ఈ పిలగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు : సీఎం రేవంత్ రెడ్డి

ఈ పిలగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు :  సీఎం రేవంత్ రెడ్డి
  • అదే నా ఆశయం.. అదే నా తపన.. తెలంగాణకే నా జీవితం అంకితం
  • వీ6-వెలుగు స్పెషల్​ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్​రెడ్డి
  • ఎంపీ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండమే
  • రిజర్వేషన్లు ఎత్తేసుడే బీజేపీ కోర్ ఐడియాలజీ
  • రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలే?
  • పదేండ్లు సీఎంగా ఉంట.. కొత్తతరానికి మార్గదర్శనం చేస్త
  • సర్కారులో ఏకపక్ష నిర్ణయాలుండవ్​.. టీమ్​ వర్క్​తోనే వెళ్తం
  • బరాబర్ గుంపు మేస్త్రీనే.. అదేం తక్కువ కాదు
  • కేసీఆర్​ లెక్క పోలీసుల్ని వాడే చిల్లర పనులు చెయ్య
  • ఆయన రాష్ట్రాన్ని ఆగం చేసి.. 
  • నీళ్లు, నిధులు లేని తెలంగాణను మాకు ఇచ్చిండు
  • పదేండ్లు అంబేద్కర్​కు కేసీఆర్​ దండేయలే.. 
  • దండం పెట్టలే.. ఇప్పుడు జపం చేస్తున్నడు
  • నా బిడ్డ పెండ్లికి నన్ను జైల్లో పెడ్తే.. ఇప్పుడు ఆయన బిడ్డే జైల్లో ఉంది
  • రాష్ట్రాభివృద్ధికి కేసీఆర్​ మంచి సలహాలిస్తానంటే ఇంటికెళ్లి కలుస్త
  • పదవులు పార్టీ నిర్ణయమే.. నా చేతుల్లో ఉండదు

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, కాపాడే జిమ్మేదారి ప్రజలు తనకు ఇచ్చారని.. వాళ్ల నమ్మకాన్ని నిలబెడతానని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. తన జీవితం తెలంగాణకే అంకితమని తెలిపారు. ‘‘ఈ పిలగాడు మంచి చేసిండని జనం నుంచి అనిపించుకుంటే చాలు. అదే నా ఆశయం.. అదే నా తపన” అని చెప్పారు. కేసీఆర్​ మంచి సలహాలిస్తానంటే ఇంటికెళ్లి ఆయనను కలుస్తానని, తనకు ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు. పదేండ్ల హయాంలో కేసీఆర్​ చేసిన తప్పులను, విధ్వంసాన్ని సెట్​ చేయడానికి తాము రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తున్నదని.. ఒక్కోసారి నిద్రకూడా పట్టడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం దీన్ని తాము బాధ్యతగానే భావిస్తున్నామని తెలిపారు. పీసీసీ చీఫ్​ పోస్టు బరువు అయితే.. సీఎం పోస్టు ఓ బాధ్యత అని ఆయన చెప్పారు. ‘‘సీఎం కుర్చీలో కూర్చుంటే మంచైనా,  చెడైనా నా ఖాతాలోనే పడ్తది. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్​ సూచనలు ఇస్తానంటే ఆయన ఇంటికి వెళ్లి తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. పిలగాడు మంచోడు.. కేసీఆర్ సలహా ఇస్తే సుత తీసుకున్నడని జనం అనుకుంటరు. తెలంగాణ సమాజం నా నుంచి ఏమి ఆశిస్తున్నది?  నేనో ఆరడుగుల ఆజానుబాహుడినని, బాహుబలినని, కత్తులు తిప్పుతడని అనుకోరు కదా?  పిలగానికో అవకాశమిస్తే బాగానే చేసిండు అనుకుంటే చాలు. అంతకుమించి అప్రిసియేషన్ నాకు​ అక్కర్లేదు. కేసీఆర్​లాగా తిక్కతిక్క ఆలోచనలు నాకు లేవు” అని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం వీ6, వెలుగుకు సీఎం రేవంత్​రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

వందరోజుల పాలన, లోక్​సభ ఎన్నికలు, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, హాట్​టాపిక్​గా మారిన బీఆర్​ఎస్​ అక్రమాలపై విచారణ తదితర అంశాలపై సూటిగా సమాధానాలు ఇచ్చారు. సంక్షేమం, అభివృద్ధి తమకు రెండు కండ్ల లాంటివని.. తాను ఏకపక్షంగా ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోనని, అందరితో చర్చించి టీమ్​ వర్క్​గా ముందుకెళ్తానని చెప్పారు. పదేండ్లలోనే వందేండ్ల విధ్వంసాన్ని కేసీఆర్​ సృష్టించారని.. నీళ్లు, నిధులు లేని రాష్ట్రాన్ని తమకు అప్పగించారని అన్నారు.

వీ6, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో వీ6తో మాట్లాడుతూ అధికారంలోకి వస్తామని చాలా కాన్ఫిడెంట్​గా చెప్పారు. సీఎం అవుతానని అప్పుడే అనుకున్నరా? 

సీఎం రేవంత్​రెడ్డి: కేసీఆర్​ ఓడితే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందని మాత్రం అనుకున్న. కాంగ్రెస్​ గెలిచిన తర్వాత పార్టీలో సీఎం ఎవరనే చర్చ ముందుకు వచ్చింది. రేసులో నా పేరు కూడా ఉండె. పీసీసీ అధ్యక్షుడ్ని కనుక నాచురల్​గానే కొంత అడ్వాంటేజ్​ ఉంటది. పార్టీలో చర్చ జరిగేటప్పుడు సీఎల్పీ లేదా పీసీసీ చీఫ్​కి ప్రాధాన్యం ఉంటుంది. ఆ క్రమంలోనే అవకాశం వచ్చింది. 

