T20 World Cup 2024: యువీకి అరుదైన గౌరవం.. టీ20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక

T20 World Cup 2024: యువీకి అరుదైన గౌరవం.. టీ20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు ఐసీసీ అరుదైన గౌరవం కలిపించింది. అతన్ని 2024 T20 ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. ఇప్పటికే ఈ పొట్టి సమరానికి వెస్టిండీస్ మాజీ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్, ఒలింపిక్ బంగారు పతక విజేత ఉసేన్ బోల్ట్‌లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా యువరాజ్ వీరి సరసన చేరాడు. జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా యువీ అన్ని ప్రచార కార్యక్రమాలకు హాజరవుతున్నాడు.         

2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా గెలవడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. 42 ఏళ్ల యువీ.. ఈ మెగా సమరంలో 6 మ్యాచ్‌ల్లో 148 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్‌ ఏకంగా 194.74 స్ట్రైక్ రేట్‌ ఉండడం విశేషం. ఆస్ట్రేలియాపై సెమీ ఫైనల్లో 30 బంతుల్లోనే 70 పరుగులు చేసి భారత్ ను ఒంటి చేత్తో ఫైనల్ కు చేర్చాడు. ఇక డర్బన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ లో స్టువర్ట్ బ్రాడ్‌ బౌలింగ్ లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన ఈ లెఫ్ట్ హ్యాండర్ టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.

అందరూ ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి ప్రారంభమవుతుంది. వెస్టింసీడ్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. జూన్ 1న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా.. కెనడాతో తలపడుతుంది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.భారత్ మ్యాచ్ ల విషయానికి వస్తే జూన్ 5 న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ జట్లు  జూన్ 9 న న్యూయార్క్ సిటీలో తలపడనున్నాయి. జూన్ 12 న న్యూయార్క్ లో అమెరికాపై, 15 న కెనడాతో ఫ్లోరిడాలో భారత్ లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది. భారత్ తమ గ్రూప్ మ్యాచ్ లన్ని అమెరికాలోనే ఆడబోతుంది.