ధరణిలో.. దరఖాస్తుల గుట్టలు

ధరణిలో.. దరఖాస్తుల గుట్టలు

ఆన్‌‌లైన్‌‌లో 5 లక్షలకు పైగా అప్లికేషన్లు

కోర్టుల్లో మరో 3 లక్షల కేసులు భూసమస్యలు పరిష్కారం కాక రైతుల అరిగోస ధరణితో రైతుల వెతలు తీరాయంటూ ప్రభుత్వ పెద్దల ప్రకటనలు

రైతుల దగ్గర ఫీజుల రూపంలో వసూలు

ధరణిలో నమోదైన తప్పులను సవరించేందుకు కొత్త మాడ్యూల్స్ తెచ్చి అప్లికేషన్ల పేరుతో ఒక్కోదానికి సర్వీస్ చార్జీలతో కలిపి రాష్ట్ర సర్కార్​ రూ.1,011 వసూలు చేస్తున్నది. మొత్తంగా అప్లికేషన్ల ఫీజుతోనే  రూ.30 కోట్ల దాకా వసూలు చేసినట్లు తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార పార్టీ నేతల సిఫార్సు ఉంటే తప్ప దరఖాస్తులను సీసీఎల్ఏ అధికారులు, కలెక్టర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పనులు చేయించేందుకు కొందరు తహసీల్దార్లు, లీడర్లు దళారుల అవతారమెత్తుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

హైదరాబాద్, వెలుగు: భూసమస్యలు పరిష్కారం కాక రైతులు అరిగోస పడుతుంటే.. సర్కారు మాత్రం ‘ధరణి’ అద్భుతం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నది. పోర్టల్‌‌తో రైతుల సమస్యలు తీరాయంటూ ప్రకటనలు చేస్తున్నది. కానీ వాస్తవానికి ధరణిలో ఏకంగా 5 లక్షలకు పైగా అప్లికేషన్లు మూలుగుతున్నాయి. మరో 3 లక్షల కేసులు ధరణి, భూ సమస్యలపైనే జిల్లా కోర్టులు, హైకోర్టుల్లో నడుస్తున్నాయి. ఇవిగాక మిస్సింగ్ సర్వే నంబర్, ఎక్స్​టెంట్ కరెక్షన్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ వంటి వాటి కోసం ఇంకో రెండు లక్షల అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది.

 ..దరఖాస్తుల గుట్టలు

ఇతర చిన్న సమస్యలు కోకొల్లలు. పరిస్థితి ఇలా ఉంటే.. ధరణి అద్భుతమంటూ సీఎం,  మంత్రులు చెప్పుకుంటున్నరు. ధరణిలో వస్తున్న అప్లికేషన్లపై మాత్రం చప్పుడు చేస్తలేరు. అసలు పోర్టల్‌‌లో ఎలాంటి సమస్య లేకపోతే సరిగ్గా ఏడాది కిందట రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కేసీఆర్ ఎందుకు ప్రకటించారు? ఆ తర్వాత ఎందుకు వెనక్కి తగ్గారనే దానికి జవాబు లేదు. జిల్లా కోర్టులు, హైకోర్టులో లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్న విషయాన్ని కూడా సర్కారు గోప్యంగా ఉంచుతున్నది.