మోదీ పాలనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని మీరు చాలాసార్లు అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్​ వస్తే  మీ స్టాండ్​ ఏమిటి? 

కాంగ్రెస్​ పార్టీ స్టాండే నా స్టాండ్​. దక్షిణాది రాష్ట్రాలకు ఎప్పుడైనా సముచిత స్థానాన్ని కల్పించడం, సమానమైన అవకాశాలు కల్పించడం కేవలం కాంగ్రెస్​ ద్వారానే సాధ్యం. ఇప్పటి వరకు పార్టీ దక్షిణాదికి రాజకీయంగా అధిక ప్రాధాన్యం కల్పించింది కాంగ్రెస్​ పార్టీయే. ఉత్తరాదికి ప్రధాని పదవి ఇస్తే దక్షిణాదికి రాష్ట్రపతి పదవి ఇచ్చింది. డిఫెన్స్​ మినిస్ట్రీ అక్కడిస్తే, హోం మినిస్ట్రీ ఇక్కడి వాళ్లకు ఇచ్చింది. ఒకవేళ హోం ఇక్కడి వాళ్లకు ఇస్తే డిఫెన్స్​ అక్కడి వాళ్లకు ఇచ్చేది. రూరల్​, అర్బన్​ మినిస్ట్రీల విషయంలో కూడా కాంగ్రెస్​ ఇదే సూత్రాన్ని పాటించింది. రాజకీయ అవకాశాలకు సంబంధించి సౌత్​, నార్త్​ మధ్యలో 40, 60 పర్సెంట్​ నడుమ రేషనలైజేషన్​ చేసి సముచితమైన స్థానాన్ని కల్పించేది. ఇప్పుడు మోదీ పాలనలో ఆ బ్యాలెన్స్​ పోయింది. ఏ పదవి చూసినా ప్రధాన మంత్రి, హోం, రక్షణ, ఆర్థిక, స్పీకర్​, ప్రెసిడెంట్​, వైస్​ ప్రెసిడెంట్​, వైస్​ చైర్మన్​ లాంటి కేంద్ర ప్రభుత్వంలోని ఒక 20 కీలక పదవులు తీసుకుంటే అన్నింటికీ అన్ని ఉత్తరాది వాళ్లకే ఇచ్చారు. కనీసం వాళ్లో 15 తీసుకొని ఒక ఐదు కూడా ఇక్కడి వాళ్లకు ఇవ్వలేదు. కేంద్రంలో కాంగ్రెస్​ వస్తే తప్పకుండా ఈ పరిస్థితి మారుతుంది. 

12 సీట్లు గెలిపిస్తే ఏడాదిలో అధికారంలోకి వస్తమని కేటీఆర్ అంటున్నరు. వాళ్లకు ఎందుకంత ధీమా?

రాష్ట్రంలో ఏదైనా జరగాలంటే..  ప్రభుత్వం పోవాలంటే  బీజేపీ, బీఆర్ఎస్ కలవాలి. ఈ ఇద్దరు కలవకుండా ఉండరు. ప్లాన్ రెడీ అయిన తర్వాత.. ఇద్దరు కలిసిన తర్వాతే ఇలా మాట్లాడటం మొదలు పెట్టారు. కేటీఆర్ మాట్లాడిన తర్వాత లక్ష్మణ్ మాట్లాడుతరు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతరు. ఆ తర్వాత కిషన్​రెడ్డి. వాళ్లిద్దరు ( బీజేపీ, కాంగ్రెస్  )  కలిసి పోయారు అన్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్లిద్దరు కలిసినప్పుడు, కుట్రలు చేసినప్పుడు.. వాటిని ఎలా తిప్పికొట్టాలో.. ఏం చేయాలో నాకు క్లారిటీ ఉంది. నేను మేనేజ్ మెంట్ కోటాలో రాలే. కింది నుంచి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ. వచ్చిన.  నా అనుభవంలో ఎన్నో రాజకీయ సంక్షోభాలు చూసిన. మేం స్థానిక పరిస్థితుల ప్రకారం.. క్లీన్ ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుంటున్నం.  ఇప్పటివరకూ దానం నాగేందర్​, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్.. ఈ ముగ్గురిని మాత్రమే తీసుకున్నం.  ప్రజలు, మా పార్టీ నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నం. కేసీఆర్ లాగా ఎట్ల పడితే అట్ల తీసుకోలేదు. ప్రజలు అంటే లెక్కలేని తనంగా నిర్ణయాలు మేం తీసుకోం. 

12 సీట్లు ఇస్తే అగ్గి పుట్టిస్తం అని బీఆర్​ఎస్ నేతలు అంటున్నరు?

ఒకసారి 13 ఇచ్చారు. ఓ సారి 9 ఇచ్చారు. ఢిల్లీ నుంచి ఏం తెచ్చారు? పైసా తేలేదు. అన్ని బిల్లులకు బీజేపీకి మద్దతిచ్చి మోదీకి తాకట్టు పెట్టారు. నోట్ల రద్దు, రైతు చట్టాలు..ఇలా కొన్ని వందల బిల్లులు చెబుతా. ఇప్పుడు 12 ఇస్తే ఏం చేస్తరు? మళ్లీ మోదీకే  అమ్ముకుంటరు. రెండుసార్లు చేసింది ఇదే కదా? నోరు తెరిస్తే కేసీఆర్, ఆయన కుటుంబం అబద్ధాలు చెప్పి బతకాలని చూస్తున్నరు. రోజూ ఇదే  అలవాటు చేసుకున్నరు. రోజూ ఉదయం అందరూ యోగా, వాకింగ్, లాఫింగ్  చేస్తరు. కేసీఆర్ ఫ్యామిలీ రోజూ పొద్దున అబద్ధాలు ప్రాక్టీస్ చేసి బయలుదేరుతరనుకుంటా.. సాయంత్రం ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్పిండ్రో లెక్క కట్టుకుంటరేమో! 

