తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..మార్చి 18న జూన్ నెల దర్శన టికెట్లు రిలీజ్

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..మార్చి 18న  జూన్ నెల దర్శన టికెట్లు రిలీజ్

తిరుమల శ్రీవారి భక్తులకు  టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ నెల దర్శన టికెట్లు, గదుల వివరాలను టీటీడీ  వెల్లడించింది.  తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత , సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవకు సంబంధించిన  జూన్  నెల కోటాను మార్చి 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు తెలిపింది.

ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు మార్చి 20 నుంచి  22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు  డబ్బులు  చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

 ఏ టికెట్లు ఎపుడంటే..?

  • కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లను మార్చి 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.
  • వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను  మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.
  • అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను మార్చి 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
  • శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను మార్చి 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
  • వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. 

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.  తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.