లులు మాల్‌‌‌‌‌‌‌‌లో కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు

లులు మాల్‌‌‌‌‌‌‌‌లో కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు

హైదరాబాద్, వెలుగు: భారత సాయుధ దళాల ధైర్యసాహసాలు, శౌర్యం, త్యాగాలను స్మరించుకుంటూ హైదరాబాద్‌‌లోని లులు మాల్‌‌లో ‘కార్గిల్ విజయ్ దివస్’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాల్ అట్రియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అమర్ జవాన్ నివాళి కార్యక్రమం, రక్షణ రంగానికి సంబంధించిన ప్రదర్శనలు సందర్శకులు, విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా వారిలో జాతీయ భావాన్ని నింపాయి. ఈ సందర్భంగా లులు మాల్ రీజినల్ మేనేజర్ షరీఫ్ ఒక ప్రకటన జారీ చేశారు. 

1999 కార్గిల్ యుద్ధంలో మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఈ కార్యక్రమం ద్వారా ఘనంగా నివాళులర్పించామని తెలిపారు. భారత రక్షణ రంగానికి ఉన్న ఘనమైన చరిత్రను, దేశసేవలోని అమూల్యమైన స్ఫూర్తిని సందర్శకులకు తెలియజేసేలా ఈ ప్రదర్శనను తీర్చిదిద్దామని చెప్పారు. కార్గిల్ యుద్ధ అమరుల త్యాగానికి గుర్తుగా మాల్‌‌లో ప్రత్యేక స్మారక ప్రదర్శనా వేదికను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో కూకట్‌‌పల్లికి చెందిన ‘మౌంట్ లిటెరా జీ స్కూల్’ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మాల్ సందర్శకులు పాల్గొన్నారని వెల్లడించారు. విద్యార్థులు గైడ్‌‌ల సమక్షంలో ఈ ఎగ్జిబిషన్‌‌ను సందర్శించి, భారత మిలిటరీ చరిత్ర, సాయుధ దళాల విశిష్టత గురించి విలువైన విషయాలను తెలుసుకున్నారని వివరించారు.