రైతు భరోసా సాయం రైతులకే ఇస్తరా.. కౌలు రైతులకు కలిపి ఇస్తరా? ఈ స్కీమ్​పై ఐదెకరాల లిమిట్​ ఏమైనా పెట్టాలనుకుంటున్నరా?

కౌలు రైతుల కోసం 2011లో ఓ చట్టం చేశారు. దాని ప్రకారం కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చారు. గుర్తింపు పొందిన కౌలురైతులను గుర్తించేందుకు గ్రామ సభలను పెడ్తం. ఏ రైతు ఏ భూమిని సాగు చేస్తున్నడన్న విషయాన్ని గ్రామ సభల ద్వారా నిర్ధారించుకుని అందరికీ సాయం అందిస్తం.  ఐదెకరాల లిమిట్​ అనే దాని మీద ఇప్పటికీ ఎలాంటి చర్చ జరగలేదు. విధివిధానాలు ఖరారు చేయలేదు. పోయినసారి ఆ ప్రభుత్వం ఇచ్చిన వాళ్లకు ఇవ్వాలన్న ఉద్దేశంతో అందరికీ రైతు బంధు డబ్బులు వేశాం. కేసీఆర్​ పిచ్చోడి లెక్క మాట్లాడుతున్నడు.. ఐదెకరాలున్నోళ్లకే ఇస్తామంటున్నరని అంటున్నడు. ఆయనలాంటి దొరలకు రైతు భరోసా ఆగిపోతుందనేది ఆయన బాధ. రాష్ట్రంలో 92 శాతం మంది రైతులు 3 ఎకరాల లోపు వాళ్లే. 8 శాతం మంది మాత్రమే 3 ఎకాలకుపైన ఉన్నోళ్లు ఉన్నారు. ఐదెకరాలలోపు పొలం ఉన్నోళ్లు 64.75 లక్షల మంది. మొత్తం రైతులు 69 లక్షల మంది ఉన్నారు. అందులో ఐదెకరాల కన్నా ఎక్కువ పొలం ఉన్న రైతులు 4 లక్షల మంది. అందులో కేసీఆర్​కు సంబంధించినోళ్లే 3 లక్షల మంది ఉన్నారు. అదే ఆయన బాధ అని నేను అనుకుంటున్న. ఏది కూడా నేను ఇంట్లో కూర్చొని తలుపులు మూసుకుని నిర్ణయం తీసుకోను. సభలో అందరి అభిప్రాయాలు వింటాం. ప్రజల నుంచీ అభిప్రాయాలను తీసుకుంటాం. అందులో బెస్ట్​ ఏది అనిపిస్తే అదే తీసుకుంటాం. అసెంబ్లీ బడ్జెట్​ సెషన్​ను ఈసారి ఎక్కువ సేపు నడుపుతాం. సంక్షేమ పథకాలన్నింటిపైనా విస్తృత చర్చచేస్తం. కేసీఆర్​ వచ్చి తన అనుభవాన్నంతా రంగరించి సలహాలిస్తే తీసుకుంటం. ఆయన సభకు రావాలనే కోరుకుంటున్నం. అసెంబ్లీకి కేసీఆర్​రావొద్దని హరీశ్​ రావు అంటున్నడు. సభకు వస్తే ఏదైనా ఇబ్బంది వస్తుందని చెప్తున్నడు.

తాము అధికారంలోకి వస్తే  కేసీఆర్, కేటీఆర్ జైల్లో ఉండేవాళ్లని బండి సంజయ్ అంటున్నరు..మీరేమంటరు?

పదేండ్ల నుంచి వాళ్లే కదా కేంద్రంలో అధికారంలో ఉన్నది. మరి ఎందుకు చర్యలు తీసుకోలే? వాళ్లకు చిత్తశుద్ధి లోపించింది. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న గ్రానైట్ దోపిడీపై అప్పట్లో బండి సంజయ్ ఫిర్యాదు చేసిండు. ఈడీ దీనిపై విచారణ చేసింది. మరి ఆ కేసు ఎక్కడికి పోయింది.. ఎవరిని ఎవరు కాపాడుతున్నరు.. దీన్ని బట్టి వాస్తవం అర్థమవుతుంది. గంగుల కమలాకర్ మీద ఆరోపణలు వచ్చాయి. చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అమిత్ షా చేతిలో ఉంది. మరి ఏమైంది?

కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు మొదలుపెడ్తరు? 

ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ ప్రారంభిస్తం. రేషన్ కార్డు అనేది ఇకపై నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డు అనేది ఐడెంటిటీ. రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ వర్తించేది.. కానీ ఇప్పుడు ఆ సమస్య లేకుండా ఆరోగ్యశ్రీ కార్డును సపరేట్ చేస్తం.  

ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీపై చర్యలు ఏమిటి?

గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఫీజులు పేద, మధ్యతరగతి ప్రజలకు చాలా భారమయ్యాయి. ఫీజుల నియంత్రణపై మాన వత్వంతో పనిచేయాల్సి ఉంది. తప్పనిసరిగా ఈ అంశంపై చర్యలు తీసుకుంటం. 

మీ పరిపాలన మీద హైకమాండ్​ ఫీడ్​బ్యాక్​ ఎలా  ఉంది?

నేషనల్​ ఎలక్షన్​ మేనిఫెస్టోనే హైదరాబాద్​కు వచ్చి రిలీజ్​చేసిండ్రంటేనే పార్టీకి నాపట్ల ఉన్న అభిప్రాయం ఏమిటో తెలుసుకోవచ్చు.   సీడబ్ల్యూసీ సమావేశాలు కూడా హైదరాబాద్​లో నిర్వహించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ​, ప్రియాంకాగాంధీ, మల్లికార్జునఖర్గే దేశవ్యాప్తంగా ఎన్ని ఈవెంట్లలో కలిసి పాల్గొన్నరో అంతకంటే ఎక్కువ తెలంగాణలో వారు పాల్గొన్నారు. అంటే హండ్రడెన్​ వన్​ పర్సెంట్​ పార్టీ హ్యాపీగా ఉంది.

