ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసాయి..  రూ. 250 కోట్లు ఆపేసిన సర్కారు

ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసాయి..  రూ. 250 కోట్లు ఆపేసిన సర్కారు

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా లోకల్​బాడీలకు రూ. 250 కోట్లు రిలీజ్​చేస్తూ జీఓ జారీ చేసిన సర్కారు.. ఎన్నికలు ముగియడంతో ఇప్పుడా ఫండ్స్​పై ఫ్రీజింగ్​పెట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి ఫండ్స్ కోసం వెయిట్ చేస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు ఎలక్షన్ల టైంలో ప్రభుత్వం ఒక్కసారిగా నిధుల వర్షం కురిపించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, జిల్లా పరిషత్​లకు కలిపి రూ.250 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు ఈ నెల 3న ఆర్డర్స్ ఇచ్చింది. ఎన్నికలు ముగియడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఆ ఫండ్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ లకు ఫోన్లు చేసి ఫండ్స్ గురించి ఆరా తీస్తున్నారు. కానీ ఫండ్స్ పై ఫ్రీజింగ్ పెట్టారన్న విషయం బయటకు తెలిస్తే లేనిపోని చిక్కులు వస్తాయని ఆఫీసర్లు సైతం గుట్టుగా వ్యవహరిస్తున్నారు.  ఈ ఏడాది నాగార్జున సాగర్ బైపోల్ సందర్భంగా సీఎం ప్రకటించిన ఎస్డీఎఫ్ ఫండ్స్​రూ. 200 కోట్లు ఇప్పటికీ అతీగతీ లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఫండ్స్ అయినా తమకు అక్కరొస్తాయని ఆశించారు. కానీ ఇప్పుడా ఫండ్స్ పై కూడా ఫ్రీజింగ్ విధించడంతో స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
జీతాలు ఒక్కటే క్లియర్..
ట్రెజరీలకు పంపిన ఏ బిల్లూ ఇన్​టైంలో పాస్ కావడం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. ఉద్యోగస్తుల జీతాల బిల్లులు తప్ప చివరికి స్టేషనరీ బిల్లులు పాస్ కావాలన్న కనీసం మూడు, నాలుగు నెలలు ఆగాల్సిందేనని అంటున్నారు. ఫెస్టివల్ అలవెన్సులు, జీపీఎఫ్, ఉద్యోగులు ఎవరైనా ట్రాన్స్​ఫర్ అయితే వాళ్లకు సంబంధించిన జీతాల బిల్లులతో సహా అన్నీ ఫ్రీజింగ్​లో పెడుతున్నారని, అసలు ఫ్రీజింగ్ అనేది కామన్ అయిపోయిందని అంటున్నారు. ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు మాత్రం పీడీ అకౌంట్​లో ఫండ్స్ ట్రాన్స్​ఫర్ చేశామని, వాటి ఖర్చులకు సంబంధించి ప్రతి నెల బిల్లులు సమర్పించాలనే రూల్స్ మాత్రం పేర్కొంటున్నారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం అంచనాలు తలకిందులవుతున్నాయని ఆఫీసర్లు వాపోతున్నారు. 

వర్క్స్ గైడ్​లైన్స్​కూడా రాలే..
ఎన్నికల్లో రూలింగ్ ​పార్టీ ప్రయోజనం పొందేందుకు ఎన్నికల కోడ్ సైతం ఉల్లంఘించి ఆర్డర్స్ ఇచ్చారు. ఆర్డర్స్ అయితే ఇచ్చారని, కానీ వాటిని ఏ రకంగా వాడుకోవాలనే దానిపై గైడ్​లైన్స్ రాలేదని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ నిధుల్లో జనరల్ కాంపోనెంట్​తోపాటు, ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఫండ్స్​ఏ పనులకు వినియోగించాలి.. ఏ రకంగా ఖర్చు పెట్టాలి.. జిల్లా లెవల్​లో వర్క్ ఆర్డర్స్ ఎవరు ఇవ్వాలి అనేదానిపై స్పష్టత రావాల్సి ఉందని చెపుతున్నారు.  

నిధులపై పెత్తనం ఎవరిదో? 

గైడ్​లైన్స్ సంగతేమో గానీ అసలు ఈ నిధులపై పెత్తనం ఎవరు చేస్తారోనని ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. నాగార్జునసాగర్ బైపోల్ లో ప్రతి గ్రామానికి రూ.20 లక్షలు, మండల కేంద్రానికి రూ.30 లక్షలు, మున్సిపాలిటీలకు రూ.21 కోట్లు కలిపి మొత్తం రూ.199 కోట్లు ఎస్డీఎఫ్ కింద రిలీజ్ చేస్తున్నట్లు జూన్​లో ఆర్డర్స్ ఇచ్చారు. అయితే ఈ నిధులపై ఎమ్మెల్యేలు పెత్తనం చేయడంతో సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు సైలెంటయ్యారు. ఇప్పటివరకు ఒక్క వర్క్ కూడా నల్గొండ జిల్లాలో స్టార్ట్ కాలేదు. నెలరోజుల క్రితం జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు తెలిసింది. కానీ అసలు కథ అంతా ఇప్పుడే మొదలైంది. సీఎం ఇచ్చిన ఎస్డీఎఫ్ ఫండ్స్ ఎమ్మెల్యేల సొంతమని చెప్పి వాటిని అనుచరులకు, కార్యకర్తలకు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సర్పంచులు తీర్మానాలు చేసినోళ్లకే వర్క్స్​ఇస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. సీఎం సొంత నిధుల్లోంచి ఇచ్చిన ఫండ్స్ కాబట్టి వాటిపై సర్వాధికారాలు తమకే ఉంటాయని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఈ వివాదంతో ఇప్పటివరకు ఎక్కడా కూడా వర్క్స్ స్టార్ట్ కాలేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడొచ్చిన ఈ నిధులకు.. ఎస్డీఎఫ్ కు ఎమ్మెల్యేలు లింక్ పెట్టి మాయ చేస్తారేమోనని స్థానిక ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.