ఏసీలపై ఓవర్ లోడ్ వల్లే ఎక్కువ అగ్ని ప్రమాదాలు..: ‘వీ6వెలుగు’తో మాదాపూర్ డీఎఫ్ఓ కరిముల్లా

ఏసీలపై ఓవర్ లోడ్ వల్లే ఎక్కువ అగ్ని ప్రమాదాలు..: ‘వీ6వెలుగు’తో మాదాపూర్ డీఎఫ్ఓ కరిముల్లా
  • త్వరలోనే తెలంగాణలో కొత్త అగ్ని ప్రమాదాల చట్టం
  • ఫైర్ సేఫ్టీ ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు.. జైలు శిక్ష!

మాదాపూర్, వెలుగు: వేసవికాలం కావడంతో ఏసీలపై ఓవర్ లోడ్ పడి నగరంలో షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయని మాదాపూర్ డీఎఫ్ఓ ఖాజా కరిముల్లా తెలిపారు. వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చట్టం మార్పులపై ఫోకస్ పెట్టిందన్నారు. మంగళవారం ‘వీ6 వెలుగు’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. 

తెలంగాణ ఫైర్ సర్వీసెస్ చట్టం-1999కి కీలక సవరణలు చేస్తూ మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో సరికొత్త ‘అగ్ని ప్రమాదాల చట్టం’ తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త చట్టం ప్రకారం ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారికి భారీ జరిమానాలతో పాటు, కేసు తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందన్నారు. ఇకపై అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులతో పాటు ఫైర్ అధికారుల విచారణ నివేదిక కూడా అత్యంత కీలకంగా మారుతుందని, ఫైర్ ఎన్ఓసీ ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని 
స్పష్టం చేశారు.

సెల్లార్లను పార్కింగ్ కోసమే వాడాలి

నగరంలోని బిల్డింగ్ సెల్లార్లను కేవలం పార్కింగ్ కోసమే వాడాలని పదేపదే చెబుతున్నా, కొందరు యజమానులు నిర్లక్ష్యంతో అందులో ఫర్నిచర్, ఇతర వస్తువులు ఉంచుతున్నారని.. భద్రతా ప్రమాణాలు పాటించని వారికి నోటీసులు ఇస్తున్నామని డీఎఫ్ఓ తెలిపారు. ప్రస్తుతం షాపింగ్ మాల్స్, హోటల్స్, హాస్పిటళ్లపై ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 

ఫైర్ సేఫ్టీ విషయంలో బిల్డింగ్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు భయపడకుండా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అగ్ని ప్రమాదాలపై నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలు కూడా ఫైర్ సేఫ్టీపై పూర్తి అవేర్నెస్ కలిగి ఉండాలని ఖాజా కరిముల్లా సూచించారు.