అవును గుంపు మేస్త్రీనే..

నేను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన. నాకు రైతుల కష్టమేంటో తెలుసు. రుణమాఫీ గురించి తెలుసు. మాట ఇస్తే ఆషామాషీగా ఇవ్వను. అంచనాతో మాట్లాడుతా. కేసీఆర్ లెక్క నేను 80 వేల పుస్తకాలు చదివినా అని అబద్ధాలు చెప్పను. ఆయన లెక్క ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ నేను చదవలేదు. జలీల్‌ఖాన్ లెక్క బీకామ్‌లో ఫిజిక్స్‌ చదవలేదు. నేను బీఏ చదువుకున్నా. నాకు కామన్‌ సెన్స్ ఉంది. ప్రజల సాధకబాధకాలు తెలుసు. నేను సింపుల్ మ్యాన్. ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. నాకున్న పరిమితమైన అవగాహనకు తోడు బాగా అవగాహన ఉన్నవాళ్లందరినీ కూర్చోబెట్టుకుని పనిచేయాలనేది నా ఆలోచన. నేను గుంపు మేస్త్రీని అని ఇదివరకు కూడా చెప్పిన. పునాది తవ్వేటోన్ని, కట్టడం కట్టేటోన్ని, సిమెంట్ అందించేటోన్ని, రాడ్ బైండింగ్ చేసేటోన్ని, ఫాల్ సీలింగ్ చేసేటోన్ని అందర్నీ కూర్చోపెట్టుకుని పనిచేయించుకుంటా. ఇప్పుడు కూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నా. గుంపు మేస్త్రీ అని నా మీద జోకులేస్తున్నరు. గుంపుమేస్త్రీ అంటే బార్లు నడిపేటోడు కాదు.. రాత్రంతా కూర్చుని మందు తాగేటోడు కాదు. గుంపు మేస్త్రీ అంటే ఒక మంచి వృత్తి, కష్టపడేతత్వం ఉన్న పని.

14 ఎంపీ సీట్లలో గెలుపు టార్గెట్​గా పెట్టుకున్నరు? ఈజీగా గెలిచేస్తరా? 

ఈజీ ఎట్లా అవుతుంది? ఒకపక్క 40 ఏండ్ల అనుభవంతోని కేసీఆర్​ ఉన్నడు. ఇంకోపక్క వ్యూహాలతోని, ఎత్తుగడలతోని నరేంద్ర మోదీ ఉన్నడు. మోదీకి కొన్ని ఏజెన్సీలు ఉన్నాయి. ఇవన్నీ ఎదుర్కోవాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం కేసీఆరే టార్గెట్​. ఇప్పుడు అట్లా కాదు. కనిపించెటోడు.. కనిపించనోడు.. వెయ్యి ఏనుగుల అంగబలం, అర్థ బలం ఉన్న మోదీని ఇప్పుడు ఫేస్​ చేయాలి. ఇది టఫెస్ట్​ టాస్కే. కాకపోతే దీన్ని డీల్​ చేయడమన్నది నాకు కొంత అలవాటైన పనే. ఇష్టమైన పని కూడా.

ప్రొఫెసర్​ జయశంకరే తెలంగాణ జాతిపిత

వీ6-వెలుగు: తెలంగాణ జాతిపితను ప్రకటించే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే మీ మనసులో ఎవరున్నరు?

సీఎం రేవంత్​: ప్రొఫెసర్​ జయశంకరే తెలంగాణ జాతిపిత. ఈ విషయాన్ని ఇప్పుడు కాదు ఇదివరకే స్పష్టంగా చెప్పిన. జయశంకర్​ సార్​ తెలంగాణ సిద్ధాంతకర్త. కేసీఆర్​ అనే వ్యక్తి ఆనాడు టీఆర్ఎస్​, ఈనాడు బీఆర్​ఎస్​ అధ్యక్షుడు మాత్రమే. కేసీఆర్​ ఉద్యమం ముసుగులో పార్టీని విస్తరించుకుండు. అధికారం చేపట్టిండు. ఆస్తులు సంపాదించుకుండు. కేసీయారే చెప్పిండు.. బీఆర్​ఎస్​ పక్కా పొలిటికల్​ పార్టీ అని, తాను పక్కా పొలిటీషియన్​నని. కేసీఆర్​కు, తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదు. అన్ని రాజకీయ పార్టీల లాగే ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని లబ్ధి పొందిండు. ఆయన​ చేసిన పనికి, వచ్చిన కూలి చాలా ఎక్కువ. కేసీఆర్​ ఒక్కడు వంద తరాలకు సరిపోయే గిట్టుబాటు చేసుకున్నడు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్​ జయశంకరే.. ఎవరికీ అనుమానం అక్కర్లేదు.

    రుణమాఫీపై మీ యాక్షన్​ ప్లాన్​ ఏమిటి? దీనికి సంబంధించి ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ ఏముంది?

