తుఫాను కారణంగా భారీ వర్షాలతో అతలాకుతలం అయిన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇదే సమయంలో మరో బాంబ్ పేల్చింది వాతావరణ శాఖ (IMD). బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. 2025 నవంబర్ 14వ తేదీన శ్రీలంక సమీపంలో ఏర్పడిన అల్పపీడనం.. నైరుతి దిశగా కదులుతూ.. ఇవాళ (నవంబర్ 15) శ్రీలంక తీరాన్ని తాకినట్లు వెల్లడించింది.
సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కదులుతున్నట్లు తెలిపింది. ఇది వచ్చే 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీంతో బంగాళాఖాతం నైరుతి, పశ్చిమ దిశగా అండమాన్ సముద్ర మార్గంలో ఆవర్తనం కదులుతున్నట్లు చెప్పారు. దీంతో దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సోమవారం (నవంబర్ 17) వరకు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
