పాత కక్షలతోనే రౌడీ షీటర్ హత్య

పాత కక్షలతోనే రౌడీ షీటర్ హత్య

మాదాపూర్, వెలుగు: ఐదు రోజుల కిందట జరిగిన రౌడీషీటర్ హత్య కేసును మాదాపూర్ పోలీసులు ఛేదించారు. పాత కక్షల కారణంగా ముగ్గురు వ్యక్తులు రౌడీషీటర్​ను చంపినట్లు తేల్చారు. ఈ కేసులో ఆ ముగ్గురితో పాటు ట్రాన్స్ జెండర్​ను అరెస్ట్ చేశారు. బుధవారం మాదాపూర్ పీఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ కేసు వివరాలు వెల్లడించారు. బోరబండ ప్రాంతానికి చెందిన నదీమ్ హుస్సేన్(30) ఫ్లవర్ డెకరేటర్​గా పనిచేస్తున్నాడు. సనత్​నగర్, బోరబండ పరిధిలో హత్య కేసుల్లో నదీమ్ నిందితుడిగా ఉన్నాడు. దీంతో బోరబండ పోలీసులు అతడిపై రౌడీషీట్ తెరిచారు. బోరబండ ప్రభుత్వ స్కూల్ ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ అజీజ్ అహ్మద్(20), సేల్స్​మెన్ షేక్ రిజ్వాన్(19), చెత్త సేకరణ చేసే మహేశ్(21) ముగ్గురూ ఫ్రెండ్స్. వీరికి నదీమ్​తో పాత గొడవలు ఉన్నాయి. తన వ్యవహారాల్లో కలుగజేసుకుంటే చంపేస్తానని చాలాసార్లు అజీజ్​ను నదీమ్ బెదిరించాడు. దీంతో నదీమ్​ను చంపేందుకు అజీజ్ తన ఫ్రెండ్స్ రిజ్వాన్, మహేశ్​తో కలిసి స్కెచ్ వేశాడు.

బర్త్ డే పార్టీకి పిలిచి.. మద్యం తాగించి..

ప్లాన్ ప్రకారం అజీజ్ ఓ కత్తిని ఆన్ లైన్​లో ఆర్డర్ చేసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ నెల 13న నదీమ్​కు కాల్ చేసి తన ఫ్రెండ్ మహేశ్​బర్త్ డే ఉందని.. పార్టీ చేసుకుందామని పిలిచాడు. ముందుగా అజీజ్, నదీమ్ ఇద్దరూ బైక్ పై మాదాపూర్ పరిధి భాగ్యనగర్ సొసైటీలోని ఖాళీ ప్రదేశానికి వెళ్లి మద్యం తాగారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటలకు రిజ్వాన్, మహేశ్​అక్కడికి చేరుకున్నారు. అజీజ్, రిజ్వాన్​తమ వెంట తెచ్చుకున్న కత్తులతో నదీమ్​ పొట్ట, వీపు బాగాల్లో పొడిచారు. కత్తితో గొంతు కోశారు. ఆ తర్వాత ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. అజీజ్ కేపీహెచ్ బీ కాలనీలో ఉండే తనకు తెలిసిన ట్రాన్స్ జెండర్ శ్యామలా దేవి(32) ఇంటికి వెళ్లాడు. రక్తపు మరకలు అంటిన షర్ట్​ను అమెకు ఇచ్చాడు. ఆమె ఆ షర్ట్​ను తగులబెట్టింది. ఇందుకోసం శ్యామలకు అజీజ్ డబ్బులు ఇచ్చాడు. మరోవైపు నదీమ్ హత్య ఘటనపై సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం నాలుగు టీమ్స్​తో గాలించారు. అజీజ్​ను లింగంపల్లిలో, రిజ్వాన్, మహేశ్​ను తాండూరులో పట్టుకున్నారు. సాక్ష్యాలను మాయం చేయడమే కాకుండా నిందితుడికి ఆశ్రయం కల్పించిన శ్యామలా దేవిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 కత్తులు, 2 బైక్ లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.