2014 లో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్​తో రాష్ట్రాన్ని కేసీఆర్​కు అప్పగించారు. కానీ ఆయన రూ.​7 లక్షల కోట్ల అప్పు మిగిల్చి లోటు బడ్జెట్ తో మాకు రాష్ట్రాన్ని అప్పగించి వెళ్లిండు. నాగార్జునసాగర్, శ్రీశైలం. ఎస్సారెస్పీ, జూరాల ఇలా..రిజర్వాయర్లలో నీటి నిల్వలపై కూడా తప్పుడు లెక్కలే చెప్తుండు. నీళ్లులేవు.. నిధులు లేవు.. రెండింటినీ ఊడ్చి, ఎండబెట్టి, ఆరబెట్టిండు.  మేం అప్పులు, వడ్డీలకే రూ. 27 వేల కోట్లు కట్టినం.. జీతాలు ఇచ్చినం.. పెన్షన్లు ఇచ్చినం.. రైతు బంధు ఇచ్చినం..30 వేల ఉద్యోగాలు ఇచ్చినం.. అన్ని శాఖలను సమన్వయం చేసినం. ప్లాన్ ప్రకారం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్నం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకున్నం. జూన్ లో  ఫుల్ బడ్జెట్ పెడతం. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తయి?  రాష్ట్ర ఆదాయం ఎంత? చూసుకుంటం. అప్పు తీసుకునే వెసులుబాటు ఉంది. రైతులపై 30 వేల కోట్ల  నుంచి 31 వేల కోట్ల వరకు రుణం ఉన్నదని ప్రాథమిక అంచనా. రైతులు బ్యాంక్ ల నుంచి తీసుకున్న లోన్లకు ప్రభుత్వమే పూచీకత్తు ఇచ్చి విడతలవారీగా చెల్లిస్తుంది. 70 లక్షల మంది రైతులకు రూ. 30 వేల కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రయత్నం చేస్తామంటే టైమ్ ఇవ్వకుంటే ఎలా?.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తా.. ఇది మా ప్రభుత్వ గ్యారెంటీ.

విచారణలో తేలితే యాక్షన్​

    కాళేశ్వరం, కరెంట్ కొనుగోళ్లు, ఫోన్  ట్యాపింగ్ వ్యవహారాల్లో అధికారులపైనేనా యాక్షన్​.. సూత్రదారులపై ఏమైనా ఉంటుందా?

విచారణ మధ్యలో ఉంది. ఎవరిపై యాక్షన్​ అనేది విచారణ తర్వాత తేలుతుంది. ఏదైనా చేస్తే ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. విచారణ కోసం అవసరమైన వాళ్లను మాత్రమే కస్టడీలోకి తీసుకుంటున్నరు. వచ్చే అసెంబ్లీ సెషన్​ నాటికల్లా అన్నీ బయటపెడతాం. జూన్​ 4 వరకు ఎన్నికల కోడ్​ ఉంది. అప్పటివరకు నేను అధికారులతో  సమీక్ష చేయలేను. వాళ్ల నుంచి రిపోర్ట్​లు వచ్చే వరకు అసలు ఏం జరిగిందో నేను ప్రజలకు చెప్పలేను.  

పదేండ్లు కష్టపడుత.. వందేండ్ల డెవలప్​మెంట్​ చేస్త

ఇండియా టుడే, టైమ్స్ నౌ కు ఇచ్చిన ఇంటర్యూలలో దేశ సమస్యలపై ఎక్కువ మాట్లాడారు. దేశ రాజకీయాల్లోకి వెళ్లే చాన్స్​ ఉందా? 

దేశ సమస్యలపై నాకున్న అవగాహన మేరకు మాట్లాడుతున్న. పదేండ్లు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంట. పదేండ్లు  కష్టపడి వందేండ్లకు కావాల్సిన ప్రణాళికలు రూపొందించి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడం, రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడటమే నా జీవిత లక్ష్యం. పదేండ్ల తర్వాత పార్టీ పరిస్థితులు, ప్రకృతి సహకరిస్తే, నా దగ్గర ఎనర్జీ, విస్​డమ్​ ఉంటే అప్పుడు ఆలోచిస్త. 2024 నుంచి 2034 వరకు అకుంఠిత దీక్షతో ఎంత కష్టమైనా.. నిలబడి కాలానుగుణంగా తెలంగాణ కోసం పని చేయడమే నా లక్ష్యం. నాకు చాలా స్పష్టత ఉంది. ప్రణాళిక ప్రకారం పని చేస్త. పదేండ్లు తెలంగాణ కోసమే అంకితమవుత. ఎక్కడికి పోయేదీ లేదు. ఈ పదేండ్లు ఇక్కడే ఉంటా.. పదేండ్ల తర్వాత పార్టీ ఆదేశిస్తే, పరిస్థితులు అనుకూలిస్తే ఇతర బాధ్యతలు తీసుకుంట. లేదంటే నా అనుభవాన్ని వచ్చే జనరేషన్స్​కు అందిస్త. కేసీఆర్​ లా సంకుచిత స్వభావంతో నేను నా కొడుకు, మనుమడు, నా కులం, నా కుటుంబం అని దిక్కుమాలిన రాజకీయం చేయను. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకు ఆదర్శంగా ఉండే రాజకీయం చేయాలని లైఫ్​లైన్​ గీసుకున్న. యువత రాజకీయాల్లో రావాలనుకున్నప్పుడు గాంధీలు, సుభాష్​చంద్రబోస్​ వంటి వారిలా మనల్ని కీర్తించకపోయినా పచ్చి బూతులు తిట్టకుండా ఉంటే చాలు. కేసీఆర్​ ఏం చేసిండు? వాళ్ల ఫ్యామిలీలో కొడుకును తండ్రి నమ్ముతలేడు. తండ్రిని కొడుకు నమ్ముతలేడు, తండ్రిని బిడ్డ నమ్మలేని పరిస్థితి ఉంది. తెలంగాణ సమాజం ఇప్పుడు వారిని బహిష్కరించింది. ఇన్నేళ్లు ఇంత కొట్లాడినా.. ఇంత సాధించిన అని కేసీఆర్​ అంటున్నడు. ఏం సాధించిండు? ఆయన కూతురు జైలుకు పోతే తెలంగాణ సమాజం స్పందించిందా? ఆయన కాలు విరిగితే ఎవరైనా  పరామర్శించడానికి వెళ్లారా? ఆయన ఏం అనుకుంటుండో, ఏం చెప్పుకుంటుండో అర్థం కావడం లేదు. ఆయన వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం లేదు. నేను చంద్రశేఖరరావులా ఉండదల్చుకోలేదు. కాకిలా వేల సంవత్సరాలు ఉండదల్చుకోలేదు. ఉన్న కొద్దికాలమైనా క్వాలిటీ తో ప్రజల పట్ల గౌరవంగా ఉండదల్చుకున్న. అంతేకానీ అధికారం దొరికింది కదా అని ఆదరాబాదరాగా అంతా తినేసి ఎక్కువ కాలం  సీటును పట్టుకుని వేలాడుతూ, ప్రజల ఛీకొట్టినా, ఈ సీటు నాకే కావాలంటూ కాకిగోల కూడా నేను చేయదల్చుకోలేదు. సరిగ్గా పదేండ్లు 2024– 2034 వరకు వందశాతం తెలంగాణ కోసం కమిట్​మెంట్​తో పని చేస్త. తర్వాత హాయిగా జాతీయ స్థాయిలోనో లేక పోతే పిల్లలతో గడుపుతా. లేదా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారికి సలహాలు సూచనలు చేసుకుంటూ కాలం గడుపుదామన్నదే నా ఆలోచన. అంతేకానీ చెట్టుమీది కోతిలా దుంకుడు వ్యవహారాలు మాత్రం చేయను.