సర్కారు తప్పులకు కోర్టుల చుట్టూ రైతులు

రాష్ట్రవ్యాప్తంగా కిందిస్థాయి కోర్టుల నుంచి హైకోర్టు దాకా రెండున్నర ఏండ్లలో దాదాపు 2.50 లక్షల కేసులు ధరణిలోని సమస్యలపై నమోదైనవే ఉన్నాయి. ప్రభుత్వం దృష్టికి రానివి మరో 50 వేల పైనే ఉంటాయని తెలుస్తున్నది. ధరణి తీసుకువచ్చే ముందు రాష్ట్రంలో రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. పాత కేసుల పరిష్కారానికి ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసింది. కానీ పాత కేసులు కూడా పరిష్కారం కాలేదు. 2020లో  ఆర్‌‌‌‌వోఆర్‌‌‌‌ చట్టానికి సవరణ చేస్తూ ‘తెలంగాణ రైట్స్‌‌‌‌ ఇన్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌ అండ్‌‌‌‌ పట్టాదార్‌‌‌‌ పాస్‌‌‌‌బుక్స్‌‌‌‌’ను ప్రభుత్వం తీసుకువచ్చింది. దీంట్లో రెవెన్యూ కోర్టులు, ట్రిబ్యునళ్లు లేవు. ఫలితంగా కలెక్టర్లు భూ సమస్యలను పరిష్కరించకపోతే.. రైతులు నేరుగా కోర్టుల్లో కేసులు వేసుకోవాల్సిన  పరిస్థితి. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడానికి నెలలకు నెలలు పడుతున్నది. కొన్నింటికి కోర్టు ఆర్డర్లు ఉన్నా.. వాటిని అమలు చేసేందుకు అధికారులు చాలా టైమ్ ​తీసుకుంటున్నారు. లక్ష కేసులపై ఇప్పటికే కోర్టులు ప్రభుత్వానికి, ఆఫీసర్లకు డైరెక్షన్స్ ఇవ్వగా ఇంప్లిమెంట్ కానివి సగానికిపైగా ఉన్నాయి.

రెవెన్యూ సదస్సులతో ఇబ్బందులొస్తయని..

భూసమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని గతేడాది జులై 5న ప్రభుత్వం ప్రకటించింది. ధరణిపై రైతుల్లో వ్యతిరేకత ఉండటం, ఎంతకీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సదస్సులు పెడితే మొదటికే మోసం వస్తుందని సర్కారు వెనక్కి తగ్గినట్లు బీఆర్ఎస్ లీడర్లే చెప్తున్నారు. గతంలో సిద్దిపేట జిల్లాలోని ములుగులో మంత్రి, సీఎస్ ఆధ్వర్యంలో ఆఫీసర్లు నిర్వహించిన ధరణి సమస్యల పైలెట్ ప్రోగ్రామ్ లో రైతుల ఇబ్బందులు బయటకొచ్చాయి. ఒక్క గ్రామంలోనే 272 మంది రైతులు ధరణి తప్పులతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. దీంతో ‘లొల్లి అవసరమా?’ అని సీఎంఓ వెనుకడుగు వేసినట్లు తెలిసింది.

రోజుకో సమస్య.. వేలల్లో దరఖాస్తులు

ధరణిలో మొత్తం 33 రకాల మాడ్యూల్స్ ఉన్నాయి. ఇందులో వివిధ సమస్యలపై రైతులు అప్లికేషన్లు పెట్టుకుంటూనే ఉన్నారు. అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ సరి చేయకుండా ఎంతో కొంత ఆశించి రిజెక్ట్ అయ్యేలా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో చేసేది లేక రైతులు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారు. ధరణిలో వివిధ మాడ్యూల్స్ ద్వారా ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 15 లక్షల పైనే ఉన్నది. ఇందులో దాదాపు సగం రిజెక్ట్ కాగా.. ఇంకో 5 లక్షలకు పైగా అప్లికేషన్లు పెండింగ్‌‌లోనే ఉన్నాయి. అత్యధికంగా ల్యాండ్ గ్రీవెన్స్ మ్యాటర్స్​కు సంబంధించినవి ఉండగా.. తర్వాత టీఎం 33 మాడ్యూల్ ద్వారా పాస్ బుక్ డేటా కరెక్షన్‌‌ కోసమే వచ్చాయి. పెండింగ్ మ్యుటేషన్లు, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ జాబితా నుంచి తొలగించాలని అప్లికేషన్లు వచ్చాయి. ప్రొహిబిటెడ్ ల్యాండ్స్‌‌కు సంబంధించి మాజీ సైనికులు, స్వాతంత్ర్య సమర యోధుల అప్లికేషన్లు కూడా భారీగానే ఉన్నాయి.