2,684 టన్నుల వడ్ల లెక్క తేలలేదు. ఈ ధాన్యం విలువ రూ.6.22 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.

 అలాగే, కొన్ని రోజుల క్రితం ఖానాపూర్ పరిధిలోని రుద్ర, మహాలక్ష్మి, కృష్ణ రైస్ మిల్లుల్లోనూ సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. వీటితోపాటు  జిల్లాలోని మరో 24  మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి, అక్రమాల నిగ్గు తేల్చారు. ఈ మిల్లులన్నింటినీ సీజ్​చేసి, కేసులు నమోదు చేశారు. మిల్లర్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అధికారులను పక్కదోవ పట్టిస్తుండటం రివాజుగా మారింది.  

బినామీల పేరిట కొత్త మిల్లులు..

సీజ్​అయిన 28 మిల్లుల యజమానులు కొత్త పథకం వేశారు. వారు తమ బినామీల పేరిట మళ్లీ కొత్త మిల్లులను ఏర్పాటు చేసి, వాటికి సైతం సీఎంఆర్ వడ్లను కేటాయించేలా చూసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే పాత మిల్లుల వ్యవహారం మూలకు పడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. 

భైంసా, ఖానాపూర్ లలోనే ఎక్కువ

భైంసా డివిజన్, ఖానాపూర్ రైస్ మిల్లర్లే ఎక్కువగా సీఎంఆర్ వడ్ల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడినట్లు వెల్లడైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొంతమంది రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల అండదండలతో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి వడ్ల విషయంలో అధికారులను బురిడీ కొట్టించి, అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులున్నాయి. కొనుగోళ్లలో వేగం పెంచడంతోపాటు కొనుగోలు కేంద్రాల నుంచి యుద్ధప్రాతిపదికన ధాన్యాన్ని మిల్లులకు తరలించడం వారికి వరంగా మారింది. ఓవైపు వానాకాలం ధాన్యం మిల్లింగ్ ప్రక్రియ పూర్తికాకముందే యాసంగి వడ్లు మిల్లులకు రావడంతో నిల్వల లెక్కలన్నీ గందరగోళంగా మార్చేశారని అధికారులు పేర్కొంటున్నారు.