పదవులు కావాలని  ఫ్రెండ్స్ వస్తుంటారా?

కొందరు ఫ్రెండ్స్ ఉంటరు.  నువ్వు నాకు క్లోజ్​కదా  రాజ్యసభ ఇస్తే ఏం బోయింది? అని చనువుతోని అంటరు. పదవి అనేది పార్టీ సొత్తు. ఎవరికి ఇవ్వాలో పార్టీ నిర్ణయించాలి.. నేను కాదు. ఫ్రెండ్​అయితే డైరెక్ట్​గా ఇంటికి వచ్చి నాతో కలిసి తినొచ్చు. నాతో స్టేడియానికి వచ్చి క్రికెట్​చూడొచ్చు. కానీ పార్టీపరంగా, ప్రభుత్వపరంగా అప్పనంగా ఎవరికి ఏమీ రాదు. ఫ్యామిలీ వేరు.. పార్టీ వేరు.. ప్రభుత్వం వేరు.. కేసీఆర్​లాగా కుటుంబమే ప్రభుత్వం, కులమే విధానం లాంటివి నా దగ్గర కుదరదు. 

ఎంపీ ఎన్నికలు మీ 100 రోజుల పాలనకు రెఫరెండం అన్నారు. దీనికి కట్టుబడి ఉన్నారా?

ఎస్​. మా పాలనకు పార్లమెంట్​ ఎన్నికలు నూటికి నూరుశాతం రెఫరెండం.  డిసెంబర్​7 నుంచి ఎలక్షన్​ కోడ్​అమల్లోకి వచ్చిన  మార్చి 17 వరకు నా 100 రోజుల పరిపాలన మీద, మా మంత్రివర్గ నిర్ణయాల మీద, చేపట్టిన చర్యల మీద  తీర్పు ఇవ్యాలని కోరుతున్న. నేను ముసుగు తొడుక్కోదలచుకోలే.  నేను చెప్పింది, చేసింది, ఈ 100 రోజుల్లో ప్రజల్లో నేను మెలిగిన విధానం మీ కండ్ల ముందు ఉన్నది. ఎమోషన్స్​ మీదనో, కులం​ మీదనో, విశ్వాసాల మీదనో, మతం మీదనో తీర్పు ఇవ్వకండి. చిత్తశుద్ధితో పరిపాలన అందించినం. ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ఏ ఒక్క గంట కూడా వృథా చేయలేదు. అందుకే నా పరిపాలన మీద జడ్జిమెంట్​ రాయాలని అడుగుతున్న. 

ఈడీని చూపి మోదీ ప్రతిపక్షాలను భయపెట్టినట్టు, పోలీసులను చూపి రేవంత్‌ భయపెడుతున్నరు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అందుకే బయటకు తెచ్చారు అని విమర్శిస్తున్నాయి. మీరేమంటారు?

నేను పోలీసులతోని రాష్ట్రాన్ని నడపదల్చుకుంటే, ఎవ్వరూ ఇంట్లో నుంచే బయటకెళ్లరు. మేము పదేండ్లు ప్రతిపక్షంలో ఉండి ఎక్కడికి పోదామన్నా, పోలీసులు అడ్డుకున్నరు. ఇప్పుడు మేం కేసీఆర్‌‌నైనా, హరీశ్‌రావునైనా ఇంకెవరైనా బందోబస్తు కల్పించి మరి తిరగమంటున్నం. ప్రజల సమస్యలు తెలుసుకుని మా దృష్టికి తీసుకురమ్మని చెబుతున్నాం. ప్రజలు వాళ్లకు ఆ పాత్ర ఇచ్చిన్రు. మాకు ఈ పాత్ర ఇచ్చిన్రు. ఇప్పటివరకూ ఫోన్ ట్యాపింగ్ మీదికి నేను పోనే లేదు. యాక్చువల్‌గా కేసు అయింది ఫోన్ ట్యాపింగ్ మీద కాదు. ప్రణీత్‌రావు, ప్రభాకర్‌‌రావు, కొంత మంది అధికారులు కలిసి ఎస్‌ఐబీ ఆఫీసులో డిసెంబర్ 3 నాటి ఎన్నికల ఫలితాల తర్వాత సీసీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేసి, డిసెంబర్ 4 నాడు ఎలక్ట్రిక్ రంపం తీసుకొచ్చి అక్కడున్న సర్వర్లు, కంప్యూటర్లు, ఎక్విప్‌మెంట్‌ను కట్ చేశారు. కొన్నింటిని తగలబెట్టి, కొన్నింటిని తీసుకెళ్లి మూసీలో పడేశారు. డిసెంబర్ ఎండింగ్‌లో అధికారుల బదిలీల తర్వాత, కొత్త అధికారులు అక్కడికి వెళ్లినప్పుడు ఆఫీసులో ఎక్విప్‌మెంట్ మిస్సింగ్ ఉంది. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఉన్నట్టు గుర్తించి, సంబంధిత ఆపరేటర్‌‌ను పిలిస్తే అసలు విషయం బయటకొచ్చింది.  ప్రభుత్వ ఎక్విప్‌మెంట్ మిస్సింగ్ కేసు పంజాగుట్టలో నమోదు చేసిన్రు. ఆ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తూ తీగలాగితే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడింది. అంతే తప్ప, మేమెవరం కంప్లైంట్ చేయలేదు. ప్రభుత్వ అధికారులే ఫిర్యాదు చేసిన్రు, వాళ్లే ఎంక్వైరీ చేస్తున్నరు. 

కేసీఆర్ ​పాలనతో పోలిస్తే మీ పాలన ఎలా ఉందని భావిస్తున్నారు?

లాస్ట్​ఇయర్​2022 డిసెంబర్​7 నుంచి 2023 ఏప్రిల్​28 వరకు కేసీఆర్​పాలనను,  2023 డిసెంబర్​7 నుంచి 2024 ఏప్రిల్​28వరకు నా పాలనను జర్నలిస్టులుగా మీరే పోల్చి చూడండి. డే బై డే , సబ్​స్టేషన్​ బై సబ్​స్టేషన్​ పవర్​ ఎక్కువ ఇచ్చినమా? తక్కువ ఇచ్చినమా? కంపెయిర్​​చేయండి. ఇదే కాదు, వాటర్​సప్లై, ల్యాండ్​ రిజిస్ట్రేషన్స్​,  మున్సిపల్​పర్మిషన్స్, ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, సామాజిక పింఛన్లు.. ఇలా ఎక్కువ ఇచ్చామో, తక్కువ ఇచ్చామో, టైంకు ఇచ్చామో, లేట్​ఇచ్చామో చూడండి.  అలాగే, జీఎస్టీ , వ్యాట్​ కలెక్షన్స్.. పన్నుల వసూళ్ల లెక్కతీయండి.  ఒట్లు, తిట్లు  పక్కనపెట్టి పరిపాలన తీరునే పోల్చి చూడండి. కేసీఆర్​కంటే ఎందులో తగ్గినా ఆయన వేసే  శిక్షకు నేను రెడీ. పరిపాలనలో పోల్చడం పక్కనపెట్టి పొద్దున లేస్తే కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు, కూతురు మా ప్రభుత్వం మీద పడి ఏడుస్తు న్నరు. కేసీఆర్​ నోరు తెరిస్తే అబద్ధాలే. ఆ అబద్ధాల వల్లే జనం ఆయనను తిరస్కరించిన్రు. ఆయనలో ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకుంటున్న. ఆయన వయస్సులో పెద్దోడు.. అనుభవంలో పెద్దోడు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్, కోదండరాం లాంటి వాళ్లతోని కలిసి నడిచిండు. ఆయనకున్న అనుభవాన్ని తెలంగాణ కోసం వాడితే నేను స్వాగతిస్తా.

కాంగ్రెస్​ వస్తే ఆస్తులు గుంజుకుంటదని మోదీ ఆరోపిస్తున్నరు.. మీరేమంటరు?

మోదీ మాట్లాడే పచ్చి అబద్దాలకు మేం వివరణ ఇచ్చుకుంటపోయి.. ఎన్నికల ప్రణాళికలు వదిలేసి ట్రాప్​లో పడాలనేది ఆయన కోరిక. మా మేనిఫెస్టోను అఫీషియల్​గా అందరి ముందు పెట్టినం. అందులో ఎక్కడైనా ఆస్తులు గుంజుకుంటదని ఉందా? ఆరోపణలు చేసేటాయన స్పష్టం చేయాలి. దుష్ప్రచారం చేయడమే బీజేపీ వాళ్ల పని. నమో అంటేనే నమ్మించి మోసం చేయడం. రెండు సార్లు ప్రజలను మోసం చేసిండు. ఈసారి మూడోసారి కాబట్టి అబద్ధాలను గట్టిగా అరచి చెప్తున్నడు. ఇప్పుడు మోదీ అరచి, గోల పెట్టినా నమ్మే  పరిస్థితులు రాష్ట్రంలో, దేశంలో లేవు. భార్య ఆస్తి భర్త అవసరానికి వాడుకుంటే తిరిగి వెనక్కి ఇవ్వాల్సిందేనని చట్టం స్పష్టంగా చెప్తుంటే... ఆస్తులు గుంజుకుంటరు, ఇండ్లు పోతయ్​ అనే ఆలోచన వాళ్లకు(బీజేపీకి) ఎందుకు వస్తున్నది? 400 సీట్లు గెలుస్తమని అంటరు. కాంగ్రెస్​ గెలిస్తే ఆస్తులు గుంజుకుంటరని వాళ్లే అంటరు. భయమనేది బీజేపీ వాళ్ల మాటల్లో కనిపిస్తున్నది. కేంద్రంలో ప్రభుత్వం మారుతుందనడానికి ఇంతకు మించి సంకేతం లేదు. 

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తదా? లేక మీవి పొలిటికల్ ఆరోపణలేనా?​ 

బీజేపీలో చాలా మంది నాయకులు రిజర్వేషన్ల రద్దు గురించే మాట్లాడుతున్నరు. మొన్ననే ఉత్తరప్రదేశ్​ బీజేపీ ప్రముఖ నాయకుడు మీటింగ్​కు వచ్చిన ప్రజలతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తదని స్లోగన్స్​ ఇప్పిచ్చిండు.​ ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ కూడా రిజర్వేషన్ల రద్దు గురించే మాట్లాడిండు. రిజర్వేషన్ల రద్దు అనేది బీజేపీ విధానం. ఈ విధానాన్ని వాళ్లు సీక్రెట్​గా నడుపుతున్నరు. రిజర్వేషన్లను రద్దు చేయడానికే బీజేపీ 2/3 మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నది. మేం అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను 50శాతానికి పైగా పెంచుతం. బీసీ కులగణన చేసి రిజర్వేషన్లను 27 శాతం నుంచి 50 శాతానికి పెంచుతం. ఇదే విషయాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా నాయకులం అందరం ఒకే మాట చెప్తున్నం. ఇదే విషయాన్ని మోదీ ఎందుకు చెప్పలేకపోతున్నరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల రద్దు చేయబోమని, భవిష్యత్తులో జనాభా లెక్క గట్టి రిజర్వేషన్లు పెంచుతమని మోదీ, అమిత్​ షా ఎందుకు ప్రకటించడం లేదు. కేసీఆర్​ కూడా బీజేపీని ప్రశ్నిస్తలేడు. కాంగ్రెస్ నే విమర్శిస్తున్నడు. దీన్ని బట్టి బీజేపీ​ఎజెండా స్పష్టంగా బయటపడుతున్నది. రాజకీయ పార్టీ పేరుమీద ఉన్న కార్పొరేట్​ కంపెనీ బీజేపీ. బీజేపీ వాళ్ల ఆలోచనే క్రోని క్యాపిటలిజం. కార్పొరేట్​ కంపెనీల్లో రిజర్వేషన్లు ఉండవు. అదానీ, అంబానీ కంపెనీల్లో రిజర్వేషన్లు ఉన్నయా? కాంగ్రెస్​ నిర్మించిన రైల్వేస్​ మొత్తం కార్పొరేట్లకు మోదీ అప్పచెప్పిండు. మేం నిర్మించిన బీఎస్​ఎన్​ఎల్​ కూడా కార్పొరేట్లకు అప్పజెప్పిండు. వాటిలో ఇప్పుడు ఏమైనా రిజర్వేషన్లు ఉన్నయా? పోర్టులను కార్పొరేట్లకు అప్పచెప్పిండు అందులో ఏమైనా రిజర్వేషన్లు ఉన్నయా?  30 లక్షల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పదేండ్లలో వాటిని ఎందుకు భర్తీ చేయలే? భర్తీ చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వచ్చేవి కదా. ప్రైవేటైజ్​ చేస్తే ప్రైవేట్​వాళ్లే భర్తీ చేసుకుంటరని కదా... ఇన్ని రోజులు ఖాళీగా పెట్టింది. ఈ దేశంలో పాలకులు, బానిసలు రెండే వ్యవస్థలు ఉండాలనేది బీజేపీ విధానం. ఇదే విధానం ఈస్ట్​ ఇండియా కంపెనీది కూడా. ఈస్ట్​ ఇండియా కంపెనీ 1720 గుజరాత్​లోని సూరత్​లో ఎంటర్ అయి... దేశాన్ని ఆక్రమించుకుంది. ఇప్పుడు కూడా అదే సూరత్​ ప్రాంతం నుంచి వచ్చారు కదా. అదానీది సూరతే కదా. ఈస్ట్​ ఇండియా కంపెనీకి నకలే బీజేపీ వాళ్లు. 

మీ కూతురి నిశ్చితార్థం రోజు మిమ్నల్ని జైల్లో వేశారు కనుకే ప్రతీకారం తీర్చుకుంటున్నారు అనే వాళ్లకు మీరేం సమాధానం చెబుతారు?

అలా మాట్లాడేవాళ్లది అవగాహనారాహిత్యం అంటాను. దేవుడు ఉంటడు, ప్రకృతి ఉంటది అని నేను ఎప్పుడూ చెబుతుంటాను. నా బిడ్డ పెండ్లికి రాకుండా నన్ను జైల్లో వేసిన కేసీఆర్ బిడ్డను తీసుకెళ్లి ఇప్పుడు జైల్లో వేశారు. ఓ తండ్రికి అంత కంటే శిక్ష ఇంకేముంటది? నువ్వు నడుప లేవు, నడుపలేవు అన్నడు కేసీఆర్‌, ఇప్పుడు ఆయనే నడవకుండా బోర్ల పడ్డడు.  సో అతిగా వ్యవహరించినోళ్లకు ప్రకృతే జవాబు చెబుతుందనడానికి ఇవే ఉదాహరణలు. నాకు ఇంత పెద్ద బాధ్యత ప్రజలు ఇస్తే, ఈ పిల్లిబిత్తిరి గాళ్లతో నాకేం పంచాయితీ. నేను కక్ష సాధించేంత స్థాయి వాళ్లకు లేదు.

ఇంత బిజీగా ఉంటారు కదా! ఫ్యామిలీని ఎలా మేనేజ్​ చేస్తారు? ఫ్యామిలీ నుంచి ఏమైనా కంప్లయింట్స్​ ఉంటయా?

ఉంటాయి కానీ నాకు చెప్పరు పెద్దగా. నాకు చెప్పినా లాభం లేదని వారికి తెలుసు. నా పరిస్థితిని బట్టి వారు లైఫ్​ను అలా మార్చుకున్నరు. అందుకే నాకు కంఫర్ట్​గా ఉంది. ఫ్యామిలీలో కంఫర్ట్​ లేకపోతే క్వాంటిటీగా చేయవచ్చేమో కానీ క్వాలిటీగా పని చేయలేం. నాకు క్రికెట్​ అంటే పెద్దగా ఇంట్రస్ట్​ ఉండదు. అయితే మొన్న క్రికెట్​కు సీఎం హోదాలో బహుమతి ఇవ్వడానికి వెళ్లాల్సి వచ్చింది.